రామాయణం ప్రకారం హనుమంతుడు చిరంజీవి. అంటే కాలానికి, కాలపరీక్షకు అతీతంగా చిరకాలం జీవించేవాడన్న మాట! హిందూ కాలమానాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. అవి కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. నాలుగు యుగాలు కలిస్తే ఒక కల్పం. అంటే హనుమంతుడు ఈ నాలుగు యుగాల్లోనూ ఉంటాడన్న మాట. అంతేకాదు, వచ్చే కల్పానికి సృష్టికర్త బ్రహ్మదేవుడి స్థానాన్ని పొందేదీ హనుమంతుడే అనీ అంటారు. సాధారణంగా హనుమంతుడి ప్రస్తావన త్రేతాయుగానికి చెందిన రామాయణంలో వస్తుంది. లంకలో రావణుడి చెర నుంచి సీతను విడిపించుకునే క్రమంలో విష్ణువు అవతారమైన రాముడికి ఆయన చేసిన సాయం రామాయణంలో ప్రధాన ఘట్టం. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరిస్తాడు. పాండవుల ద్వారా కౌరవులను ఓడించి ధర్మాన్ని నిలబెడతాడు. ఇదే ప్రసిద్ధి చెందిన మహాభారతం.
ద్వాపరంలో హనుమంతుడు.. ఓసారి ద్రౌపది తనకు హిమాలయాల్లో దొరికే సౌగంధిక పుష్పం కావాలని భీముడిని కోరుతుంది. దాంతో హిమాలయాలకు పయనమవుతాడు భీమసేనుడు. దారిలో ఆయనకు ఓ ముసలి కోతి అడ్డుపడుతుంది. తప్పుకోమంటాడు. ‘నేను ముసలివాణ్ని. కదిలే స్థితిలో లేను. నువ్వే కొంచెం పక్కకు జరుపు’ అంటాడు. భీముడు ఆ కోతిని పక్కకు తప్పించడం తనకు సులువైన పనిగా భావిస్తాడు. కానీ ఆ వృద్ధ వానరాన్ని అంగుళం కూడా కదల్చలేకపోతాడు. భంగపాటుకు గురైన భీముడు ముసలి కోతితో ‘ఎవరో మహాత్ముడిలా ఉన్నారు? ఎవరు మీరు?’ అంటాడు. దాంతో హనుమంతుడు అసలు రూపాన్ని ప్రదర్శిస్తాడు. అలా భీమసేనుడి గర్వాన్ని అణచివేస్తాడు.
మరో సందర్భంలో అర్జునుడికీ హనుమంతుడు రామనామ మహిమను తెలియజేస్తాడు. మహాబలవంతుడైన రాముడు బాణాలతో వారధి నిర్మించుకోవాలి, కానీ వానరుల సాయం ఎందుకు తీసుకున్నాడన్న సందేహం వస్తుంది అర్జునుడికి. అప్పుడు హనుమ అలా బాణాలతో వంతెన కడితే వానరుల బరువుకు కూలిపోతుందని అంటాడు. అర్జునుడు ఒప్పుకోడు. పక్కనే ఉన్న నదిపై బాణాలతో వంతెన నిర్మించమని సవాలు విసురుతాడు హనుమంతుడు. అర్జునుడు అలాగే చేస్తాడు. కానీ, హనుమ కాలు మోపడంతోనే అది కూలిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం ఒకటే. దాంతో రామనామాన్ని స్మరించి బాణాలు సంధించమని సలహా ఇస్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు అలానే చేస్తాడు. ఈసారి వంతెన కూలిపోదు. బాణాల్లో కానీ, రాళ్లలో కానీ దృఢత్వం లేదు, కేవలం రామనామంలోనే ఆ మహిమ అంతా ఉందని మారుతి వెల్లడిస్తాడు. దాంతో కురుక్షేత్ర సంగ్రామంలో తమకు విజయం చేకూరేందుకు తన రథం ధ్వజంపై కొలువుదీరమని అర్జునుడు కోరుతాడు. అనుగ్రహిస్తాడు ఆంజనేయుడు. ఇదీ ద్వాపరంలో జెండాపై కపిరాజు కథ.
కలియుగంలో… ఆయన చిరంజీవి కదా! మనకు కనిపించకపోయినప్పటికీ భూమ్మీద ఎక్కడో ఒకచోట రామనామం స్మరిస్తూ నివసిస్తున్నాడని విశ్వసిస్తారు. హిమాలయాల్లో ఒక అరటి తోటలో కొలువై ఉన్నాడని కొంతమంది నమ్ముతారు. హిమాలయాల్లో తిరిగే అతిపెద్ద పాదాలు కలిగిన యెతి అనే జీవి హనుమంతుడే అనే నమ్మకం కూడా వ్యాప్తిలో ఉంది. పుస్తకాలు చదువుతున్న హనుమంతుడి చిత్రాలూ అక్కడక్కడా దర్శనమిస్తాయి. ఉత్తర భారతదేశంలో రామాయణ పారాయణం సందర్భంగా ఒక ఆసనాన్ని ఖాళీగా ఉంచడం ఆచారం. రామకథ అంటే చెవికోసుకునే ఆంజనేయుడు ఎక్కడ రామాయణ పారాయణం జరిగినా, వచ్చి కూర్చుంటాడన్న విశ్వాసంతోనే ఇలా చేస్తారు.
మరి రాముడి కంటే ముందుదైన కృతయుగంలోనూ హనుమంతుడు ఉన్నాడా? అంటే వేదాల్లో ‘వృషాకపి’ అనే ఒక వానరం ప్రస్తావన ఉంది. అయితే వృషాకపికి, హనుమంతుడికి ఉన్న సంబంధం అస్పష్టం. విష్ణు, శివ సహస్ర నామాల్లోనూ ‘వృషాకపి’ అన్న నామం వస్తుంది. హనుమాన్ చాలీసాలో తులసీదాసు ‘చారో యుగ పరతాప తుమ్హారా/ హై పరసిద్ధ జగత ఉజియారా’ అని పవనసుతుణ్ని ప్రస్తుతించాడు. నాలుగు యుగాల్లోనూ నీ ప్రతాపం కనిపిస్తుంది. నీ ప్రసిద్ధి జగమంతా ప్రకాశిస్తూ ఉంటుందని ఈ చౌపాయీ తాత్పర్యం. అయితే తులసీదాసు ప్రయోగించిన ‘చారో యుగ’ అన్న పదాలు నాలుగు యుగాలు అనే అర్థంలో కావచ్చు, లేదంటే త్రేతాయుగం మొదలుకొని మిగిలిన అన్ని కాలాల్లోనూ అన్న అర్థంలోనూ అయ్యుండొచ్చు. ఏదేమైనా భారతీయుల విశ్వాసంలో మారుతి చిరంజీవి!
–చింతలపల్లి హర్షవర్ధన్