లలితా సహస్ర నామం జగత్ప్రసిద్ధం. సహస్రం, శతం అనే పదాలు అనంతం… అంటే అంతం లేనిదనే అర్థాన్నీ తెలియజేస్తాయి. అలాంటి అంతం లేని ఆదిపరాశక్తిని అనంతంగా స్తుతించడానికి సహస్ర నామస్తోత్రం అనే ప్రక్రియను రుషులు మనకు వరంగా ఇచ్చారు. లలితా సహస్ర నామాలను అమ్మవారి ఆజ్ఞతో హయగ్రీవుడు యోగ్యుడైన అగస్త్య మహర్షికి ఉపదేశించాడు. హయగ్రీవుడి ముఖంగా వెలువడిన ఈ సహస్ర నామ స్తోత్రానికి ఎంతో విలువ ఉంది. ఎందుకంటే ఇది మనిషి సంకల్పించింది కాదు కాబట్టి. సహస్ర నామాలు అనేకం. లక్ష్మీ, దుర్గ, సరస్వతీ సహస్ర నామాలు ఇలా చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకు వ్యాసుడు రచించినవే ఎక్కువ. లలితా సహస్ర నామాలు మాత్రం వ్యాసుడి ముఖంగా వెలువడినవి కావు. వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు అందించాడు. తననుంచే సృష్టించిన వశిన్యాది దేవతలతో సాక్షాత్తూ అమ్మవారే ఈ నామావళిని పలికించింది. ఫలశ్రుతి కూడా ఆమెనే చెప్పింది. ఇందులో ఒక్క అక్షరం కూడా అనవసరమైనది ఉండదు.
మనం ఉపాసించే దేవత గురించి సహస్ర నామం సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ప్రతీ దేవతకూ ఒక రూపం, అనేక గుణాలు, లీలలు, ఆ దైవంలో కనిపించకుండా దాగి ఉన్న తత్త్వం ఉంటాయి. ఈ నాలుగు తెలిస్తే మనకు ఆ దేవత మీద సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ఆ విధంగా వారి గురించి తెలుసుకొని ఉపాసన చేస్తే ఫలితం ఉంటుంది. దేవత గురించి జ్ఞానం లేకుండా ఉపాసన చేస్తే ఫలితం పరిపూర్ణం కాదు. ఒకవేళ జ్ఞానం లేకపోయినా కనీసం కపటం లేని భక్తి అయినా ఉండాలి. అహంకారాన్ని విడిచిపెట్టి నిష్కపటమైన భక్తితో అమ్మవారిని ఆరాధించగలగాలి. ఒక దేవత గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే ఎన్నో పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. అందువల్ల రుషులు ఒక్కొక్క నామంలోనే సంక్షిప్తంగా దేవత గురించి సమస్త తత్త్వాన్నీ నిక్షిప్తం చేశారు. పైగా పుస్తకాల్లో ఉన్న ప్రతీ విషయం మనకు గుర్తుండకపోవచ్చు. అదే లయబద్ధంగా ఉండే నామావళి రూపంలో అయితే చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. కాలక్రమంలో ఆ నామాలకు అర్థాలను తెలుసుకుంటే అమ్మవారి తత్త్వం అంతా బోధపడే అవకాశం ఉంటుంది. లలితా సహస్ర నామాలను పఠిస్తే స్తోత్రం. అర్థంతో సహా తత్త్వాన్ని ఆకళింపు చేసుకుంటే శాస్త్రం.
శ్రీమాతా శ్రీమహారాజ్ఞి మొదలుకొని స్తోత్రం చివరివరకు లలితా నామాల్లో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. అలా రోజూ ఈ నామాలను చదువుతూ ఉంటే వాటిలో ఉండే బీజాక్షరాల శక్తి మనలో ప్రవేశిస్తుంది. మనకు సర్వకాల, సర్వావస్థలలో రక్షణగా నిలుస్తుంది. అందుకే ఆ స్ఫురణతోనే అమ్మవారి నామ పారాయణం చేయాలి. సిద్ధ పురుషులు, మంత్ర శాస్త్రవేత్తలు మంత్ర జపం చేసేముందు ధ్యానం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే? ధ్యానిస్తున్న ఆ దేవత మంత్రజపం ద్వారా ఉద్భవిస్తున్న చైతన్యమనే భావన కలగడం కోసం. దానివల్ల ఆ దేవతా మూర్తులను దర్శించుకోవడమే కాకుండా, సామాన్యులు మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా వారు ఆయా దేవతలను చూడగలుగుతారు. కేవలం పూర్వికుల నుంచి పరంపరాగతమైన మంత్రాల జ్ఞానం వారసత్వంగా వచ్చినవారికే ఇది సాధ్యమవుతుంది. అలాంటి శక్తి సత్ఫలితాలను ఇస్తుంది కూడా! అందుకే ఆయువు ఉన్నంతకాలం చేసే నామ జపాల వల్ల జీవుడికి కావలసినవి ఆ దేవత ఇవ్వడమే కాకుండా, మనం చేసే సాధన తర్వాత తరతరాలకు కొనసాగుతుంది. పాపం అయినా, పుణ్యమైనా అంతే. ఏది చేయాలో నిర్ణయించుకోవలసింది మనం.
లలితా సహస్ర నామాల్లోని వేయి రూపాల ఏక శక్తి అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మే. ఇలాంటి అద్భుతమైన భావం కలిగితే ఆ అమ్మవారన్నా, ఆమె వైభవాన్ని వర్ణిస్తూ సాగిన లలితా సహస్ర నామాలన్నా శ్రద్ధా భక్తులు ఏర్పడతాయి. నామాలను నియమబద్ధంగా పఠిస్తే ఆయురారోగ్యాలు, సకల సంపదలూ సమకూరుతాయి.
–వేముగంటి శుక్తిమతి ,99081 10937