ఇప్పటికే వరుస హిట్స్‌తో హ్యాట్రిక్ సాధించిన హీరో నవీన్ పొలిశెట్టి.. తన తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని, నవీన్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచిందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. కేవలం అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ 100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్ రికార్డులను ఈ సినిమా తిరగరాసిందని నాగవంశీ అన్నారు.
ఇంకా చెబుతూ ‘ఇది చారిత్రాత్మక విజయం. ఈ సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడం అరుదైన విషయం. యూఎస్‌లోనూ నవీన్ పొలిశెట్టి గత చిత్రాల వసూళ్లకు రెట్టింపు వసూళ్లను ‘అనగనగా ఒక రాజు’ సాధించింది. ఈ సినిమాపై మా నమ్మకాన్ని నిజం చేస్తూ జనం పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలిరావడంతో, రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి.
కడుపుబ్బ నవ్వించే హాస్యం, కంటతడి పెట్టించే భావోద్వేగాలు, దర్శకుడు మారి బలమైన రచన.. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఈ సినిమా జోరు ఇప్పట్లో ఆగే సూచనలు లేవు. మరిన్ని మైలురాళ్లను చేరుకునే దిశగా ఈ సినిమా పరుగులు పెడుతున్నది.’ అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆనందం వెలిబుచ్చారు. మీనాక్షి చౌదరి ఇందులో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.