నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్పుష్ప ఫలద్రుమాన్
ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి!
(సుందరకాండ 16 – 25)
రావణుడు సీతను ఎత్తుకెళ్లి అశోకవనంలో ఉంచాడు. ఆమెను అన్వేషిస్తూ హనుమ లంకను చేరి అశోకవనంలో సీతను చూశాడు. అప్పుడు ఆమె ఎలా చూస్తున్నదో పై శ్లోకంలో వర్ణించారు వాల్మీకి మహర్షి. సాధారణంగా చూడటం (పశ్యతి) వేరు.. పరేంగిత ప్రజ్ఞ కలిగి చూసే దృష్టివేరు. ఎదుటివారి ఆంతర్యాన్ని గ్రహించే దృష్టి పరేంగిత దృష్టి. హనుమ దృష్టి అలాంటిదే. సీతాదేవి ఫలపుష్పాలతో అలరారే చెట్లను చూడటం లేదు. తనను చుట్టుముట్టి ఉన్న భయంకరాకారులైన రాక్షస స్త్రీలను చూడటం లేదు. అలాగని కన్నులు మూసుకోలేదు. కన్నులు తెరుచుకున్నా మనసు లేకపోతే ఎదురుగుండా ఉన్న వస్తువులు కనిపించవు. అంతేకాదు, అశోకవన శోభల వల్ల మోహాన్ని పొందడం లేదు.. రాక్షస స్త్రీలను చూస్తూ భయాన్ని పొందడం లేదు. అన్ని అవస్థలకు అతీతంగా ఏకస్థ హృదయయై, అంటే ధ్యాసంతా శ్రీరాముడిపై మాత్రమే నిలిపింది. నిరంతరం మనసులో ఆయనను మాత్రమే చూస్తున్నది (అనుపశ్యతి) ధ్యానిస్తున్నది. మరేధ్యాసా లేకుండా అలా చూడటం, ధ్యానించడం సర్వసమర్పణ భావనలో కలిగే ఒకానొక స్థితి. అదే అనన్య భక్తి. అదే ఉపాసన. ఏకం… ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ. దానిపైనే ఆమె అంతఃకరణ చతుష్టయం లగ్నమైంది.
భూమిపై పడ్డ ప్రతిజీవి సుఖదుఃఖాల అనుభవాలను పొందక తప్పదు. ఆ అనుభవాలకు అతీతంగా స్పందించగలిగిన సమత్వభావనను పొందడమే యోగం. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’ అంటుంది లలితా సహస్రనామం. సీతాదేవి కూడా రామస్వామిని అంతర్ముఖియై ఉపాసించింది. హనుమ కూడా అంతర్ముఖుడై రాముడిని ఆరాధించాడు. కాబట్టే పరేంగిత ప్రజ్ఞను జాగృతం చేసుకోగలిగాడు. సీతాదేవి ఆంతర్యాన్ని పట్టుకోగలిగాడు.
ఈ శ్లోకంలో ‘ఏకస్థ హృదయం‘, ‘అనూనం’, ‘అనుపశ్యతి‘ లాంటి పదాలను వాడారు మహర్షి. ఈ పదాలన్నీ కార్యసాధనలో అవసరమైన ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యంపై చెదరని దృష్టి, వెలితిలేని ప్రయత్నం, లోతుగా ఆలోచించడం, ఎదుటివారి కోణం నుంచి చూడటం, పరిశీలన లాంటి లక్షణాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
– పాలకుర్తి రామమూర్తి