బిడ్డ పుట్టగానే, తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. కానీ, నిజమైన ఆనందం ఆ పసికూన వంశానికి వన్నె తెచ్చినప్పుడే కలుగుతుంది. ఈ భూమ్మీద నిత్యం ఎందరో పుడుతుంటారు. చోరుల ఇంట పుట్టి రాజుగా ఎదిగిన వాళ్లూ ఉంటారు. రాజుల వంశంలో పుట్టి చోరీలకు తెగబడే ప్రబుద్ధులూ ఉంటారు. కన్నవారి కలలను సాకారం చేసి, ఉన్న ఊరికి మేలు చేసేవారే నిజమైన వారసులు. అలాంటి నిజమైన వారసులు మన పురాణాల్లో కోకొల్లలు. పార్వతీదేవి హిమవంతుడి వంశంలో పుట్టింది. నగరాజైన హిమవంతుని వంశం ఒక ముత్యపు చిప్ప అయితే అందులో ముత్యంలా మెరిసింది అమ్మవారు. ఆ తల్లి ఆవిర్భావం తర్వాత ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమైందట. అంతకుముందెన్నడూ పండని పంటలు కూడా పండాయట. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసి మెప్పించింది. సాక్షాత్తూ శివుడికి కన్యాదానం చేసే వరాన్ని తన తండ్రికి ప్రసాదించింది. శివుడి పట్టమహిషిగా, జగన్మాతగా పూజలందుకొని తను జన్మించిన వంశానికి తరగని యశస్సును కలిగించింది.
భూజాత అయిన సీతకు మేత్రేయి అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే, ఆమె అందరితోనూ స్నేహంగా మసులుకునేది. సాహసవంతురాలు. జనక మహారాజు యాగంలో భాగంగా పొలం దున్నుతుండగా, నాగటి చాలులో ఓ పసిబిడ్డ దొరికింది. ఆ చిన్నారి సీతను జనకుడు చేతికి అందుకోగానే, అప్పటివరకు కరువు కాటకాలతో మగ్గిపోయిన దేశంలో నెలకు నాలుగు వర్షాలు కురిసి, పంటలు పండి ఆ ప్రాంతమంతా సుభిక్షమైంది. సీతమ్మ పెరిగే కొద్దీ, మిథిలా నగరం సిరిసంపదలూ పెరిగాయి. ప్రేమ, ఔదార్యం, అణకువ ఇలా సకల సుగుణాలు కలిగిన సీతమ్మ యుగయుగాలకు ఆదర్శమూర్తి. రాముడి వెంట అడవులకు వెళ్లి ఉత్తమ ఇల్లాలుగా నిలిచింది. జనకుడి విదేహ వంశానికి శాశ్వతకీర్తిని తీసుకొచ్చింది.
శ్రీరామచంద్రుడు రఘు వంశానికి, శ్రీకృష్ణ భగవానుడు యదువంశానికి నిజమైన వారసులై మానవత్వ విలువలు చాటిచెప్పారు. సాక్షాత్తూ బ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు మాత్రం లోక కంటకుడన్న అపకీర్తి మూటగట్టుకున్నాడు. సకల వేదాలూ రావణుడికి కరతలామలకం. దివ్యమైన తపోశక్తి ఆయన చుట్టూ పరివేష్టితమై ఉండేది. రావణుడిని మొదటిసారి చూసినప్పుడు శ్రీరాముడు సైతం ‘ఎంత తేజస్సు! జగతిలో ఈయనకు సాటి ఎవరైనా ఉన్నారా?’ అని ఆశ్చర్యపోయారట. కానీ, స్త్రీ వ్యామోహంతో తన తపస్సును వృథా చేసుకున్నాడు. తానొక్కడే కాకుండా, తన వంశ నాశనానికీ కారణమయ్యాడు. చాలామంది అసురులు తమ లక్షణాల వల్ల తమకు, తమ వంశాలకూ అపకీర్తి తెచ్చిపెట్టుకున్నారు. పురాణాల్లో భండాసురుడు అనే రాక్షసుడున్నాడు. ఈ అసురుణ్ని సృష్టిస్తూ బ్రహ్మదేవుడు ‘భండ, భండ’ అన్నాడట. భండ అంటే ‘ఛీ’ అని అర్థం. అంటే చీదరించుకో దగిన గుణాలకు భండాసురుడు ఒక ఆకారం. ఇదే రాక్షస వంశంలో జన్మించి సద్గుణ సంపన్నుడిగా నిలిచాడు ప్రహ్లాదుడు. ధర్మం గురించి బోధించని విద్యలు తనకొద్దని తిరస్కరించాడు. ప్రహ్లాదుడి మనవడు బలి ధర్మనిరతితో శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాడు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి.
పుట్టుకతో ఎవరూ గొప్పవాళ్లు కాలేరు. పిల్లలను సరైనమార్గంలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. విద్యాబుద్ధులు నేర్చినంత మాత్రాన సరిపోదు. సంపాదించిన జ్ఞానాన్ని లోకానికి వినియోగించడం విజ్ఞత. శక్తియుక్తులను విధ్వంసానికి ఉపయోగిస్తే స్వార్థపరులుగా మిగిలిపోతారు. ‘వంశంలో చెడపుట్టార’న్న అప్రతిష్ఠను మూటగట్టుకుంటారు. వంశోన్నతికి పాటుపడిన పురాణమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడుద్దాం. ఘనమైన వంశ చరిత్రకు నిజమైన వారసులుగా నిలుద్దాం.
-వేముగంటి శుక్తిమతి , 99081 10937