ఓ ధనవంతుడైన రైతు కొడుకు విదేశాల్లో విద్య అభ్యసించి తిరిగి ఇంటికి వస్తాడు. కొడుక్కు చేమంతి తోటలో చక్కని భవనం కట్టించాలని భావిస్తాడు రైతు. అనుకున్నదే తడవుగా భవన నిర్మాణ నిపుణులను పిలిపించాడు. ఏ హానికరమైన జీవి ద్వారా కూడా నష్టం వాటిల్లని విధంగా చక్కటి వాస్తు సూచించమని వాస్తు సిద్ధాంతిని కోరాడు రైతు. అది అసాధ్యమని సిద్ధాంతి బదులిచ్చాడు. ఆశ్చర్యంగా చూశాడు రైతు. ‘సృష్టిలో అత్యంత హానికరమైన జీవి మనిషి. ఆకలి అంతరించిపోయాక ఏ జీవీ మరో జీవికి హాని తలపెట్టదు. మనిషి మాత్రం భూమి నుంచి అంతరిక్షం దాకా ఏదో ఒక విధంగా హాని కలిగిస్తూ ఉంటాడు’ అని బదులిచ్చాడు. ‘దీనికి పరిష్కార మార్గమే లేదా?’ అని రైతు అడిగాడు. అందుకు సిద్ధాంతి ‘ప్రకృతికి ఒక సహజ గుణం ఉంది. మనం ఏది ఇస్తే దానిని వెనక్కి ఇచ్చే స్వభావం దానికి ఉంది.
మనిషి ప్రకృతిలో ఒక భాగం కాబట్టి మనం ప్రేమను పంచితే చాలు! అసాధ్యమైనది సైతం ప్రేమ ముందు మంచులా కరిగిపోతుంది’ అని చెప్పాడు. ‘అదెలా?’ అన్నాడు రైతు. ‘మనందరిలో రెండు జంతువులు ఉంటాయి. మొదటిది కోపం, ద్వేషం, అసూయ, నేర ప్రవృత్తిమయమైన క్రూర జంతువు. రెండవది ప్రేమ, ఆనందం, శాంతి, కరుణ గల సాధు జంతువు. ఈ రెండూ నిత్యం ఒకదానితో మరొకటి పోరాడుతూనే ఉంటాయి. మనం దేన్ని పెంచి పోషిస్తే అది గెలుస్తుంది’ అని వివరించాడు సిద్ధాంతి. ‘నిజమే కదా! మనం చేమంతుల విత్తనాలు నాటితే చేమంతులే పూస్తాయి. ప్రేమ విత్తనాలు నాటితే ప్రేమే వికసిస్తుంది’ అనుకుంటూ రైతు, ఇంటి నిర్మాణ ఏర్పాట్లకు సిబ్బందిని పురమాయించాడు.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు , 93936 62821