నతపోభిర్న వేదైశ్చ న జ్ఞానేనాపికర్మణా
హరిర్హి సాధ్యతే భక్త్యా ప్రమాణం తత్ర గోపికాః॥ (పద్మ పురాణం)
‘తపస్సు వల్ల గాని, వేదాల వల్ల గాని, జ్ఞానంతోగాని, కర్మల వల్ల గాని లభించని పరమాత్మ (హరి) కేవలం భక్తితో లభిస్తాడు. అందుకు గోపికలే ప్రమాణం’ అని పద్మ పురాణం చెప్తున్నది. భగవంతుడిపై ప్రేమ, దైవాన్ని పూజించడంలో సంతోషం, ఆయన కథలను, లీలలను వినడంలో, కీర్తించడంలో ఆసక్తి, భగవంతుడి నామాలు ఉచ్చరించడం, దేవుడిని పలు రీతులుగా సేవించడం, నమస్కరించడం, భగవత్ భక్తులను ఆదరించడం ఇలాంటివన్నీ భక్తి మార్గాలే! తనను తాను పరమాత్మకు సమర్పించుకోవడం ఆత్మార్పణ భక్తి. అయితే, భగవంతుడిపై భక్తి ఏర్పడటం అంత సులభమైన విషయం కాదు. ఉన్నపళంగా వచ్చే అదృష్టం కాదిది. అనేక జన్మల పుణ్య విశేషం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఎవరి హృదయంలో భక్తి నిశ్చలంగా ఉంటుందో వారు నిర్ధనులు (ధనం లేని వారు) అయినప్పటికీ వారు ధన్యాత్ములు, పుణ్యాత్ములు కూడా! ఇందుకు కుచేలుడు ప్రత్యక్ష ఉదాహరణ. కుచేలుడి అనన్య భక్తికి పేదరికం అడ్డుకాలేదు. మకరినోట చిక్కిన కరికి భగవంతుడిపై మనసు నిలపడానికి ఉపాధి (శరీరం) అడ్డంకిగా మారలేదు.
శ్రద్ధ, ఆసక్తితో గురువులను, పెద్దలను సేవించడం, వారిని పూజించడం, తనకు లభించిన పదార్థాలను పరమాత్మకు సమర్పించడం, సాధువులు, సత్పురుషుల సాంగత్యాన్ని కలిగి ఉండటం, నామ సంకీర్తనం చేయడం ఇలాంటి వాటివల్ల భగవంతుడిపై సహజమైన భక్తి నెలకొంటుంది. భగవంతుడికి ఆత్మ సమర్పణం చేసుకోవడం వల్ల, భక్తులను సేవించడం వల్ల అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఫలితంగా తత్వజ్ఞానం కలిగి భగవంతుడిని పొందగలుగుతాం.
కామాద్దేషాద్భయాత్ స్నేహాత్ యథా భక్త్యేశ్వరే మనః
ఆవేశ్యతదఘం హిత్వా బహవః తద్గతిం గతాః॥
చాలామంది కామంతో, ద్వేషంతో, భయంతో, సంబంధంతో, స్నేహంతో తమ మనసును ఆ భగవంతుడిపైనే లగ్నం చేసి వారి పాపాలను తొలగించుకొని దైవంలో లీనమయ్యారని భాగవతం చెప్తున్నది. శ్రీకృష్ణ పరమాత్మను మోహించి గోపికలు ఆయన అనుగ్రహాన్ని పొందారు. భయంతో కంసుడు, ద్వేషంతో శిశుపాలుడు, దంతవక్త్రుడు, సంబంధంతో యాదవులు, స్నేహంతో పాండవులు, భక్తితో నారదుడు తమ మనసులను భగవంతుడిపైనే లగ్నం చేసి ఆ దైవాన్ని పొందారు కదా! విశుద్ధమైన భక్తి అలవడితే మార్గం ఏదైనా భగవంతుడిని తప్పకుండా చేరుకోగలుగుతామనడానికి పైన పేర్కొన్న పురాణ పురుషులే ఉదాహరణ.
ఈ లోకంలో భగవన్నామ సంకీర్తనాదులే జీవులకు పరమధర్మమని, భగవంతుడి పాదారవిందాలను పొందడానికి అదే తగిన ఉపాయమని భాగవత వచనం. ఈ ప్రపంచంలో జీవుడికి ఉన్న ఒకే ఒక పరమార్థం భగవంతుడైన గోవిందుడిపై అనన్యభక్తి కలిగి ఉండటం. అన్నివేళలా, అంతటా భగవంతుడిని దర్శించడం ఏకాంత భక్తి. ఇదే నిజమైన భక్తి స్వరూపం. దీనినే ‘స్వార్థం’ (తనకు గల పరమ ప్రయోజనం) అని, అందరినీ సమదృష్టితో చూడటమే భగవంతుడిని వాస్తవంగా ఆరాధించడం అని భాగవతం తెలియజేస్తున్నది.
శ్రీహరి (పరమాత్మ) సమస్త జీవుల్లో ఉన్నాడనే భావంతో వాటి శ్రేయస్సును కోరుకోవాలి. సమస్త ప్రాణులనూ గౌరవించాలి. దరిద్రుడిలోనూ నారాయణుడిని దర్శించగలగాలి. ప్రచారం కోసం ప్రదర్శించే యుక్తులు నిజమైన భక్తికి దారితీయవు. ముక్తినీ ప్రసాదించలేవు. మనలోని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి భగవంతుడిని సేవించేవారికి అనన్యమైన భక్తి కలుగుతుంది. ఫలితంగా సంసార బంధం తొలగిపోయి ముక్తి కలుగుతుంది. చివరికి భక్తులందరూ భగవంతుడిని పొందుతారు.
-దోర్బల కుమారస్వామి ,రామాయంపేట