ఒక భక్తుడు ప్రతి పౌర్ణమి రోజూ ఓ ఆశ్రమానికి వచ్చి సత్సంగంలో పాల్గొనేవాడు. కొన్నాళ్ల తర్వాత గురువును కలిసి ‘స్వామీ! నెలల తరబడి సత్సంగానికి వస్తున్నా నాలో ఏ మార్పూ రావడం లేదని’ బాధపడ్డాడు. ఆ భక్తుడిని ఆశ్రమంలో ఉన్న ఏనుగు దగ్గరికి తీసుకెళ్లాడు గురువు. పారుతున్న ఏరులో ఏనుగు జలకాలాడుతున్నది. తోక తిప్పుతూ, తొండంతో నీళ్లు నెత్తిన పోసుకుంటున్నది. దానిని చూపుతూ ‘ఆ ఏనుగు ఏం చేస్తున్నదో గమనించావా?’ అన్నాడు గురువు. ‘చక్కగా స్నానం చేస్తున్నది’ అని బదులిచ్చాడు భక్తుడు. ‘అలాగే చూస్తూ ఉండు’ అన్నాడు గురువు.
చాలాసేపు స్నానం చేసిన ఏనుగు… నిదానంగా ఒడ్డుకు వచ్చింది. వెంటనే తొండంతో ఒడ్డున ఉన్న బురద, చెత్త, దుమ్ము ఒంటి మీద చల్లుకోవడం ప్రారంభించింది. అప్పటివరకూ శుభ్రం చేసుకున్న శరీరంపై దుమ్ము పోసుకోవడం చూసి భక్తుడు ఆశ్చర్యపోయాడు. గురువు దాన్ని చూపిస్తూ ‘చాలామంది విషయంలో జరిగేదీ ఇదే! సత్సంగం చేస్తున్నంత సేపూ ‘మంచే చేయాలి, మంచిగా ఉండాలి’ అని భావిస్తారు. అక్కడినుంచి బయటికి వెళ్లాక మళ్లీ లౌకికమైన విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. దారిన పోయే చెత్తనంతా మనసులోకి తీసుకొని, అదే చెత్తకుండీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. సత్సంగం మంచి స్నానం లాంటిది. అయితే మనలో చాలామంది గజస్నానం చేస్తున్నారని గమనించావా?’ అని అడిగాడు.
‘నిజమే! ఎవరో వచ్చి ఏనుగు నెత్తిన చెత్త వేయలేదు. తన నెత్తిన తనే వేసుకుంది. సత్సంగం లాంటి మంచి స్నానం చేసినా, లేనిపోని ఆలోచనలతో మన మనసును మనమే చెడగొట్టుకుంటున్నాం గజస్నానంలా’ అన్నాడు భక్తుడు.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు , 93936 62821