Heart Attack | ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చే ముందు మనకు కొన్నిలక్షణాలను చూపిస్తుంది. ఈ లక్షణాలు ముదిరే వరకు మనకు అనారోగ్య సమస్య ఉందనే తెలియదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అప్పటికప్పుడు వచ్చినా కొన్ని మాత్రం మనకు ముందు నుండే సంకేతాలను, లక్షణాలను కనబరుస్తూ ఉంటాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. హృదయ స్పందన ప్రతి ఒక్కరి జీవితానికి చాలా ముఖ్యమైనది. గుండెపోటు వచ్చే శరీరం నిరంతరం సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమై కొందరు ప్రాణాలను కూడా విడుస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం గుండెపోటు రాకముందు శరీరం వివిధ సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలపై శ్రద్ద వహించడం వల్ల మనం గుండెపోటు బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ముందు మన శరీరం కనబరిచే లక్షణాల గురించి తెలుసుకుందాం.
గుండెపోటు వచ్చే ముందు కొందరిలో ఛాతిలో ఒత్తిడిగా ఉంటుంది. దీనిని ఆంజినా అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ఊపిరాడకుండా ఉండడంతో పాటు ఆందోళనగా ఉంటుంది. గుండెకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగనప్పుడు ఇలా జరుగుతుంది. తరచూ ఛాతిలో నొప్పి రావడం, ఒత్తిడి ఇలాగే కొనసాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకస్మాత్తుగా తలతిరగడం, చలి చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే ఆహారం సరిగ్గా తీసుకున్నప్పటికీ నీరసంగా ఉంటుంది. ఇది కూడా గుండె సమస్యకు సంకేతం కావచ్చు. గుండెతో పాటు ఊపిరితిత్తులు కూడా రక్తప్రసరణ లోపం వల్ల ప్రభావితం అవుతాయి. రక్తప్రసరణ సాఫీగా సాగకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి.
చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పటికి అలసటగా ఉంటుంది. గుండెకు రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇక గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్రలేమి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. కనుక నిద్రలేమి సమస్య తలెత్తిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే అలస్యం చేయకుండా గుండె సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ లక్షణాలు గుండెపోటు కారణంగా వచ్చాయా లేదా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా వచ్చాయా అని నిర్దారించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం చేయాలి. ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి. అలాగే జన్యుపరగంగా రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటే తరచూ పరీక్షలు చేయించుకోవడం మంచిది.