ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో వైద్యులు ఏ పనీపాటా లేకుండా ఉండేవారు. రోగులు రాక గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవారు. ఒకానొక సందర్భంలో వైద్యులంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త (స) దగ్గరికి వచ్చి ‘మా దగ్గరికి ఒక్క రోగి కూడా రావడం లేద’ని మొరపెట్టుకున్నారు. దానికి ఆయన ‘ఇక్కడి ప్రజలు బాగా ఆకలేస్తే తప్ప అన్నం ముట్టుకోరు. కడుపు నిండకముందే తినటం ఆపేస్తారు’ అని అన్నారు. ‘వాళ్లు ఆరోగ్యవంతులుగా ఉండటానికి కారణం మితాహారం అలవాటేన’ని ప్రవక్త (స) చెప్పారు. ఒకసారి ప్రవక్త అనుచరులు వచ్చి ‘ప్రవక్తా! మేం అన్నం తింటున్నాం. కానీ, ఆకలి తీరిన అనుభూతి కలగడం లేదు’ అన్నారు. దానికాయన ‘మీరు మీ ఇంటివారితో కలిసి భుజించండి. అల్లాహ్ పేరు పలికి తినండి’ అన్నారు. అందరూ కలిసి తినడం వల్ల ఇద్దరి అన్నం ముగ్గురికి, ముగ్గురి అన్నం నలుగురికి సరిపోతుంది. కలిసి తినడం వల్ల అందరూ తృప్తిగా భుజించగలుగుతారు. ‘సాటి సోదరునికి తినిపించే వారిపై దేవుడి తరఫున శుభవార్త అందుతుంది’ అని ప్రవక్త (స) సందేశం.