క్రీస్తుశకం ఒకటో శతాబ్ది. రోమ్ నగరం. అక్కడ ఒక బాలుడు చిన్నతనంలోనే రోమన్ ప్రభుత్వ అధికారికి బానిసగా పట్టుబడ్డాడు. యజమాని అతడిని క్రూరంగా హింసిస్తూ వినోదించేవాడు. ఒకనాడు ఎందుకో కోపం వచ్చి యజమాని ఆ కుర్రవాడి కాలు మెలిపెట్టసాగాడు. బాలుడిలో ప్రతిస్పందన కనిపించలేదు. బాధ లేదు, దుఃఖమూ లేదు. మనసు మాత్రం నిర్వికారంగా ఉంది. అలాగే బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! అలా మెలితిప్పుతూపోతే నా కాలు విరుగుతుంది’ అన్నాడు బాలుడు. యజమాని ఆ మాటలు పట్టించుకోక మరింత మెలితిప్పడంతో బాలుడి కాలు కాస్తా విరుగుతుంది. అయినా, బాలుణ్ని దుఃఖం ఆవరించలేదు. బాధను ఓర్చుకుంటూ ‘అయ్యా! నా కాలు విరుగుతుందని ఇందాకే చెప్పానుకదా!’ అన్నాడు.
కొన్నాళ్లకు ఆ బాలుడు బానిసత్వం నుంచి విముక్తి పొందాడు. బాగా చదువుకొని పెద్ద పండితుడు అయ్యాడు. గురువుగా ఎందరికో విద్యాదానం చేశాడు. కానీ, జీవితాంతం కుంటివాడిగానే మిగిలిపోయాడు. అతనే గ్రీకు తత్వవేత్త ఎపిక్టెటస్. ఆయనలాంటి స్థితప్రజ్ఞులు అరుదు. అయితే, ఈ విషయంలో మన భారతీయులు ఎంతో ముందున్నారు. సనాతన ధర్మం పునాదులే స్థితప్రజ్ఞత, వైరాగ్యం, మోక్షం.
‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించడమే స్థితప్రజ్ఞత’ అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. స్థితప్రజ్ఞత కన్నా ఉన్నత మానసికస్థితి వైరాగ్యం. స్థితప్రజ్ఞత స్వీయ అనుభవానికి ప్రతిస్పందన. వైరాగ్యం.. బాహ్య వస్తువుల పట్ల, సంఘటన పట్ల విముఖత. రాగద్వేషాలు లేకుండటమే వైరాగ్యం. ఇక మోక్షం అనేది స్థితప్రజ్ఞతను, వైరాగ్యాన్ని మించిన అత్యున్నత మానసికస్థితి. మోక్షం అంటే జన్మ రాహిత్యం అనే ఒక బలీయమైన నమ్మకం. నిజానికి మోక్షం అంటే ఏమిటో మండనమిశ్రునితో జరిగిన వాదనలో ఆదిశంకరాచార్యులు తేల్చిచెప్పాడు. ‘మోక్షం.. శాశ్వతమైన ఆనంద స్వరూపం. ముక్తి అంటే క్రియా రూపులేని పరమతత్వం. మోక్షం ప్రాప్య వస్తువు కాదు. సర్వదా సిద్ధమైనది. తానే ‘పరబ్రహ్మ స్వరూపం’ అన్న దృఢజ్ఞానం కలిగి ఉండటమే మోక్షం. జ్ఞానం వేరుగా, ముక్తి వేరుగా లేవు. జ్ఞానంతో కైవల్యం లభించడం అంటే ఇదే. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతే మోక్షం కలుగుతుందని వేదాంతాలు బోధిస్తున్నా యి’ అని వివరించాడు శంకరాచార్యులు.
బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని అనుభవించే సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపం గా మారి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మీస్థితి. అదే అపరోక్షాను భూతి. ఈ విషయాన్ని అష్టావక్రుడు జనకుడితో…
‘యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్ఠసి
అధునైవ సుఖీ శాన్తః బన్ధముక్తో భవిష్యసి’॥
‘దేహం కంటే ఆత్మ వేరని విచారించి, తెలుసుకుని.. ఆత్మలోనే మనసును లగ్నం చేస్తే సుఖశాంతులను పొందవచ్చు. ఎంతవరకు ఈ పరస్పర అధ్యాస (మిథ్యా జ్ఞానం) నాశనం కాదో అంతవరకు జీవుడు బందీగానే ఉంటున్నాడు. అధ్యాస గ్రంథి ఎప్పుడు తొలగిపోతుందో ఆ క్షణమే జీవుడు ముక్తి పొందుతాడు’ అని పై శ్లోకానికి భావం.
మోక్షస్య న హి వాసోసి గ్రామాన్తరమేవ వా
అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇతి స్మృతః॥
‘మోక్షమనేది లోకాంతరంలో ఉండేదో లేదా ఇంటి లోపలగాని, గ్రామంలోగాని ఉండేదో కాదు! మరెక్కడ ఉందది? అజ్ఞానంతో నిండిన కర్తృత్వ, భోక్తృత్వ భావన అనే చిత్జడ గ్రంథి నాశనమే ముక్తి’ అని తేల్చింది శివగీత. ఇక భగవద్గీత మోక్షసన్యాస యోగంలో ‘ఆత్మను యథార్థ రూపంలో తెలుసుకున్న వాడు వెంటనే మోక్షస్థితిని పొందుతాడు. సమస్త కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, ఆత్మను శరణుపొందిన భక్తుడు శాశ్వతమైన, అవ్యయమైన మోక్షాన్ని అనుభ విస్తాడు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అలాంటి నిర్వికార, నిరంజన మనోస్థితే మోక్షం. దానిని అనుభవించేవాడే ముముక్షువు. ఇలాంటివారిలో పాశ్చాత్యుల లో సోక్రటీస్, జోర్డానో బ్రూనో లాంటివారు కనిపించగా, భారతీయులలో సనాతన రుషులు మొదలుకుని ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలాంటివారు కోకొల్లలు ఉన్నారు.