యోగులు, రుషులు, సర్వసంగ పరిత్యాగులు ఎందరో నడయాడిన పుణ్యదేశం మనది. ఇప్పటికీ ఎందరో యోగులు ధార్మిక ప్రచారం సాగిస్తూ ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్నారు. సంసార జీవనంలో ఉంటూ లోకహితం కోసం పాటుపడుతున్నవారూ ఉన్నారు. సంసారంలో ఉన్నా నిరంతర సాధనతో ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధన కొనసాగించేవారే నిజమైన యోగులు. లౌకికంగా ఎన్ని విషయాలు చుట్టుముట్టినా.. వాళ్లు అంతరంగంలో భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు.
సంసార బంధాలను త్యజించి సన్యాసం తీసుకున్నవాళ్లే యోగులు అనుకుంటారు కొందరు. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్’ అనే భావంతో లోకహితం కోసం కర్మలను ఆచరించేవారంతా యోగులే. తురీయాశ్రమాన్ని స్వీకరించిన సన్యాసి అయినా, గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి అయినా పరోపకారం పరమావధిగా భావించడం యోగికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. కాషాయం కట్టుకున్నంత మాత్రాన యోగి కాడు. కుటుంబంతో ఉంటున్నాడు కాబట్టి సంసారి అనుకోవద్దు. ఇంద్రియాల వలలో పడిపోకుండా, మనో నిగ్రహం పాటించేవాళ్లంతా యోగులే. వాళ్లు పొగడ్తలకు పొంగిపోరు. నిందలకు కుంగిపోరు. రెండింటినీ సమానంగా భావిస్తారు. నిందలకు, స్తుతులకు స్పందన చెందక మానసికంగా భగవంతుడితో మమేకమవుతారు.
నృత్యకారిణి నాట్యం చేస్తూ కాళ్లూ, చేతులూ కదుపుతూ ఉంటుంది. వివిధ భంగిమలు ప్రదర్శిస్తుంటుంది. సందర్భోచితంగా తన ముఖంలో రకరకాల హావభావాలు ప్రకటిస్తూ ఆహూతులను రంజింపజేస్తుంది. అదే సమయంలో తన తలపై ఉన్న కలశం జారిపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆమె యథాలాపంగా నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. కానీ, ఆ కలశంపై తన మనసు లగ్నం చేస్తుంది. అలాగే యోగులు కూడా లౌకికంగా కొన్ని పనులు నిర్వర్తిస్తున్నా.. అంతరంగంలో భగవంతుడి ధ్యానంలోనే ఉంటారు. యోగత్వాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉంటారు. ఐహిక సుఖాలను కోరుకోకుండా, లాభాపేక్ష లేకుండా, ధన వస్తువులు ఆశించకుండా పరోపకారమే పరమావధిగా జీవనం సాగిస్తుంటారు.
భారతదేశంపైకి దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌కు ఓ నదీతీరంలో ఒక యోగి తటస్థపడతాడు. ఆ యోగితో ‘నేను విశ్వవిజేతను. నీకేం కావాలో కోరుకో ఇస్తాను’ అంటాడు. సూర్య కిరణాల స్నానంలో తాదాత్మ్యం చెందుతున్న ఆ యోగి.. ‘నేను చేస్తున్న స్నానానికి అడ్డుగా ఉన్నావు. పక్కకు తొలగు’ అన్నాడట. వారిస్థాయి అటువంటింది. ఈ సంఘటన తర్వాత అలెగ్జాండర్ సైన్యంతో.. ‘ఈ దేశంలో యోగులు, సన్యాసుల జోలికి వెళ్లవద్ద’ని హెచ్చరించాడట. ‘అప్పుడంటే అలాంటి యోగులున్నారు, ఈ కాలంలో ఎక్కడున్నారు?’ అనుకుంటే పొరపాటు. వారు అంతర్ముఖులై ఉంటారు. అంతరంగంలో చిదానంద రూపాన్ని నిలుపుకొని సదా ఆనందిస్తుంటారు.
కపట యోగులూ కోకొల్లలుగా ఉంటారు. కాషాయం కట్టుకున్నా.. అయినదానికి, కానిదానికి కస్సుబుస్సులాడుతుంటారు. ఒకానొక గ్రామానికి కాశీ నుంచి ఓ యోగి వస్తాడు. ఆయన గ్రామవాసులను అందరినీ పిలిచి తన అనుభవాలు చెప్పడం మొదలుపెట్టాడు. ‘మనిషి పతనానికి కారణం కోపం. కాశీలో నేను నా కోపాన్ని వదిలేశాను. మీరంతా నా బోధనలు వింటే కోపాన్ని జయించగలుగుతారు’ అన్నాడు. ఆ సభలోనే ఉన్న ఓ బాలుడు ఏమీ అర్థం కానివాడిలా.. ‘స్వామి కాశీలో మీరేది వదిలేశారు?’ అని ప్రశ్నించాడు. ‘కోపాన్ని నాయనా!’ అన్నాడు స్వామి మృదువుగా. మళ్లీ అదే ప్రశ్న వేశాడు కుర్రాడు. ‘కోపాన్ని’ అని పొడిగా బదులిచ్చాడు. మరోసారి అలాగే అడిగాడు. సాధువు కోపంతో ఊగిపోతూ ‘కోపాన్ని.. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవేంటి’ అన్నాడు. సభలో ఉన్నవారంతా గొల్లుమన్నారు. కోపాలు, తాపాలు, కోరికలు, ఆశలు వదిలేస్తే పోయేవి కావు. అంచెలంచెలుగా వాటిని అధిగమిస్తూ రావాలి. అలా అన్నిటినీ జయించినవాడే నిజమైన యోగి.
-కనుమ ఎల్లారెడ్డి , 93915 23027