నేరేడ్మెట్, జనవరి 21: స్కూల్‌కు బయలుదేరిన చిన్నారిని మృత్యుకబళించింది. అదుపుతప్పిన స్కూటీపైకి ఆర్మీ వాహనం దూసుకెళ్లడంతో తల్లి ఎదుటే కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్‌కుమార్, ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన కథనం ప్రకారం.. ఆఫీసర్స్ కాలనీ, ఆర్కేపురంలో నివసించే నీలాం గ్ తమాంగ్(32) తన కుమారుడు నిజెన్ తమాంగ్ (8)ని బుధవారం ఉదయం స్కూటీపై తల్లి స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో ఆఫీసర్స్ కాలనీ రోడ్డుపై స్కూటి అదుపు తప్పి స్కిడ్ కావడంతో తల్లీకొడుకు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వారి వెనుక నుంచి వచ్చిన ఆర్మీ వాహనం అతి వేగంగా చిన్నారి నిజెన్పై నుంచి దూసుకెళ్లింది. తల్లి చూస్తుండగానే ఆ బిడ్డ ప్రాణాలు విడిచాడు. నీలాంగ్ తమాంగ్ తీవ్ర గాయాలతో సృహ కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లిని వెంటనే ఆర్మీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.