యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥ (భగవద్గీత 18-46)
‘ఏ పరమేశ్వర శక్తి వల్ల అన్ని భూతాలకు ప్రవృత్తి కలుగుతున్నదో, ఏదైతే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నదో, ఆ పరమేశ్వర తత్వాన్ని మానవుడు తనదైన కర్మతో పూజించి సిద్ధి పొందుతాడు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. అంటే ఎవరైనా తమకు విధించిన కర్మలను ఆచరిస్తూ, భగవంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
అనేక లోకాలున్నప్పటికీ మనసుకు సంతోషాన్ని కలిగించేది, తొందరగా కర్మఫల సిద్ధిని ఇచ్చేది, పరమేశ్వర సాక్షాత్కారం కలిగించేది భూలోకమే. అందులోనూ జంబూద్వీపం ప్రశస్తమైది. దానిలో భారతదేశం అత్యంత పవిత్రమైనది. వేదోక్త కర్మల అనుష్ఠానానికి, వాటి ఫలితాలు పొందడానికి భారతదేశమే తలమానికం అని స్కాంద పురాణం చెప్తున్నది. ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాః’ ఈ లోకంలో కర్మలను ఆచరిస్తూనే నూరేండ్లు జీవించి ఉండాలని కోరుకోవాలని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తున్నది. మానవులకు కనిపించని సత్యధర్మాలను బోధిస్తూ, అత్యంత సుఖాన్ని కలిగించేవి పరమ ప్రమాణాలైన వేదోక్త కర్మలే! కష్టతరమైన, అవ్యక్తమైన జ్ఞాననిష్ఠ కన్నా, దేహాభిమానం కలిగిన మానవులకు కర్మానుష్ఠానమే అంటే నామ రూపాత్మకమైన సగుణోపాసనే సులభమైనది. అందరికీ ఆమోదయోగ్యమైనది కూడా.
అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న సూర్య భగవానుడు. ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా. చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు. ‘సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ’ అని శ్రుతివాక్యం. లోకాల మనుగడకు, పోషణకు, సర్వజీవులకు సూర్యుడే ఆధారం. ఆయన వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడుతున్నది. ‘ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః’ అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, దానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది.
వేదోక్తమైన నిత్య కర్మానుష్ఠానాల్లో సూర్యోపాసన, సూర్యుడిలోని తేజోమయ పుంజమైన గాయత్రీ ఉపాసన చాలా ముఖ్యమైనది. భారతీయ విజ్ఞానానికి మూలం గాయత్రి. దీనిని సంధ్యా అనీ, సావిత్రీ అనీ, సరస్వతీ అనీ పిలుస్తారు. ‘సంధౌ భవాక్రియా సంధ్యా’- సంధి కాలంలో చేసే క్రియ సంధ్యా వందనం. దివారాత్రులకు సంధిలో ఆరాధించే దేవత సంధ్యా. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో విధిగా మనుషులంతా చేయదగిన ఉపాసన సంధ్యోపాసనే. ‘అహరహః సంధ్యాముపాసితా’ ప్రతిరోజూ సంధ్యను ఉపాసించాలని అని వేదం చెప్తున్నది.
‘ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్ కుర్వన్ బ్రహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే’- ‘ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి’ అని శ్లోక భావం. అన్ని యంత్రాలకు, మంత్రాలకు, తంత్రాలకు చైతన్యాన్ని కలిగించేది తేజోమయ రూపిణి అయిన గాయత్రీ మాతే! ఆవిడే పరాశక్తి. ‘ఏ తేజస్సు మా బుద్ధులను ప్రేరేపిస్తున్నదో, వెలుగుతున్న సవితృమూర్తి (సూర్య భగవానుడి) శ్రేష్ఠమైన ఆ తేజస్సును ఉపాసిస్తున్నాం’ అని గాయత్రీ మంత్రానికి అర్థం. స్త్రీ, పురుష, వర్గ, వర్ణ భేదాలు లేకుండా ఎవరైనా సంధ్యోపాసన చేయవచ్చు. సంధ్యా సమయంలో సూర్యుడికి ఎదురుగా కూర్చొని, కండ్లు మూసుకొని, సూర్యుడిలోని శక్తిని ధ్యానించడమే సంధ్యోపాసన (సూర్య ఉపాసన).
ఈ ఉపాసన వల్ల మహర్షి విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు. పూర్వకాలం రుషులంతా సంధ్యోపాసన వల్ల దీర్ఘాయువును పొందారని పెద్దలు చెప్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని సూక్తి. అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కూడా సూర్య భగవానుడే అని అర్థం. కాల స్వరూపుడైన భగవానుడి ఆరాధనమే సంధ్యోపాసన. కర్మకు శ్రద్ధ జీవం. అందుకే కర్మలను విధి విధానంగా ఆచరించి కర్మల శుభ ఫలాలను పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో సూర్యుడిలోని తేజోపుంజాన్ని ఉపాసించి, తేజస్సును, మేధస్సును, ఆరోగ్యాన్ని పొందుదురు గాక.
-దోర్బల కుమారస్వామి