చెట్టూపుట్టా, పశుపక్ష్యాదులు ఇవన్నీ ఒకప్పుడు మానవ పరివారంలో భాగంగా ఉండేవి. అందుకే, మనం చేసుకునే పండుగల్లో వాటి ప్రాధాన్యం నేటికీ కనిపిస్తుంటుంది. మన సంప్రదాయంలో తులసి మొక్కకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రతిరోజూ తులసి కోట ముందు దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేసి నమస్కరించడం ఆనవాయితీగా వస్తున్నది. క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించిన తర్వాత మహావిష్ణువు కండ్లనుంచి ఆనందబాష్పాలు రాలాయట. అందులో ఒక నీటిచుక్క చెదిరి అమృత కలశంలో పడి, అదే తులసి మొక్కగా ఆవిర్భవించిందని పురాణ కథనం. తులసి.. బృందాదేవి అవతారం అని మరొక కథనం ప్రచారంలో ఉంది. అలాగే శంఖచూడుని భార్య అయిన తులసి పాతివ్రత్యానికి మెచ్చిన శివకేశవులు ఆమెను భూలోకంలో తులసి మొక్కగా జన్మించి పూజలు అందుకుంటావని వరమిచ్చారని ఇంకో కథనం.
క్షీరసాగరంలో శయనించే మహావిష్ణువు కార్తిక శుక్ల ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు మహాలక్ష్మితోపాటు బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి తరలి వస్తాడని విశ్వసిస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకడం ఇదే రోజు ప్రారంభించడం వల్ల దీనిని చిలుకు ద్వాదశిగానూ సంబోధిస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా తులసి మొక్కను లక్ష్మీదేవిగా, ఉసిరి కొమ్మను దామోదరుడిగా భావించి కల్యాణం నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహించిన వారికి సకల శుభాలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరికాయపై పువ్వొత్తిని ఉంచి దీపారాధన చేస్తారు. తులసి, ఉసిరి ఒకేచోట, ఒకేసారి పుట్టాయని చెబుతున్నది శివపురాణం. తులసి మొక్కకు శివకేశవులకు గల సంబంధాన్ని వివరించే కథలు బ్రహ్మవైవర్త, పద్మ పురాణాల్లో కనిపిస్తాయి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం॥
‘తులసి మొక్క మూలంలో సకల తీర్థాలు, మధ్యలో సమస్త దేవతలు, అగ్రభాగంలో నాలుగు వేదాలు ఉంటాయి. అలాంటి మహిమాన్వితమైన తులసికి నమస్కరిస్తున్నాను’ అని పైశ్లోకానికి అర్థం. తులసి సకల ఔషధాల నిధి! నీటిని స్వచ్ఛపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలతోపాటు కొన్నిరకాల తీవ్ర వ్యాధులను అరికట్టే శక్తి తులసికి ఉందని నిపుణుల మాట. ఇంతటి ప్రాధాన్యం ఉండటంతో, మన పెద్దలు తులసి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. అభిషేక జలాల్లో తులసిని వేసి తీర్థంగా స్వీకరించడం కూడా ఔషధ సేవనంతో సమానం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న తులసి మొక్కను క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకొని మనసారా పూజిద్దాం.
– వేదార్థం మధుసూదనశర్మ