మోక్షసాధనకు అవసరమైన సాధనాలలో భక్తి ముఖ్యం. ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అని నారద భక్తిసూత్రాలు పేర్కొన్నాయి. మోక్షా భిలాష ఉన్నవారికి అవసరమైన ఈ భక్తి లక్షణాల గురించి, భక్తి స్వరూపం గురించి శ్రీమద్భాగవత మహాపురాణంలో వివరంగా కనిపిస్తుంది.
భక్తుడు అనిపించుకోవాలంటే కొన్ని లక్షణాలను పెంపు చేసుకోవాలి. ఈ విశ్వమంతా భగవంతుడి స్వరూపమే అనే విశ్వాసాన్ని ముందుగా కలిగి ఉండా లి. కదిలే, కదలని ప్రాణులన్నిటిలో భగవంతుణ్ని చూడగలగాలి. ఏకాగ్రమైన మనసుతో భగవంతుడి కథలను శ్రద్ధగా వినాలి. భగవంతుడి నామాలను మనస్ఫూర్తిగా సంకీర్తన చేయాలి. భగవంతుణ్ని పూజించడం, ధ్యానించడం, మనసా, వాచా, కర్మణా తమను తాము భగవంతుడికి సమర్పించడాన్నే ‘భక్తిమ య జీవనం’ అంటారు.
భక్తిని అలవర్చుకోవడం, ఎవరికీ అనుకున్నంత సులభం కాదు. దానికి ఒక క్రమపద్ధతిని పాటించాలి. ముందుగా భగవంతుడి నామ సంకీర్తనం చేయాలనే అభిరుచి ఏర్పడాలి. ఇందుకుగాను భగవత్ కథలను తరచూ వింటూ ఉండాలి. అలా వినడం వల్ల క్రమేణా భగవంతుడిపై భక్తి ఏర్పడుతుంది. భగవంతుడి లీలలను వినడానికి ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. గుడికి వెళ్లాలి, ప్రయత్న పూర్వకంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. శక్తి ఉన్నట్లయితే తీర్థయాత్రలు చేయడమూ మంచిదే. ఈ ప్రయాణంలో మహాత్ముల సాంగత్యం, మహాజన సేవాభాగ్యం కలుగుతుంది. తద్వారా భగవంతుడి గుణామృతాన్ని ఆస్వాదించాలనే తపన ఏర్పడుతుంది. శ్రీకృష్ణ చరితాన్ని వినే వారికి బాహ్యశుద్ధి, అంతరంగ శుద్ధి ఏర్పడతాయి.
మనసులోని కల్మషాలు తొలగిపోతాయి. ఈర్ష్య, అసూయలు దూరమవుతాయి. రజస్తమో గుణాల ప్రభావం తొలగిపోతుంది. అప్పుడు కామ, క్రోధ, లోభ, మోహాలు బలహీన పడతాయి. అంతరంగం సాత్వికం అవుతుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. కోరికలు, బంధాలు, బాధలు దూరమవుతాయి. తత్వజ్ఞానం ఏర్పడుతుంది. భగవత్ తత్వం గోచరిస్తుంది. అహంకార, మమకారాలు, సంశయాలు, విపరీత భావనలు సమూలంగా నశిస్తాయి. ఫలితంగా భగవత్ భక్తి స్థిరంగా ఏర్పడుతుం ది. అప్పుడే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలం.
భక్తి ఏర్పడింది. తర్వాత ఏం చేయాలన్నది ప్రశ్న. ముందుగా దేవుడి దివ్యమంగ ళ రూపాన్ని దర్శించాలి. మనసు నిండా భక్తి భావం నిండిఉంటే.. భగవానుడి సమ్మోహన విగ్రహ సౌందర్యాన్ని చూడగానే తెలియకుండానే తన్మయులం అవుతాం. అప్రయత్నంగానే ఆయన పాదపద్మాలపై మనసు కేంద్రీకృతం అవు తుంది. తమ రక్షణ భారం అంతా భగవంతుడిదే అనే భావన కలుగుతుంది. ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ- నాకు వేరే గతి లేదు. నిన్ను తప్ప మరేదీ ఎరుగను’ అని శరణాగతి భావనతో వేడుకుంటాం. అప్పుడు భగవంతుడి దివ్యానుగ్రహానికి పాత్రులమవుతాం. సంసార చక్రం నుంచి బయటపడతాం. పూర్వజన్మల పుణ్యఫలంగా లభించిన మానవ జన్మకు సార్థకత ఏర్పడి ఉత్తమమైన మోక్ష పురుషార్థాన్ని పొందగలుగుతాం. భగవంతుణ్ని భక్తులు కోరుకునేది ఇదే కదా! యథాశక్తి భగవత్ భక్తిని ఏర్పర్చుకోవడానికి, లౌకిక బంధాల నుంచి విముక్తి పొందడానికి, నిరుపమానమైన భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందడానికి అవసరమైన కృషి ప్రారంభిద్దాం.
‘ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్
రుక్మాంగదార్జున వశిష్ఠ బలిర్విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి’
ఈ శ్లోకంలో పేర్కొన్న పరమ భక్తాగ్రేసరులను ఆదర్శంగా తీసుకుందాం. భక్తి వారధిగా మోక్ష సామ్రాజ్యంలో అడుగుపెట్టి, భగవంతుడి సన్నిధిలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుందాం.
-సముద్రాల శఠగోపాచార్యులు , 98483 73067