వినాయక చవితికి పూజలో పెట్టిన విగ్రహాన్ని.. నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే ఉంచుకోవచ్చా? l కారంగుల వెంకటరమణ, జిల్లెల్ల ‘ఆకాశస్య విభో విష్ణుః, జలరూపో వినాయకః’ ఆకాశ తత్వానికి ప్రతీక శ్రీమన్నారాయణుడు. జల తత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం. వినాయక చవితి రోజు గణపతిని మట్టి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకుంటాం. నవరాత్రులు షోడశ ఉపచారాలతో పూజిస్తాం. కేవలం మట్టితో తయారుచేసిన విగ్రహానికి తొమ్మిది రోజులపాటు దైవత్వం ఉంటుందని పెద్దల మాట. నవరాత్రులు పూజలు అందుకున్న మృణ్మయ మూర్తిని నిమజ్జనం చేయడం మన సంప్రదాయం. గంగ నుంచి ఉద్భవించిన గౌరీ తనయుణ్ని మళ్లీ గంగమ్మ ఒడిలోకి చేర్చాలన్నమాట. తొమ్మిదో రోజుగానీ, ఏదైనా బేసి సంఖ్య రోజున గానీ నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతున్నది. పదకొండో రోజైన అనంత చతుర్దశి రోజు కూడా నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుడు తన తల్లిదండ్రుల దర్శనం కోసం అనంత చతుర్దశి నాడే కైలాసానికి వెళ్లినాడని ప్రతీతి.
గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥
‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. అంతేకానీ, చవితినాడు పూజించిన వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శాస్త్ర విరుద్ధమే అవుతుంది. అయితే, అలా ఆ విగ్రహాన్ని ఇంట్లోనే ఉంచడం వల్ల రుణాలు పెరుగుతాయన్న మాటకు శాస్త్ర ప్రమాణం లేదు.
డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370