అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మాండపురాణంలో దేవీతత్వాన్ని ఉన్నతంగా వర్ణించారు. అందులో లలితాఖండంలో ఆ తల్లి తత్వం నిబిడీకృతమై ఉంది. ఈ చరాచర సృష్టి సత్వ, రజో, తమో గుణాలతో నిండి ఉన్నదని బ్రహ్మాండ పురాణం పేర్కొన్నది. ఈ త్రిగుణాలలో సత్వం అంటే దేశం, రజస్సు అంటే కాలం, తమస్సు అంటే వస్తువు. అంటే దేశ కాల వస్తువులే త్రిగుణాలని అర్థం. ఇవే మరో మాటలో చెప్పాలంటే నామరూప క్రియలు. నామం రూపంతో పెట్టుకునే సంబంధమే క్రియ. ఈ మూడింటికీ అధిపతి అయినదే లలిత. తత్వాధికా, తత్వమయీ అనే లలితా నామాలను బట్టి ఈ మూడింటిని దాటిపోయిన తత్వం ఆమెది. తిరిగి మూడింటి రూపంలో ప్రత్యక్షయ్యేది ఆ తల్లే. అంటే తత్వానికి అతీతమైనది, తత్వాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకునేది లలితా స్వరూపం.
ఒక దేవతను ఆరాధించే ప్రక్రియను తెలియజేసే శాస్త్రం తంత్రం. ఈ లోకంలో మానవులు తమ కోర్కెలను తీర్చుకోవటం కోసం రకరకాల తంత్రాలున్నాయి. కానీ అమ్మవారి తంత్రం మాత్రం దానికదే ప్రత్యేకమైనది. మానవులు లౌకిక ప్రయోజనాలు తీర్చుకోవడానికి పరమేశ్వరుడు 64 తంత్రాలు ఇచ్చాడు. కానీ అమ్మవారి తంత్రం మోక్షాన్నిస్తుంది. ఈ రెండు పరస్పరం విరుద్ధం. అందుకే లోకక్షేమం కోసం అటు భుక్తిని , ఇటు ముక్తిని ఇవ్వగలిగే ఒక శాస్ర్తాన్ని అమ్మవారి ప్రోద్బలంతో ఈశ్వరుడు ఇచ్చిన శక్తి లలితాదేవి ఆరాధనలో ఉంది. ఆ తంత్రమే శ్రీవిద్య. అది అన్ని తంత్రాల్లో కలవని స్వతంత్ర తంత్రం. అమ్మవారి విద్యను ఆవిష్కరించి ఇచ్చినవాడు దక్షిణామూర్తి. దాన్ని వ్యాఖ్యానించి చెప్పినవాడు హయగ్రీవుడు. శివుడు ధరించిన గురు రూపం దక్షిణామూర్తి అయితే, విష్ణువు గురుమూర్తి రూపం హయగ్రీవుడు. ఇద్దరూ బ్రహ్మవిద్యా స్వరూపులే.
అటు శివుడూ, ఇటు విష్ణువూ ఆచార్య రూపం ధరించి బోధించింది అమ్మవారి గురించే. లలితాదేవి చరిత్రనంతా చెప్పింది హయగ్రీవుడు. లలితాదేవి మంత్రాన్ని, తంత్రాన్ని, రహస్యాలను, యంత్ర విజ్ఞానాన్ని బోధించింది దక్షిణామూర్తి. వీరిద్దరూ ఆ తల్లి పరిపూర్ణ తత్వాన్ని మనకు బోధించారు. ఒక అద్భుతమైన పద్ధతిలో తనను తాను ఆవిష్కరించుకొని కథను నడుపుతాడు భగవంతుడు. తర్వాత ఆ అవతారాన్ని ఉపసంహరించుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే? నామరూపాలకు అతీతంగా అత్యంత సూక్ష్మమై, సర్వవ్యాపకమైన చైతన్యమే భగవంతుడని అవ్యక్తాన్ని చెప్పుకుంటే మనకు ఎలాంటి అనుభూతి కలగదు. అందుకే నామరూపాల్లేని పరమాత్మ నామరూపాల్లోకి రావడమే లీల.
అయితే, ఎప్పటికప్పుడు లోకరక్షణ కోసం ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించే భగవంతుడు ఆ తర్వాత కూడా ఆ చరిత్రను స్మరించినవారికి ఆత్మోద్ధరణ చేస్తాడు. ఉదాహరణకు ఏ యుగంలోనో రామచంద్రుడు రావణుడిని వధిస్తే ఆ రామాయణ కథను ఇప్పటికీ, ఎప్పటికీ చదువుకొని మనం తరిస్తున్నాం. అందుకే భగవంతుడు చేసిన లీల ప్రపంచాన్ని ఎప్పుడూ కాపాడుతుంది. అమ్మవారికి దేవి అనేదే అసలైన పేరు. దేవి అంటే ఒక మహా మంత్రం. సమస్త దేవతలకు దేవి కాబట్టి ఆమె మహాదేవి. దేవి అంటే ఆడుకునేదని అర్థం. ఆనందం కోసం జ్ఞానంతో ఆడేదే ఆట. అంటుకోకుండా, అలవోకగా ఆడేదే ఆట. అందుకే ఆ తల్లి ఈ ప్రపంచంలో సృష్టి స్థితి లయలన్నింటినీ ఆటగా అవలీలగా ఆడుతుంది. దేవి అంటే లీలా స్వరూపిణి. ఆ లీలలే అద్భుత చరిత్రలని హయగ్రీవుడు లలితా నామాల్లో వివరించాడు. అందుకే అమ్మవారికి ‘లీలా క్లుప్త బ్రహ్మాండ మండలా’ అనే నామం సార్థకం.
లలితా స్వరూపాన్ని త్రికరణశుద్ధిగా ఆరాధన చేసే వారి హృదయాల్లో ఆ తల్లి ప్రవేశించి జ్ఞానదీపాన్ని వెలిగించి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లి ‘కలి కల్మష నాశిని’. సులభంగా మోక్షాన్నిచ్చేది అమ్మను ఆరాధించే శ్రీవిద్య. అది సాక్షాత్తూ బ్రహ్మవిద్య. అందుకే లలితాదేవి ‘ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా’ అనే నామం ధరించింది. భుక్తిముక్తులను ప్రసాదించే లలితాదేవి చరిత్ర వినడమే ఒక ఉపాసన.