ఆలోచనా ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద గానీ, ఒక భావం మీద గానీ,అవిచ్ఛిన్నమైన తైలధారగా స్థిరంగా ఉంచగలిగితే దానిని ‘ధ్యానం’ అంటారు.ధ్యానమంటే మనసు లోతును కొలిచే సాధనంగా నిర్వచిస్తారు తాత్త్వికులు. ఆలోచనల వెనుక అంతర్నిహితంగా దాగిఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యాన లక్ష్యం. మరి ఈ ఆలోచనల వెనుక ఉన్నది ఏమిటి? అసలు ఎటువంటి ఆలోచనలు లేని మనసును ఊహించగలమా? ఎప్పుడూ మంచి చెడులు, తప్పు ఒప్పులనే పరస్పర విరుద్ధాలైన ద్వంద్వాల చుట్టూ పరిభ్ర మించే ఈ మనసు వెనుక ఉన్నది ఏమిటి?
మనసును శోధించటం ద్వారా ఆలోచనలను పరిష్కరించటం, సమాధానపరచటం.. ఇదే ధ్యానం. క్రమక్రమంగా ధ్యానంలో పురోగమిస్తూ ఉన్నత స్థాయిని అందుకున్నప్పుడు ఈ మనసు మనం అనుకున్నంత చెడ్డదేమీ కాదని అవగతమవుతుంది. ధ్యానం సిద్ధించినప్పుడు మనసు నుంచి విషయవాసనలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనసు శుద్ధమై ఆధ్యాత్మిక పరిధిలోకి వస్తుంది. ‘ధ్యానం చేసేవారికి దేహాభిమానం తొలగుతుంది. భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. ఈ జన్మలోనే ముక్తిని పొందుతారు’ అంటోంది వేదాంత పంచదశి.
ధ్యానం ఎలా చేయాలి?
అంగుష్ఠమాత్రః పురుషో అంతరాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్టః॥
హృదయంలో బొటనవేలు పరిమాణంలో ఆత్మ ఉందని కఠోపనిషత్తు చెబుతుంది. నిరాకార నిర్గుణ పరమాత్మ ధ్యానం ఈ హృదయంలో చేయాలి. ఈ హృదయాకాశంలో జ్యోతిని పరమాత్మగానూ, ఆ జ్యోతి మధ్యలో ఉన్న చిన్న జ్యోతిని తన ఆత్మగానూ ధ్యానించాలని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. అలాంటి మహాత్ములు ఆత్మ, పరమాత్మలు ఒకటని చెప్పారు. అందుకే ఏకత్వాన్ని ధ్యానించాలి. హృదయాకాశంలో ద్వాదశ దళాల కమలంపై ఇష్టదేవత చిన్మయమూర్తి ఆసీనుడై ఉన్నట్లుగా భావించి ధ్యానించాలి.
సగుణ ధ్యానం చేసేవారు అయిదు విషయాలు గుర్తుంచుకోవాలని ధ్యానసాధకులు చెబుతారు. 1. మంత్ర జపం ‘తత్ జపః తదర్థభావనం’. 2. ఇష్టదేవతా స్వరూప చింతన ‘రూపధ్యానం’ 3. ఇష్టదేవత గుణ చింతన ‘గుణధ్యానం’. 4. ఇష్టదేవత చేసిన లీలా చింతన ‘లీలాధ్యానం’. 5. సన్నిధి ‘ఆ పరమాత్మ నాయందున్నాడు. నన్ను చూస్తున్నాడు. వాని కొరకే నేను అన్ని కర్మలూ నిస్వార్థబుద్ధితో చేస్తున్నాను’ అనే భావన. ఈ అయిదు విషయాలనూ ఒకదానితో మరొకటి జోడించి ధ్యానం చేస్తే, మనసు త్వరగా ఏకాగ్రత చెందుతుంది.
దేవదేవుడిపై ధ్యానం…
ఆ పరమాత్మపై మనసును లగ్నం చేయటం అత్యున్నతమైన ధ్యానం. పుణ్యం పురుషార్థాన్ని కలిగిస్తుంది. అందుకే ఆది శంకరాచార్యుల ‘భజగోవిందం’లో…
గేయం గీతానామ సహస్రం,
ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్
నేయం సజ్జనసంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్
‘భగవద్గీత, విష్ణు సహస్రనామం పఠించాలి. లక్ష్మీనారాయణుని రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసును ప్రవర్తింపజేయాలి. దీనులైన వారికి దానం చేయాలి’ అని పైశ్లోకానికి అర్థం. ధ్యానసాధనకు ముందుగా శరీరాన్ని సమాయత్తం చేయాలి. అలా చేయకుండా ధ్యానానికి ఉపక్రమిస్తే విపరీత పరిణామాలు ఎదురుకావచ్చు. అహింస, సత్యపాలన, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే విలువలు పాటించకుండా ధ్యానం చేస్తే ఫలితం కనిపించదు. శారీరక, మానసిక పరిశుభ్రతలను పాటిస్తూ, ఆత్మసంతృప్తితో జీవించేవారే ధ్యానానికి అర్హులు.
