దేవతార్చనలో కొందరు బంగారు/ వెండి పూలు ఉపయోగిస్తూ ఉంటారు కదా! వాటిని మళ్లీ వినియోగించవచ్చా? వీటిని సహజ పుష్పాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చా? – ఆర్.దివాకర్. క్షీరసాగర్
మాల్యాదీని సుగంధీని, మాలత్యాదీని వైప్రభో
మయా హృతాని పూజార్థం, పుష్పాణి ప్రతిగృహ్యతామ్
‘ఓ దైవమా! ఈ రోజే వికసించి, సువాసనలను వెదజల్లుతున్న స్వచ్ఛమైన పూలను పూజకోసం నీకు సమర్పిస్తున్నాను. వీటిని స్వీకరించు’ అని వేడుకుంటూ దైవాన్ని పూజించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది.
పత్రం పుష్పం ఫలం తోయం,
యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః॥ (భగవద్గీత 9- 26)
‘ప్రకృతి ప్రసాదించిన పత్రమో, పుష్పమో, పండో, జలమో స్వచ్ఛమైన భక్తితో నాకు సమర్పిస్తే, వాటిని ప్రేమతో నేను స్వీకరిస్తాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ఇక్కడ పూలంటే ప్రకృతి మనకు ప్రసాదించినవీ, సహజ సిద్ధమైనవీ. అదేరోజు వికసించిన పరిమళభరితమైనవి అయి ఉండాలి. పూజాదికాల్లో దేవుడికి సహజసిద్ధమైన పుష్పాలనే వినియోగించాలి. ఇక, బంగారం, వెండి పూలతో పూజించాలనే దానికి శాస్త్ర ప్రమాణం లేదు. విలువైన ఆ పూలను సమర్పించినపుడు అవి భగవంతుడి అందాన్ని ఇనుమడింపజేసే ఆభరణాలే అవుతాయి కానీ, దేవుడికి చేసే ఉపచారంగా భావించలేం. అంటే, అవి కేవలం అలంకార ప్రియాలే అవుతాయి. ఇక దేవుడి ఆభరణాలకు నిర్మాల్య దోషం ఉండదు. కాబట్టి, ఈ బంగారు, వెండి పూలనూ మళ్లీ వినియోగించవచ్చు. దేవతా విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు ఆ పూలను పవిత్రంగా శుద్ధి చేసి, మళ్లీ అలంకరించ వచ్చు.
-డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370