‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని రుషులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టినప్పుడు ఏ ఆలోచనలు రావు. మన నైపుణ్యాలన్నీ కేంద్రీకరించి ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమవుతాం. పనిలేకుంటే శ్వాస మీద ధ్యాస ఉంచమన్నారు పెద్దలు. అప్పుడు అనవసరమైన ఆలోచనలు మన దరికి చేరవు. ధ్యానంతో అక్కరకు రాని సమాచారాన్ని వడబోసే సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. బుద్ధి వికసిస్తుంది. భయాలు మాయమవుతాయి. అతీతమైన స్థితికి చేరిన మనిషికి చివరికి అనంతమైన తృప్తి మిగులుతుంది. అచంచలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ రెండూ సాధించిన మానవ జన్మ ధన్యం.