శ్రీ మహావిష్ణువు ఐదో అవతారం వామనుడు. మూడు అడుగుల మూర్తి మూడు అడుగుల్లో ముల్లోకాలనూ కొలిచిన వైనం విష్ణుమాయే! భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు కశ్యపుడు, అదితి దంపతుల ముద్దులపట్టిగా విష్ణుమూర్తి అవతరించాడు. త్రివిక్రమ స్వరూపం దాల్చి బలి అహంకారాన్ని అణచివేశాడు. బలిని పాతాళానికి పంపాడు. అయితే, వామనమూర్తి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. కేరళ, తమిళనాడులోనూ ఒకట్రెండు ప్రముఖ ఆలయాలు కనిపిస్తాయి. వాటిలో ప్రముఖమైనది త్రిక్కకర ఆలయం. 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ‘త్రిక్కకర’ అంటే వామనుడు పాదం మోపిన ప్రాంతం అని అర్థం. బలి చక్రవర్తి యాగం నిర్వహించిన చోటు ఇదేనని చెబుతారు. యాగానికి వచ్చిన వామనుడు బలిని మూడు అడుగులు దానం కోరడం, స్వామి ఆకాశమంత రూపం దాల్చడం, తొలి రెండు అడుగులతో భూమి, ఆకాశాలను ఆక్రమించడం, మూడో అడుగు బలి తలపై మోపడం, అతణ్ని పాతాళానికి తొక్కేయడం.. వామనుడి త్రివిక్రమ పరాక్రమం అంతా త్రిక్కకరలోనే జరిగిందని స్థల పురాణం. ఈ ఆలయంలో వామన జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. తమిళనాడులోని కాంచీపురంలోనూ వామన ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి మూలమూర్తి సుమారు 35 అడుగుల ఎత్తు ఉంటుంది. అదే రాష్ట్రంలో సిర్కాళి క్షేత్రంలోనూ త్రివిక్రమ వామనమూర్తి ఆలయం ఉంది. ఇక్కడ మూలవిరాట్టు ఎడమ కాలు ఆకాశానికేసి పైకెత్తి ఉంటుంది.