ఎప్పుడూ ఎడతెగక పారే నదులున్నచోట నివసించాలని పెద్దల మాట. అందుకే మన పూర్వికులు, మహర్షులు నదుల చుట్టూ తమ జీవనాన్ని ఏర్పర్చుకున్నారు. జీవనదులు మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి వనరులు. సనాతన సంస్కృతి, సంప్రదాయాలన్నీ నదులతో పెనవేసుకొన్నవే. నదుల వల్ల మనకు తాగు, సాగునీరు లభిస్తున్నాయి. ఇలాంటి భౌతిక అవసరాలకు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఆనందాలతో మనల్ని పరవశింపజేస్తాయి పావన నదులు.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయని తైత్తిరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. ఇలా జీవరాశి పుట్టుకకు ప్రధానమైన కారణమైన నీటి ప్రాముఖ్యాన్ని పుష్కరాలు గుర్తుచేస్తాయి. మన సంస్కృతిలో నదీ స్నానానికి విశిష్టత ఉన్నది. ప్రత్యేకించి పుష్కరాల్లో, పర్వకాలాల్లో, గ్రహణాదులలో, యజ్ఞయాగాది క్రతువుల ప్రారంభ, ముగింపు సందర్భాలలో ఇంకా అనేక చోట్ల నదీ స్నానం ఆచరించాలని ధర్మశాస్ర్తాలు చెప్తున్నాయి.
పుష్కరాల సందర్భంగా నదీస్నానం విశేషం అని శాస్త్ర వచనం. మేషం మొదలుకొని మీనం వరకు గురువు ఏడాదికి ఒక రాశి చొప్పున మారుతుంటాడు. గురువు రాశి మారినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు ఏర్పడుతాయి. ఈ సమయంలో దేవతలకు గురువైన బృహస్పతితోపాటు పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలు ఆ నదిలో కొలువుంటారు. పుష్కరాల సందర్భంగా నదీస్నానం ఆచరించినవారికి సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు, ఈ సమయంలో దానాలు- పిండ ప్రదానాది కర్మలు ఆచరించడం ద్వారా పితృ దేవతలకు మోక్షాన్ని కలిగించినవారవుతారు.
ఈ రోజు గురువు మీనరాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే ప్రాణహిత పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహితకు ఏర్పడుతున్న మొదటి పుష్కరాలివి. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత. వార్ధా- వైన గంగా రెండు నదులు సంగమించి ప్రాణహితగా నామాంతరం చెందాయి. మహారాష్ట్ర సరిహద్దు దాటి బెజ్జూర్, వేమనపల్లి, కోటపల్లి మండలాల మీదుగా ప్రవహిస్తూ కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది ప్రాణహిత. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నది. ప్రాణహితను ప్రణీత అని కూడా అంటుంటారు.
బ్రహ్మ పురాణ అంతర్గతమైన గౌతమీ మాహాత్మ్యంలో ప్రాణహిత నది వర్ణన కనిపిస్తుంది. దీనిలో 92వ అధ్యాయంలో ప్రాణహిత నది ప్రస్తావన ఉన్నది.
కుశతర్పణమాఖ్యాతం ప్రణీతా సంగమం తథా
తీర్థం సర్వేషు లోకేషు భుక్తిముక్తి ప్రదాయకమ్
‘కుశతర్పణం, ప్రణీతా సంగమ తీర్థం అని పేర్కొనే ప్రాణహిత తీర్థం భుక్తిముక్తి ప్రదాయకమై సర్వలోకాల్లో ఖ్యాతి గడించింది’ అని అభివర్ణించారు.
తిస్రఃకోట్యర్థ కోటినీ తీర్థాని భువనత్రయే
ప్రణీతా సంగమే యాంతి మీన యుక్తే బృహస్పతీ॥
స్నానదానే జపేహెూమే స్వాధ్యాయే పితృతర్పణే
దేవార్చనేచ కాశ్యాయాం కృత తత్ర ఫలమశ్నుతే॥
‘మీనరాశిలో బృహస్పతి ప్రవేశించిన సమయంలో ప్రణీతానదిలో 33 కోట్ల దేవతలు కొలువుంటారు. ఆ సమయంలో ప్రాణహితలో చేసే స్నానం, దానం జపం, పితృతర్పణం, పిండ ప్రదానాలు కాశీ క్షేత్రంలో చేసినంత ఫలితాన్నిస్తాయి’ అని శాస్త్రం చెప్తున్నది.
పాపం జన్మ సహస్రైశ్చ కృతం యద్వర్తతే యమః
స్నానమాత్రేణ శుధ్యంతే పెనుగంగా సరిద్వరా॥
‘ప్రాణహిత నదిలో స్నానం వల్ల ఏడు జన్మల పాపం తొలగిపోతుంది. శారీరకంగా, మానసికంగా శుద్ధిని పొందుతారు’ అని పై శ్లోకానికి అర్థం.ప్రాణహితలో పుష్కర స్నానం ఆచరించే సమయంలో..
‘బ్రహ్మాండోదర తీర్థానాం ఆదిభూతే సనాతనీ
గృహాణార్ఘ్యం మయాదత్తం ప్రణీతే బ్రహ్మనిర్మితే’ అని శ్లోకం చదివి మూడు దోసిళ్లతో జలం వదలాలి (అర్ఘ్య ప్రదానం).
ప్రణీతానది పరివాహకంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో వేమనపల్లిలో దశావతారాలు, తోగువేంకటాపూర్లో వేంకటేశ్వరస్వామి క్షేత్రం, శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి ఆలయాలు ప్రధానమైనవి.
-అప్పాల శ్యాంప్రణీత్ శర్మ అవధాని , 9440951366