శరీరం త్వం శంభోః శశి మిహిర వక్షోరుహ యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్
అతశ్శేషశ్శేషీ త్యయ ముభయ సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః!
(సౌందర్యలహరి – 34)
‘తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది. అంటే మీ ఇద్దరికీ శేష శేషీభావం సమానమని తెలుస్తున్నది. ఒకరు శేషం (అప్రధానమైనది) మరొకరు శేషి (ప్రధానమైనది)’ అని అమ్మవారిని స్తుతించారు ఆదిశంకరులు.
శరీరం అంటే కనిపించేది. అది అప్రధానమైనది. అంటే ప్రధానం కానిది. కానీ కనిపించనిది, ప్రధానమైనది ఆత్మ. ఈ రెండూ ఉన్నప్పుడే సృష్టి సాధ్యం. అమ్మ! ఒకప్పుడు సూర్యచంద్రులు స్తనాలుగా అంటే పోషకురాలిగా శరీరం దాలుస్తుంది. (పాతాళం పాదాలుగా, ఆకాశం తలగా ఉన్నప్పుడు సూర్యచంద్రులు అమ్మ స్తనాలుగా కనిపిస్తారు). అప్పుడు శంభుడు ఆత్మవుతాడు. అలాగే ఒకప్పుడు శంకరుడు దేహమవుతాడు. ఆ దేహంలో అమ్మవారు ఆత్మగా మారుతుంది. అందుకే ఈ ఇద్దరు ఒకరు ఆధారం, మరొకరు ఆధేయం. భావరూపంలో ఏకత్వాన్ని పొంది సామరస్యంతో కూడి ఉంటుంటారు. కాబట్టి ఈ ఉభయులకు సమానత్వం ఉన్నదని చెప్తారు శంకరాచార్యులు. పరానందపరయోః.. పరానందం అంటే స్వయం సిద్ధమైన, నిర్మలమైన ఆనందం. కారణం లేకుండా కలిగే ఆనందమే పరానందం.
ప్రపంచంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ భావసారూప్యత కలిగి ఏకత్వాన్ని పొందాలనే బోధ అంతర్లీనంగా ఈ శ్లోకంలో కనిపిస్తున్నది.భగవతీ అంటున్నాడు ఆదిశంకరులు. భగము అంటే ఉన్న ఎన్నో అర్థాలలో శక్తి ప్రధానమైనది. భగవతి అంటే శక్తిస్వరూపిణి లేదా ఆనందభైరవి. జన్మ, స్థితి, వృద్ధి, విపరిణామం, క్షయం, నాశం ఈ ఆరు విషయాలు తెలిసిన పరమేశ్వరి. అలాగే భగము కలిగినవాడు భగవానుడు. ఆ శక్తిస్వరూపిణి తనదైనవాడు. ఆనందభైరవుడు. నిజానికి శివుడు ప్రత్యేకంగా లేడు.. ఉన్నదొక్కటే.. అదే ఆదిశక్తి. ఆవిడే ఆనందభైరవి. నవాత్మకుడు శివుడు. అంటే తొమ్మిది ప్రకృతులు కలవాడు. అవ్యక్త స్థితి, విత్తన దశ, బుద్ధి దశ, మనోదశ. ఈ నాలుగింటిని శివచక్రాలంటారు. ఇవన్నీ కూడా అవ్యక్తంగానే ఉంటాయి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవి వ్యక్తమయ్యేవి. అలాగే తొమ్మిది వ్యూహాలు కలిగినవాడు పరమేశ్వరుడు. ఇతను పరానందుడు, పరాత్మకుడు. తొమ్మిది ఆవరణాలు కలిగినది అమ్మ. ఆమే చిచ్ఛక్తి, చేతన రూప, జడశక్తి, జడాత్మిక అని లలితా సహస్ర నామాలు కీర్తించిన లలితాపరాభట్టారిక.
శ్లోకంలో ‘అనఘామ్’ అనే శబ్దాన్ని ప్రయోగించాడు ఆదిశంకరుడు. అనఘామ్ అంటే పాపరహితుడు అని అర్థం. ఏ విషయ బంధనాలకు చిక్కనివాడని భావం. అలాంటివాడే చిదానందజ్ఞాన స్వరూపుడు. ఇలాంటి అమ్మ-అయ్యలు ఒకరు వ్యక్తమైన వేళ మరొకరు అవ్యక్తంగా చెట్టులో బీజం, బీజంలో చెట్టు ప్రక్షిప్తంగా ఉన్నట్లుగా ఉంటారు. ఈ ఇద్దరిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఎలాగైతే అవయవాలు, చైతన్యాల (శేష, శేషి)లా ఉభయులూ సాధారణులే. అంటే ఇద్దరూ ప్రధానులే. ఇద్దరూ అప్రధానులే. సృష్టి, స్థితి సమయాల్లో అమ్మ వ్యక్తమవుతుంది. అయ్య అవ్యక్తమవుతాడు. లయకాలంలో ఆయన వ్యక్తమవుతాడు. ఆమె అవ్యక్తమవుతుంది. తిరోధాన అనుగ్రహ వేళలో ఇద్దరూ కలసి కనిపిస్తారు. అలాంటి శివశక్తుల ఏకస్వరూపమైన లలితా త్రిపురాంబిక మనందరినీ కాపాడుగాక.