ధ్యానాన్ని అభ్యసించటానికి ముందు అవసరమైన అర్హతను సంపాదించుకోవాలి. ఒక్కసారిగా ధ్యానంలో మునిగిపోవటం చాలా కష్టం. మొదట మనసును ఇంద్రియ విషయాల నుంచి ఉపసంహరించి, ఒక ప్రత్యేకమైన ఆలోచన వైపు మళ్లించాలి. దీనినే పతంజలి మహర్షి తన అష్టాంగ యోగంలో ‘ప్రత్యాహారం’ అన్నారు. ఈ అభ్యాసం చేశాక మనసును శరీరంలోని ఒక భాగం మీద నాసికాగ్రం, భ్రూమధ్యం, హృదయం ఏది అనుకూలమైతే దాని మీద కేంద్రీకృతం చేయాలి. దీనినే ధారణ (ఏకాగ్రత) అంటారు. ఈ అభ్యాసంలో నైపుణ్యం సంపాదించిన తరువాత మనిషి ధ్యానాన్ని అభ్యసించటానికి పూనుకోవాలి.
ధ్యానానికి ఆటంకాలు…
ధ్యాన సాధనకు నాలుగు విషయాలను ఆటంకాలుగా చెబుతారు. అవి విక్షేపం, జ్ఞాపకం, సంతోషం, నిద్ర. మనకు ఎంతో ప్రియమైనవి, మనం విపరీతంగా ద్వేషించే విషయాలు మనసును అశాంతపరుస్తాయి. అదే విక్షేపం. విషయ వస్తువుల రాగద్వేషాలు విపరీతంగా ఉన్న మనసుకు శాంతంగా ఉండటం, ఆనందాన్ని పొందటం కష్టసాధ్యం! అలాగే జ్ఞాపకం. మన జ్ఞాపకాల పొరల్లో గూడుకట్టుకున్న ఎన్నో విషయాలను వదిలించుకోవాలి. గతంలో చేసిన తప్పులు, గొప్పలు ధ్యాన సమయంలో గుర్తుకు వచ్చి అలజడిని కలిగించే అవకాశం ఉంది. ఇక సంతోషం. మన కోరుకున్నది లభించినప్పుడు మనసు సంతోషానికి లోనవుతుంది. ఇక వేరే సుఖమే లేదనిపిస్తుంది. ఇలాంటి భావనలో నిరంతరం మునిగి ఉంటే వారికి ధ్యానం, ఆధ్యాత్మిక అభివృద్ధి అసాధ్యమంటారు. ఆఖరిది నిద్ర. నిద్రను అజ్ఞానంతో పోలుస్తారు. అజ్ఞానులు ఆత్మను గురించి తెలుసుకోలేరు. అలాగే నిద్రలో ఎవరూ మనసును నియంత్రించి ధ్యానించలేరు.
ధ్యానం చేస్తే కలిగే ఫలితం…
ధ్యానం ఒక శాస్త్రబద్ధ, క్రమబద్ధ సాధనా విధానం. దీని ద్వారా మనసు లోతుల్లోని చైతన్యరహితమైన (సుప్తచేతన) పొరల్లో వేళ్లూనుకొని ఉన్న పూర్వకర్మల ముద్రల్ని చెరిపేయవచ్చు. వ్యతిరేక శక్తుల ప్రభావానికి గురికావటం వల్ల అతి సులభంగా మన మనసులో అనవసర భావనల ముద్రలు పేరుకుపోతాయి. కానీ వాటిని నాశనం చేయటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ధ్యానమనే ఈ పద్ధతి ద్వారా ఆ చెడు ముద్రల స్థానంలో మంచి ముద్రలను ప్రవేశపెట్టవచ్చు. ఎవరైతే నిత్యం ధ్యానం చేస్తారో వాళ్లు ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోనుకారు. వాళ్లు బ్రహ్మాండమైన మానసికశక్తిని పెంపొందించుకొని తద్వారా హానికరమైన ఆ ఉద్రేకాలను సంపూర్ణంగా తమ స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. కార్యనిర్వహణ కౌశలానికి కూడా ధ్యానం దగ్గర దోవ అని ఆధునిక మేనేజ్మెంట్ గురువులు కూడా సూచిస్తున్నారు.
…? ఎమ్. యశశ్రీ