నాదబ్రహ్మ త్యాగరాజు తన జీవితకాలంలో ఎక్కువకాలం కావేరీ నదీ తీరాన తమిళనాడులోని తిరువయ్యార్లోనే గడిపారు. జీవిత చరమాంకంలో అంటే, 70 ఏండ్లు దాటాక కాంచీపురం, తిరుపతి, మద్రాసు, శ్రీరంగం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఈ క్రమంలో తిరుపతి పుణ్యక్షేత్రం పర్యటన ముగించుకుని తన శిష్యబృందంతో తమిళనాడు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గం మధ్యలో పుత్తూరు గ్రామం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందని చెబుతారు.
త్యాగయ్య పుత్తూరు చేరుకునేసరికి, అక్కడ గుడి దగ్గర ఓ శవం ముందు ఒక మహిళ రోదిస్తూ కనిపించింది. చనిపోయిన వ్యక్తి అంతకు ముందు రోజు రాత్రి ఆ గుడిలో తలదాచుకుందామని అనుకున్నాడు. అయితే గుడి గోడ దాటే ప్రయత్నంలో అక్కడున్న బావిలో పడి మరణించాడు. అక్కడ గుమికూడిన వారు పేద కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మనసు కరిగిన త్యాగయ్య మృతసంజీవని రాగమైన ‘బిలహరి రాగం’లో కృతిని ఆలపించారు.
పల్లవి: నా జీవనాధార నా నోము ఫలమా!
అనుపల్లవి: రాజీవలోచన రాజరాజ శిరోమణీ!
చరణం: నా చూపు ప్రకాశమా నా
నాసికా పరిమళమా
నా జపవర్ణ రూపమా నాదు
పూజా సుమమా త్యాగరాజనుత
//నా జీవా//
భక్తి ప్రపత్తులతో త్యాగయ్య గానం పూర్తి చేశారు. కొద్దిసేపు ధ్యానం చేసి, ఆ మృతదేహంపై తులసి తీర్థం చల్లారు. మృతుడు నిద్రలో నుంచి మేల్కొన్నవాడిలా లేచి కూర్చున్నాడు. అక్కడున్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ దంపతులు త్యాగరాజు పాదాలపై పడి కృతజ్ఞతలు తెలిపారు. త్యాగయ్య రామనామ స్మరణ చేసుకుంటూ శిష్య సమేతంగా ముందుకు కదిలారు.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు , 9393662821