గురువంటే వాక్కు- ఆయన బ్రహ్మ,
గురువంటే మనసు – ఆయన విష్ణువు.
గురువంటే హృదయం- ఆయనే మహేశ్వరుడు.
గురువంటే సాక్షాత్తు మనస్సు, వాక్కు, హృదయాల కలయిక అయిన పరబ్రహ్మమే. మనో మాలిన్యం వదల్చి, మాటను సరళ సమీరం చేసి, హృదయాన్ని ఆత్మ స్థావరం అని తెలిపే గురువు – ఈ మూడు స్థితులూ ఒక్కటైనవాడని అర్థం.
శాస్త్రం బోధిస్తే, బోధ గురువు.
మంత్రం ఇస్తే, దీక్షా గురువు.
దారి చూపిస్తే, శిక్షా గురువు.
వేదార్థం విడమరిస్తే, వేద గురువు.
ఇహ పర సాధన వివరిస్తే, నిషిద్ధ గురువు.
సత్కర్మాచరణకు ప్రేరణనిస్తే, కామ్య గురువు. యోగ విజ్ఞానాన్ని వరదానం చేస్తే, వాచక గురువు. నియమ నిష్ఠల ద్వారా ఇంద్రియ నిగ్రహం బోధిస్తే, సూచక గురువు. మనసున తారాడు సందేహాన్ని పటాపంచలు చేసి, స్వస్వరూప సంధాన విధానం వివరిస్తే, విహిత గురువు. జీవాత్మల కలయికను ఆవిష్కరిస్తే, కారణ గురువు.
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమలం అచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ
అంటే ఎవరి చిత్తం నిరంతరం బ్రహ్మమునందు రమిస్తుందో అది ఆనందం. అదే ఆనందం. అది మాత్రమే ఆనందం. ఆ ఆనంద స్వరూపుడు గురువు. మార్పు చెందని ఆనందానికి గుర్తు గురువు. కాలాతీతుడు, దేశాతీతుడు గురువు. అద్వైత దర్శనం చేసినవాడు గురువు.
చీకటి వెలుగులు, కష్ట సుఖాలు, జనన మరణాల వంటి విషయాలకు అతీతమైన దైవమే గురువు. ఆకాశం వలే శూన్యుడు, కానీ పూర్ణుడు.
ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అనే నాలుగు మహావాక్యాలు లక్ష్యమైనవాడు గురువు. అనేకంగా కనిపిస్తున్నా, అన్నీ తానైన వాడు గురువు. జనన మరణాలు లేని వాడు గురువు. ఎన్నింటిని కాల్చినా, ఏమీ అంటని మంట గురువు. సమస్తమూ తానై, తాను కదలక అన్నింటినీ కదిల్చే వాడు గురువు. రంగస్థలంపై విభిన్న పాత్రల అవస్థలను, అక్కడే ఉండి ఏ అవస్థకూ లోను కాకుండా అన్నిటినీ సాక్షీ భూతంగా చూసే, కాంతి వంటి వాడు గురువు. ఆలోచన, భావం, భావన, తాదాత్మ్యం, ఉద్వేగం వంటి వాటికి అతీతుడు. సత్వ, రజస్తమో గుణాలకు అతీతుడు. పూర్ణుడైన వాడు గురువు అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను!
శ్రీ వ్యాస శంకరాద్యనేక అనంతకోటి గురుతత్వాలు మానవ జాతిని, వెన్నెల బాటలో నడిపించు గాక!
-వి.యస్.ఆర్.మూర్తి , ఆధ్యాత్మిక శాస్త్రవేత్త