జగత్సూతే ధాతా, హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్థిరయతి
సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞామాలంబ్య క్షణ చలితయోర్భ్రూలతికయోః!
(సౌందర్యలహరి – 24)
బ్రహ్మ విష్ణు రుద్రులు సకల చరాచర జగత్తు సృజన స్థితి లయ అనే కార్యాలను నిర్వహిస్తున్నారు. వీటిని నిర్వహించే త్రిమూర్తులనే కాలపురుషులు అంటారు. ఈశ్వరుడు ఆ త్రిమూర్తులను తనలో అంతర్హితం చేసుకుంటున్నాడు. ఈ నాలుగు తత్వాలను సృష్టి, స్థితి, లయ, తిరోధానాలుగా చెప్తారు. తిరోధాన సమయంలో పూర్తిగా లయమైన సృజనాది ప్రక్రియను సదాశివుడు అమ్మ కరుణా కటాక్షాలను పొంది తిరిగి ఈ నాలుగు తత్వాలను ప్రకాశితం చేస్తున్నాడు. దీనినే అనుగ్రహంగా చెప్తారు. అనుగ్రహం అంటే తిరిగి గ్రహించడం. అంటే ఇదివరకు లయమైన దానిలో ఏది అవసరమో, ఏది అవసరం లేదో విచారించి తిరిగి అవసరానుగుణంగా సృజించడం అనుగ్రహం. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనే ఐదు కార్యాలనే పంచకృత్యాలుగా వ్యవహరిస్తారు. ఈ ఐదు తత్వాలను నిర్వహించే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులనే పంచ బ్రహ్మలు అంటారు. లేత తీగల వలె ఉన్న అమ్మ కనుబొమ్మల కదలికల ద్వారా ఆజ్ఞలను పొంది పంచబ్రహ్మలూ తమ తమ కార్యాలను నిర్వహిస్తున్నారు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే ప్రక్రియ. మహాప్రళయ సమయంలో రుద్రుడు విష్ణువులోనూ, విష్ణువు బ్రహ్మలోనూ, బ్రహ్మ ఈశ్వరునిలోనూ, ఈశ్వరుడు సదాశివునిలోనూ లీనమవుతారు. మళ్లీ సృష్టి సంకల్ప సమయంలో వీరందరూ వ్యక్తమై తమ తమ విధ్యుక్త కర్తవ్యాలను నిర్వహిస్తారు.
‘సృష్టి స్థిత్యుపసంహార తిరోధాన గ్రహాత్మకమ్
కృత్యం పంచవిధం యస్మాత్తం నమః శాశ్వతమ్ శివమ్’ అంటుంది, శాంభవదీపిక. అమ్మవారిని లలితా సహస్ర నామాలు పంచకృత్య పరాయణగా కీర్తిస్తాయి. ‘సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణి, సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీ, ఈశ్వరీ, సదాశివ, అనుగ్రహదా’ అని అమ్మను కీర్తించాయి లలితా సహస్రనామాలు. ఆదిశక్తే ఈ ఐదు శక్తులుగా వ్యక్తమై ఆయా విధులు నిర్వహిస్తున్నది. సృష్టి చేసే సమయంలో బ్రహ్మరూపంలోనూ, రక్షణ సమయంలో విష్ణువుగానూ, సంహార సమయంలో రుద్రునిగానూ, తిరోధాన సమయంలో ఈశ్వరునిగానూ, తిరిగి సృష్టించే సమయంలో సదాశివుని రూపంలోనూ అమ్మ శక్తి ప్రకటితమవుతున్నది. సదా అంటే ఎల్లప్పుడు.. శివుడు ఆనందమయుడు. ఎల్లప్పుడు ఆనందస్థితిలో చైతన్యరూపంలో మన శరీరంలోనూ, సృష్టి అంతటా సంచరించే శక్తినే సదాశివ అంటారు. జాగృదావస్థలో చేసిన, చేస్తున్న పనులను నిద్రావస్థలో మరిచిపోయి తిరిగి మెలకువ రాగానే అవన్నీ ఎలాగైతే జ్ఞాపకం వస్తాయో, అలాగే లయకాలంలో అదృశ్యమైన సృష్టి మళ్లీ ఆవిష్కృతమవుతుంది. అంటే ఏ చైతన్యమైతే జడత్వాన్ని ఆశ్రయించి స్తబ్ధుగా ఉంటుందో, దానిలో చైతన్యం ప్రసరించగానే మళ్లీ ఎలాగైతే పనిచేస్తుందో, అలాగే తిరోధాన సమయంలో సృష్టి అదృశ్యమై తిరిగి అనుగ్రహ సమయంలో ఆవిర్భవిస్తుంది.
మన శరీరంలోనే ఈ ఐదు ప్రక్రియలు నిత్యం జరుగుతుంటాయి. కణాల చేత నిర్మితమైన శరీరంలో నిత్యం ఎన్నో కణాలు మరణించడమూ, పుట్టడమూ జరుగుతూనే ఉంటుంది. మరణించిన కణాలు మనలోనే ఉంటాయి. చనిపోయిన కణాలకూ ఆశ్రయం ఇస్తున్న మన శరీరమే మహా శ్మశానం. అందులో చైతన్య రూపంలో వసించేవాడే పరేతవాసి. అలాగే పుట్టుక నుంచి మరణించేదాకా బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యం ఇలా ఎన్నో దశలు దాటుతుంటాం. అదే సృష్టి క్రమం. ఈ క్రమమే శరీరం పడిపోయాక మళ్లీ కొత్త శరీరంగా అవతరిస్తున్నది. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. దీనినే పంచకృత్య పరాయణగా చెప్తూ శంకరులు జ్ఞానబోధ చేస్తున్నారు. తన కనుబొమ్మల ద్వారా ఆజ్ఞలు ఇస్తూ పంచబ్రహ్మలను నడిపించే పరమేశ్వరి మనందరినీ కాపాడాలని ప్రార్థిద్దాం.
-పాలకుర్తి రామమూర్తి