యోగ సాధనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే ఎనిమిది అంగాలతో కూడిన అష్టాంగ యోగ మార్గాన్ని రూపొందించాడు పతంజలి మహర్షి. యమ, నియమాలు రెండూ వ్యక్తిగత క్రమశిక్షణకు, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయి. వీటి సాధనే నిజమైన యోగ జీవనం. ‘నియమస్తు యత్కర్మ అనిత్యమాగన్తు సాధనమ్’- నిత్యం చేయాలనే నిర్బంధం లేనివి నియమాలు. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (ఈశ్వరుడిపై మనసు లగ్నం చేయడం) ఈ ఐదింటిని పతంజలి మహర్షి నియమాలుగా పేర్కొన్నాడు. వీటిని పాటించడం వల్ల జీవన విధానం ఆదర్శవంతంగా మారుతుంది. ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అవరోధాలూ దూరమవుతాయి.
శౌచం అంటే పరిశుభ్రత, స్వచ్ఛత. ఇది బాహ్యశౌచం, అంతర్శౌచం అని రెండు రకాలు. బాహ్య ఇంద్రియాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత బాహ్య శౌచం. అంతరింద్రిమైన మనసులోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే వికారాలను తొలగించుకోవడం అంతర్శౌచం. ఆధ్యాత్మిక ఉన్నతికి శౌచం, అందులోనూ అంతర్శౌచం అత్యంత ముఖ్యం. సంతోషం అంటే మనసును తృప్తిగా ఉంచడం. తనకున్న ధనం, వృత్తి తదితర విషయాలపై తృప్తి కలిగి ఉండటం. మనసు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. తపస్సు అంటే తీవ్ర నిష్ఠ. ఒక లక్ష్యసాధనకు తీవ్ర కృషిచేయడమే తపస్సు. తనను తాను నియంత్రించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం, మానసిక సంయమనం పాటించడం, ఆటంకాలను ఎదుర్కోవడం కూడా తపస్సే. నిరంతర తపస్సు వల్ల ఇంద్రియాలు శక్తిమంతమవుతాయి. తపస్సు వల్ల సహన గుణం పెరుగుతుంది.
నియమ నియమాల్లో స్వాధ్యాయం మరొకటి. స్వాధ్యాయం అంటే మంచి గ్రంథాలను చదువడం. పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహా భారతాది గ్రంథాలను అధ్యయనం చేయడం. వాటిలోని విషయాలను ఆకళింపు చేసుకోవడం. వాటిని మననం చేయడం. అందులోని ధర్మాలను పాటించడం. ఇంకా లోతుగా తనను తాను అధ్యయనం చేయడం కూడా స్వాధ్యాయమే. అంటే ధర్మాలను నిర్వర్తిసూ, తనను తాను పరీక్షించుకుంటూ, తన ఆలోచనల్లో మార్పులను గమనిస్తూ ఉన్నతమైన స్థితిని చేరుకోవడం నిజమైన స్వాధ్యాయం.
తనను తాను పరమాత్మకు సమర్పించుకోవడం, పరమాత్మ శరణు కోరడం ఈశ్వర ప్రణిధానం. ఈ జగత్తంతా పరమాత్మతో నిండి ఉన్నదని, పరమాత్మ సహకారంతోనే ఈ సృష్టి జరుగుతున్నదని, ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకు కారకుడు పరమాత్మే అన్న భావన కలిగి ఉండి, తాను నిమిత్తమాత్రుడినని దైవానికి లొంగి ఉండటం ఈశ్వర ప్రణిధానం.
ఇవేకాకుండా క్షమ, ధృతి (ధైర్యంగా ఉండటం), దయ, రుజు ప్రవర్తన, కపటం లేకుండుట, దానాలు చేయడం, వ్రతాలు, జపాలు చేయడం వంటివి కూడా యమ, నియమాలలో పేర్కొన్నారు. అన్నిటినీ మించి మౌనం పాటించడం అత్యంత ఆవశ్యకం. అవసరానికి మించి మాట్లాడకపోవటం, మాటల్లో కూడా సత్యం, హితం కలిగి ఉండటమూ మౌనంగానే చెప్తారు! మనిషి భావనలు పారదర్శకత కలిగి ఉండాలి. యమ, నియమాలు రెండూ మనిషి క్రమశిక్షణకు, మానసిక శాంతికి దోహదం చేస్తాయి. వాటితోపాటు అష్టాంగ మార్గంలో పతంజలి సూచించిన ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియలు. సరైన గురువు మార్గదర్శకత్వంలో వీటిని సాధన చేయడం వల్ల అలౌకికమైన ఆనందం, మహోన్నతమైన మోక్షం సిద్ధిస్తాయి.