e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home చింతన జ్ఞానమే సమున్నత మార్గం

జ్ఞానమే సమున్నత మార్గం

మానవుని జ్ఞానం మహోన్నతం. ఆ జ్ఞానంతోనే పలు విషయాలను, పదుగురికి ఉపయుక్తమైన వస్తువులను వెలుగులోకి తెచ్చాడు. అందుకే వ్యక్తి జ్ఞానం అపూర్వం, అజేయం అంటారు. మంచిని పెంచేది జ్ఞానమే, అక్రమ మార్గాలకు తావిచ్చేదీ జ్ఞానమే. అయితే, మనం ఎంచుకునే మార్గం ఎలాంటిదో ఎవరికివారు ఆలోచించుకోవాలి. నలుగురికీ మేలు చేసే మార్గంలో నడవడం ఉత్తముడి లక్షణం. అక్రమ మార్గంలో వినియోగించే జ్ఞానం తాత్కాలికంగా ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందేమో కానీ, ఈ కట్టె కాలే సమయంలో, ఆ పాపం తట్టి కుదుపుతుంది. చివరి ఘడియల్లో తృప్తిగా ఉండాలంటే భగవంతుడు ప్రసాదించిన జ్ఞానాన్ని సక్రమ మార్గంలో వినియోగించడం అలవాటు చేసుకోవాలి.
జ్ఞానం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అచంచలమైన జ్ఞానం, రెండోది ముక్తిని, మోక్షాన్నిచ్చేది. అచంచలమైన జ్ఞానం ద్వారా వ్యక్తి తన స్థితిని పూర్వపు స్థితి కంటే వైభవంగా మలచుకోగలడు. చాలామంది జ్ఞానం ద్వారానే కొత్త, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మంచి జ్ఞానం వ్యక్తిని నీతి మార్గం వైపు మళ్లిస్తుంది. నిజాయితీని పెంపొందిస్తుంది. తద్వారా తన జీవన విధానం కూడా మార్పు చెందుతుంది. అచంచల జ్ఞానం కలిగిన వ్యక్తులు ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషిస్తారు. సమస్యలను పరిష్కరించే అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. నూతన ఆవిష్కరణలు, నూతన పద్ధతులు ఈ జ్ఞానం వల్ల అలవడుతాయి.

సమస్యలు పరిష్కారం చేసి వ్యక్తులకు సరైన మార్గం చూపించగలుగుతాడు. అయితే, ఈ జ్ఞానాన్ని కేవలం లౌకికమైన విషయాలకే పరిమితం చేస్తే, తాత్కాలికమైన ఆనందం మాత్రమే పొందగలుగుతారు. అయితే, అదే జ్ఞానాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించగలిగితే వ్యక్తి క్రమేపీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాడు.ఇక ముక్తిని, మోక్షాన్నిచ్చే జ్ఞానం. ఆధ్యాత్మిక సాధన అంతిమ లక్ష్యం మోక్షమే! సమస్తం జయించిన వ్యక్తి యోగిగా తయారవుతాడు. ఓ వర్ధమాన మహావీరుడిలా జీవితాన్ని సాగిస్తాడు. అసలు ముక్తి అనేది భగవంతుడి సన్నిధిలో తనను తాను మైమరచిపోయి దైవం రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకునే క్రియ. ఇది అందరికీ అబ్బదు. వ్యక్తి కళ్లు మూసినా, తెరిచినా ఆ రూపమే గోచరమవుతూ ఉంటుంది. శబరి, మీరాబాయి తదితర భక్తాగ్రేసరులు ఈ కోవలోకి వస్తారు. వారి హృదయం నిండా భక్తి ప్రపత్తులే నిండి ఉంటాయి. తమ చుట్టూ ఏమి జరిగిందో, జరుగుతున్నదో వారికి అనవసరం. భగవంతుడిని సదా ధ్యానిస్తూ, ఆ విరాట్‌ రూపాన్ని మది నిండా నింపుకొని, నిరంతరం తలుచుకుంటూ పునీతులవుతారు. చివరగా ముక్తిని సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో ఈ జ్ఞానమార్గం అవలంబించాలి, అంటే ఏకాగ్రత అవసరం. హనుమ తన ఏకాగ్ర చిత్తం ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోలేదు. సమయం చిక్కితే ‘శ్రీరాం.. శ్రీరాం..’ అంటూ రామనామాన్నే జపిస్తూ ఉంటాడు. తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే దైవాన్ని సదా స్మరిస్తూ మోక్షపథంలో సాగడం ప్రధానం.

- Advertisement -

కాలక్షేపానికి చేసే దైవ స్మరణ వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. మనసు నిశ్చలంగా, పారదర్శకంగా ఉండాలి. మనసుకు ఉండే చంచలత్వాన్ని అధిగమించడానికి జ్ఞానాన్ని వారధిగా చేసుకోవాలి. అప్పుడు సాధన మార్గం సమున్నతంగా మారుతుంది. దైవం ప్రసాదించిన జ్ఞానాన్ని ఆయన అన్వేషణలో వినియోగించడం కన్నా పరమార్థం ఉండదు. అదే భక్తికి, మోక్షానికి మార్గంగా మారుతుంది.

-కనుమ ఎల్లారెడ్డి ,93915 23027

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement