చిత్తవృత్తులను నిరోధించుకోవడమే యోగమని పతంజలి మహర్షి తెలియజేశాడు. పంచ జ్ఞానేంద్రియాల కన్నా, పంచ కర్మేంద్రియాల కన్నా బలమైనది మనసు. ఇది కూడా ఒక ఇంద్రియమే! మనసు ఉండటం వల్లే మనల్ని మనుషులు అన్నారు. ఈ మనసు ఎంత బలమైనదో, అంత చంచలమైనది. ఎవరు మనసును నిగ్రహించుకుంటారో వారే శక్తిమంతులు. నిగ్రహం అనేది లేకపోతే చంచలమైన మనసు మనల్ని బలహీనులను చేస్తుంది. మనిషి ఏ రంగంలో విజయాన్ని సాధించాలన్నా అంతరంగం (మనసు) స్వాధీనంలో ఉండాలి. మనసు వశంలో ఉంటే, చేసే పనులు ఫలవంతమవుతాయి. అందుకే మనోనిగ్రహం కేవలం యోగులకే కాదు, భోగులకూ ఆవశ్యకం.
నిజానికి మనసు ఏయే విషయాలలో సంచరిస్తుందో గమనిస్తే, వాటిని నిరోధించుకునే అవకాశం లభిస్తుంది. యోగ సాధకులు శబ్ద స్పర్శ రూప రస గంధాలను ఇంద్రియ విషయాలుగా గుర్తించారు. శబ్దం చెవికి, స్పర్శ చర్మానికి, రూపం కంటికి, రసం నాలుకకు, గంధం ముక్కుకు విషయాలు. ఎప్పటికప్పుడు ఇంద్రియాలు ఈ విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. మరి ఇంద్రియాలు శబ్దాది విషయాలను గ్రహించకుండా ఉండాలంటే ఆ పని చేయగలిగింది ఒక మనసే. కానీ, మనసు చంచలమైనది అయితే ఇంద్రియాలు గుర్రాల్లా పరుగెత్తుతాయి. మనసును నిగ్రహిస్తే ఇంద్రియాలు వాటంతట అవే చల్లబడతాయి.
కొందరు మనసునే ఆత్మగా భావిస్తారు. కానీ, ఆత్మ వేరు, మనసు వేరు. ఆత్మ చైతన్యం కలిగినది. కానీ, మనసు జడమైనది. అయితే జడమైన మనసు, చైతన్యం (జ్ఞానం) కలిగిన ఆత్మకు చాలా సమీపంలో ఉండటం వల్ల చేతనాయమానం అవుతుంది. అంతేగానీ, మనసుకు స్వయంగా, ఆత్మ స్పర్శలేకుండా ఆలోచించడానికి అవకాశం లేదు. ఆత్మ స్వచ్ఛమైంది. ఏ వికారమూ లేనిది. కానీ, మనసు సంసర్గం వల్ల వికారానికి లోనవుతుంది. ఉదాహరణకు స్వచ్ఛమైన స్ఫటికం ముందు రంగురంగుల పూలగుత్తిని ఉంచితే, ఆ స్ఫటికంలో దాని రంగులు ప్రతిఫలిస్తాయి. ఒకవేళ స్ఫటికం ఏ పదార్థానికీ సమీపంలో లేనట్లయితే, అది ఏ రంగునూ ప్రతిబింబించదు. నిర్మలంగానే ఉంటుంది. స్ఫటికం లాంటి మనసును అంతే స్వచ్ఛంగా ఎవరు ఉంచుకోగలుగుతారో, వారే మనోనిగ్రహం కలిగిన వారని చెప్పవచ్చు. మనో నిగ్రహం సమాధి స్థితికి దారితీస్తుంది. అది అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. దాని ద్వారా జీవుడు పరమాత్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు.
– ఆచార్య మసన చెన్నప్ప , 98856 54381