భరత మహారాజు మహాభక్తుడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, మరుజన్మలో జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ) పోయి జింక శరీరం వచ్చింది. కానీ, జ్ఞానం మాత్రం నశించలేదు. దాని కారణంగానే ఆ తర్వాతి జన్మలో ఉన్నతమైన మరో ఉపాధి పొందాడు. ఈ విధంగా అనాత్మ (శరీరం) మారుతూ వచ్చింది. కానీ, లోపల ఉండే ఆత్మ మారలేదు. ‘అనాత్మ’కు మారే స్వభావం ఉంటుంది. ‘ఆత్మ’ ఎన్నటికీ మారదు. అందుకే జింకగా జన్మించిన భరతుడు తర్వాతి జన్మలో జడభరతుని రూపంలో అత్యంత సావధానంగా ప్రవర్తించి మోక్షసాధన చేశాడు, ముక్తిని పొందాడు. అనాత్మతో తాదాత్మ్యం ఉన్నంత వరకు ఆత్మ కనిపించదు, ఇక ఆత్మ దర్శనం కాగానే అనాత్మతో పని ఉండదు. అంటే శరీరాలను ధరించవలసిన అవసరం కలగదు.