చాలామంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం (ముక్తి మార్గం) కోసం అక్కడక్కడే తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేసుకుంటారు. కానీ, నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించరు. ఒకప్పుడు ఒక యువకుడికి నిర్వాణం పొందాలని ఆకాంక్ష ఉండేది. ఈ క్రమంలో ఆ యువకుడు చాలామంది దగ్గరికి వెళ్లి ‘నిర్వాణ మార్గం అంటే ఏమిటి?’ అని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వారంతా ‘ప్రతి మార్గమూ బుద్ధుని ప్రదేశానికే తీసుకువెళ్తుంది. కానీ, ఒక మార్గం సరాసరి నిర్వాణ ద్వారానికి దారితీస్తుంది. ఆ మార్గం గురించి ఒకే ఒక ధ్యాన గురువుకు మాత్రమే తెలుసు. ఆయన మఠానికి వెళ్లు. నీకు మార్గదర్శనం చేస్తాడు’ అన్నారు.
ఆ యువకుడు మఠానికి చేరుకున్నాడు. గురువు పాదాలకు మోకరిల్లి ‘గురుదేవా! నన్ను నేను సమర్పించుకుంటున్నాను. దయచేసి నాకు మార్గాన్ని చూపండి’ అన్నాడు. ‘అది ఆ ప్రహరీ గోడకు అవతలే ఉంది’ అన్నాడు గురువు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువు గారికి తన ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదేమో! అనుకున్నాడు. ‘గురుదేవా! ప్రహరీ గోడకు అవతల ఉన్న మార్గం గురించి నేను అడగలేదు. నేను కోరేది అంతిమమార్గం’ అన్నాడు. ‘ఓ అదా! అదే దారి రాజధానికి పోతుంది. నీకు తెలీదా?’ అన్నాడు గురువు. ‘నిర్వాణ మార్గం గురించి మీరు బాగా తెలిసినవారనీ అందరూ చెప్పారు. అది ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నాడు యువకుడు. ‘ఓహో! ఆ మార్గమా ? అది ఇక్కడే ఉంది’ అంటూ శిష్యుడు నిల్చున్న ప్రదేశాన్ని వేలితో చూపించాడు గురువు.
నిర్వాణాన్ని చేరాలన్నా, ముంబై చేరాలన్నా, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి? ఎక్కడున్నామో అక్కడినుంచే కదా! ముక్తికి మార్గం మరెక్కడి నుంచో ప్రారంభమవుతుందని ఊహించుకుంటే ఆ లోకంలోనే తప్పిపోతాం. ఏ రకమైన ప్రయాణమైనా మనం ఎక్కడున్నామో అక్కడినుంచే మొదలుపెట్టగలం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఆ మార్గం కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. మనం ఉన్న ప్రదేశం నుంచి అంగుళం కదలకుండా ముక్తి మార్గాన్ని ఎలా పొందగలం? మనం ఎక్కడ నిల్చున్నామో చూసుకోకుండా.. అవతలి వీధి నుంచి ప్రారంభించాలని చూస్తే ఆ ప్రయాణం సాగదు. కాబట్టి, మనం ఉన్న చోటునుంచి అడుగు, అటు తర్వాత అడుగు, ఆపై అడుగు ఇలా ఒక్కో అడుగూ వేస్తేనే ప్రయాణం కొనసాగుతుంది. – ప్రేమాశీస్సులతో, సద్గురు