పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన పర్వదినం కార్తిక పౌర్ణమి. విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భావిస్తారు. ఈ పౌర్ణమినాడే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని త్రిపుర పౌర్ణమి అంటారు.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతిత్యం శ్వవచాహి విప్రాః॥
ఈ శ్లోకం చదువుతూ కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ రోజు వెలిగించిన దీపం కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం అర్థం. దక్షిణాయనంలో వచ్చే కార్తిక మాసం ఉపాసనకు సంబంధించినది. దీపారాధన చేస్తూ ‘దామోదరమావాహయామి’, ‘త్రయంబకమావాహయామి’ అని శివకేశవులను ఆవాహన చేస్తారు. దైవీశక్తి సంతరించుకున్న ఈ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని నమ్మకం. కార్తిక పౌర్ణమి సందర్భంగా పొద్దంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగిస్తారు. ఉసిరిచెట్టు కింద దీపారాధన చేస్తే విశేష ఫలం లభిస్తుందని పెద్దల మాట. ‘ఏకస్సర్వదానాని దీపదానం తథైకత’ అని శాస్త్ర వచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు దీపదానం ఒక ఎత్తు అని అర్థం. వరిపిండి, గోధుమపిండితో ప్రమిదను తయారు చేసి ఆవునెయ్యితో వెలిగించిన దీపాన్ని దానమిస్తే సకల దోషాలూ తొలగిపోతాయని విశ్వాసం.
దీపారాధనకు దూది వత్తులు వినియోగిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అరటి, తామర వత్తులను ఉపయోగిస్తే సంతాన దోషం తొలగిపోతుంది. తెల్లగన్నేరు వత్తులతో దీపం వెలిగిస్తే సిరిసంపదలు సమకూరుతాయని చెబుతారు.
-శ్రీ