విష్ణుమూర్తి విగ్రహాలను నిల్చున్న, కూర్చున్న, శేషతల్పంపై పడుకున్న రీతుల్లో రూపొందిస్తారు. వీటినే శిల్పశాస్త్రం పరంగా వరసగా స్థానక, ఆసన, శయన మూర్తులని పేర్కొంటారు. శ్రీమహావిష్ణువు ఇల వైకుంఠం తిరుమలలో ఆనంద నిలయం విమానం కింద శ్రీవేంకటేశ్వరుడిగా స్థానక మూర్తిగా స్వయం వ్యక్తుడై ప్రజల నిరాజనాలు అందుకుంటున్నాడు. తిరుమల ఆలయ సంప్రదాయంలో ధృవబేరంగా పేర్కొనే వేంకటేశ్వరుడి మూల విగ్రహం శిల్పశాస్ర్తాన్ని అనుసరించి కచ్చితమైన కొలతలను కలిగి ఉంటుంది. అందుకే అది భారతదేశంలోని విగ్రహాలన్నింటిలో అత్యంత సుందరమైందిగా అలరారుతూ, అశేష ప్రజానీకాన్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నది. స్వామి నేత్రాలు పైకీ, కిందికీ చూస్తున్నట్లుగా కాకుండా తన దృష్టి అంతా తనను ఆశ్రయించిన వారిమీద ప్రసరింప చేస్తున్నట్లుగా ఉంటుంది. శిల్పశాస్త్రంలో దీనిని ‘సమదృష్టి’ అని పిలుస్తారు. కాగా, చెవులకు మకర కుండలాలు వేలాడుతుంటాయి. ముక్కు ఎంతో సొగసుగా అమరి ఉంటుంది. మెడ శంఖంలా ఉంటుంది. ఛాతీ 36-40, నడుము 24- 27 అంగుళాల కొలతను కలిగి ఉంటాయి.
వేంకటేశ్వర స్వామి నడుము సింహం నడుమును పోలి ఉంటుంది. అంటే స్వామి సింహ మధ్యముడు. ఇక స్వామివారి ఉదరభాగం చాలా అందంగా, ఎంతో నేర్పుతో తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఆయన నాలుగు చేతుల్లో పైవాటిలో కుడివైపు సుదర్శన చక్రం, ఎడమవైపు పాంచజన్య శంఖం అమరి ఉంటాయి. కింది చేతుల్లో కుడివైపున ఉన్నది తన పాదాలను ఆశ్రయించినవారికి వరాలను ప్రసాదిస్తానని సూచించే వరదహస్తం. ఎడమవైపు చేయి మనిషి ఈదడానికి అత్యంత కష్టంగా భావించే సంసార సాగ రం తన అనుగ్రహం ఉన్నవారికి మోకాలి లోతే ఉం టుందని సూచించే కట్యావలంబిత ముద్రలో ఉంటుంది.
వేంకటేశ్వరుడి మెడకు నాలుగు ఆభరణాలు, యజ్ఞోపవీతం ఉంటాయి. కిరీటం 20 అంగుళాల ఎత్తుతో ఉంటుంది.
కిరీటం నుంచి జటాజూటాలు భుజాల మీదికి వ్యాపించి ఉంటాయి. భుజాల మీద ధనుర్బాణాలు ధరించిన గుర్తులుంటాయి. స్వామి ముఖం చిరుదరహాసంతో ప్రసన్నంగా, తరగిపోని ప్రేమపుంజాలను వెదజల్లుతున్నట్లుగా కాంతిమంతంగా ఉంటుంది. స్వామివారి ఎదమీద శ్రీవత్సం అనే నల్లటి మచ్చ, కౌస్తుభమణి ఉంటాయి. ఎద మీద వక్షస్థల లక్ష్మి ఉంటుంది. అందుకే స్వామికి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. అలంకారాలు చేసినప్పుడు స్వామి ఎదపై శ్రీదేవి, భూదేవి రూపాలు ఉన్న బంగారు పతకాలను అమరుస్తారు. స్వామి చేతులకు నాగాభరణాలు, కుడిచేయికి ఒక పాము చుట్టుకొని ఉంటుంది. నడుముకు ఉన్న కటిబంధం నుంచి ‘సూర్య కటారు’గా పిలిచే ఖడ్గం వేలాడుతూ ఉంటుంది. నడుము పైభాగంలో ఎలాంటి వస్ర్తాలూ ఉండవు. కిందిభాగం ధోవతితో కొంచెం ఎడమ వైపు తిరిగినట్లుగా ఉంటుంది. కాళ్లేమో తనను ఆర్తితో పిలిచిన వాళ్ల కోసం వెంటనే తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొంచెం బయటికి చొచ్చుకు వచ్చినట్లుగా ఉంటాయి. ఇక గజ్జెల అందెలతో అలరారే స్వామి పాదాల కారుణ్య సౌరభాలను వర్ణించడానికి మన మాటలు చాలవు.
మొత్తంగా చూస్తే కిరీటం చివరినుంచి నిల్చున్న పద్మపీఠం అడుగు వరకు వేంకటేశ్వరుడి విగ్రహం 9 నుంచి 10 అడుగుల ఎత్తు ఉంటుంది. రుగ్వేదంలో భాగమైన పురుష సూక్తం ప్రకారం సమస్త విశ్వమూ పరాత్పరుడి శరీరమే. వేంకటేశ్వరుడి రూపం విశ్వానికి నమూనాలా ఉంటుంది. విగ్రహ నిర్మాణం విషయానికి వస్తే శేషాచలం కొండల్లో ఉండే ఎర్ర అగ్నిశిలా (సాలగ్రామ శిల) రూపంలో స్వామి వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. అయితే ఏండ్ల తరబడి పునుగుపిల్లి తైలంతో అభిషేకించడం మూలంగా నీలవర్ణాన్ని సంతరించుకున్నాడు. నిజరూప దర్శనం ఉండే గురువారం తప్ప, మిగిలిన రోజుల్లో స్వామి నానావిధాలైన వజ్ర, వైడూర్యాది జాతి రాళ్లు పొదిగిన బంగారు ఆభరాణాలతో చూసేవారిని మాటల్లో చెప్పలేని ఆనందానుభూతికి లోనుచేస్తాడు. ఇదీ కోరుకున్న వారికి కొంగుబంగారమైన కోనేటిరాయడి నిజరూపం స్థూల వర్ణన.
–చింతలపల్లి హర్షవర్ధన్