భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం రామాయణం. ఆదికవి వాల్మీకి. రామాయణ కథ రాయడానికి ప్రేరణ ఓ వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని చంపేయడం అంటారు. ఆ దృశ్యాన్ని చూసి, చలించిన వాల్మీకి మహర్షి నోటి నుంచి అప్రయత్నంగా ‘మా నిషాద ప్రతిష్ఠాం…’ అని శ్లోకం రూపంలో శోకం బయటికి వెల్లడవుతుంది. అలా ఈ సంఘటన స్ఫూర్తిగా ఎడబాటుకు గురైన సీతారాముల కథను ప్రధానంగా చేసుకొని వాల్మీకి రామాయణ రచన పూర్తిచేశాడు. సీత సహా ఆ కథను విన్న వారంతా అందులో మాధుర్యాన్ని వేనోళ్లా పొగిడినవారే.
ఈ క్రమంలో వాల్మీకి తన రామాయణాన్ని నారద మహర్షికీ వినిపిస్తాడు. అంతా విన్న తర్వాత నారదుడు ‘కావ్యం బాగానే ఉంది. కానీ…’ అంటాడు. అప్పుడు వాల్మీకి ‘కానీ… అంటున్నారు, ఇంతకంటే గొప్పగా రామ కథ రాసినవాళ్లు ఎవరైనా ఉన్నారా?’ అని తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. దానికి నారదుడు ‘అవును, నీవు రాసిన దానికంటే హనుమంతుడి రామాయణం చాలా బాగుంటుంది’ అంటాడు. కావాలంటే కదళీవనానికి వెళ్లి హనుమంతుడి దగ్గరే విషయం నిరూపణ చేసుకోమని సూచిస్తాడు.
దాంతో వాల్మీకి వెంటనే కదళీవనానికి వెళ్తాడు. అందులో ఓ అరటి చెట్టు ఆకుల మీద ఏవో అక్షరాలు కనిపిస్తాయి. వాటిని చదవడం మొదలుపెడతాడు. అంతా చదవడం అయ్యాక అప్రయత్నంగా మహర్షి పెద్దగా ఏడవడం ప్రారంభిస్తాడు. అది విన్న హనుమంతుడు అక్కడికి చేరుకుంటాడు. వాల్మీకిని ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతాడు. హనుమంతుడు రాసిన రామాయణం అద్భుతంగా ఉన్నదని, అందువల్ల ఏడుపు వస్తున్నదని జవాబిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ‘బాగుంటే సంతోషించాలి కానీ ఏడవడం ఎందుకు?’ అంటాడు. హనుమంతుడి రామాయణం చదివిన తర్వాత తన రచనను ఎవ్వరూ ఆదరించరని, అందుకే ఏడుపు వచ్చిందని వాల్మీకి అంటాడు. దాంతో హనుమ అరటి ఆకులను అన్నిటినీ చింపివేస్తాడు. అప్పుడు వాల్మీకి ‘ఇలా ఎందుకు చేశారు? మధురమైన రామకథ చెరిగిపోయింది కదా!’ అని ఆవేదన చెందుతాడు.
దానికి హనుమ ‘ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి మీరు రామాయణం రాశారు. నేను రాముణ్ని గుర్తుంచుకోవడానికి రాశాను’ అని బదులిస్తాడు. ఇంకా ‘మీ రచన వెనక ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్న స్వార్థం ఉంది. నాకు మాత్రం రామభక్తి తప్ప మరే కోరికా లేదు’ అంటాడు. అలా వాల్మీకికి కండ్లు తెరిపిస్తాడు.హనుమంతుడు రామాయణాన్ని రాళ్ల మీద చెక్కాడన్న కథ కూడా ప్రచారంలో ఉంది. వాల్మీకి రచనకు ప్రాముఖ్యం వచ్చేందుకు తన రామాయణాన్ని చెరిపివేశాడని అంటారు. వీటితోపాటు హనుమ రామాయణాన్ని తాళపత్రాలపై రాశాడనీ చెప్తారు. ఏదేమైనా వాల్మీకి రచన ప్రసిద్ధిలోకి రావడానికి హనుమంతుడు తన రామాయణాన్ని తనలోనే ఉంచుకున్నాడు. దాంతో వాల్మీకి రామాయణం ఆదికావ్యంగా నిలిచిపోయింది. అంతేకాదు, హనుమంతుడు రాసిన రామాయణంలో కొంతభాగం మాత్రమే వాల్మీకి రచనలో ఉందట. ఈ కథలు ఇలా ఉంటే, హనుమంతుడు రాసిన రామాయణానికి సంబంధించిన ఒక ముక్క మహాకవి కాళిదాసుకు దొరికిందన్న కథనం కూడా ప్రచారంలో ఉంది.
అందులో ఉన్న లిపిని కాళిదాసు ఒక్కడే గుర్తించాడట. పది తలల రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో మరణించి కాకులు, గద్దల పాలయ్యాడని అందులో ఉందట! హనుమత్ రామాయణానికి చెందిన ఆ ఒక్క పాదాన్ని చూసినందుకు తానెంతో అదృష్టవంతుణ్నని కాళిదాసు భావించాడని ఐతిహ్యం.ఆదికవి మొదలుకొని, ఆధునిక 21వ శతాబ్దం వరకూ వివిధ భాషల్లో, విభిన్న దృక్పథాలతో వచ్చిన, వస్తున్న, ముందుముందు వచ్చే ఏ రామాయణమైనా సరే దేనికదే ప్రత్యేకం కావచ్చు. అంతేకానీ అవేవీ పరిపూర్ణమైనవి మాత్రం కాదని ఈ కథలు వెల్లడిస్తాయి. అంటే అసలు రామాయణం హనుమంతుడికి మాత్రమే తెలుసన్న మాట! వాల్మీకి మహర్షి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి తన రామాయణాన్ని వెలుగులోకి రానివ్వకపోవడం ఆంజనేయుడి నిస్వార్థ రామ భక్తి పరాయణత్వాన్ని వెల్లడిస్తుంది. తన రచనకు లోకప్రసిద్ధి రావడం కంటే, తాను రాముడి భక్తుడిగా ఉండటమే మారుతికి ముఖ్యం!
-చింతలపల్లి ,హర్షవర్ధన్