మా కురు ధనజనయవ్వన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వం
మాయామయ మిద మఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥
అని జాతిని హెచ్చరించారు జగద్గురువు ఆదిశంకరాచార్యులు. ‘ధనం, పరివా రం, యవ్వనం ఉన్నాయని గర్వించొద్దు. కాలం అనేది వీటన్నిటినీ ఒక్క క్షణం లో హరించగలదు. ఇదంతా మాయతో కూడి ఉన్నదని గ్రహించి, బ్రహ్మతత్త్వా న్ని తెలుసుకొని ప్రయాణం కొనసాగించు’ అని పై శ్లోకానికి అర్థం.
ధనంతో మదం (గర్వం) తలెత్తుతుంది. దైవం మీద ఆధారపడితే ఆధ్యాత్మికం సిద్ధిస్తుంది. ధనం మీద ఆధారపడితే ఐహికం లభిస్తుంది. ధనం గానీ, ధనంతో సొంతం చేసుకునే వస్తువులు గానీ, వాటిని అనుభవించే శరీరం గానీ అశాశ్వతా లే! ధనం అశాశ్వతమైన ఐహికం మీదికే మరలిస్తుంది కాబట్టి అది మాయ! జనార్దనుడి మీద ఆధారపడితే ఆధ్యాత్మికం. జనం మీద ఆధారపడితే ఐహికం. పరిజనం ఐహికం వైపునకే మళ్లిస్తుంది కాబట్టి అది మాయ. యవ్వనంలో కామం పడగవిప్పుతుంది. అదీ మాయే! కామారి (శివుడు)పై ఆధారపడితే ఆధ్యాత్మికం, కామం మీద ఆధారపడితే ఐహికం. కామం అశాశ్వతమైన ఐహిక మార్గంలోకి మళ్లిస్తుంది కాబట్టి అది కూడా మాయే!
ధనం మితిమీరడం వల్ల అహంకారం పేట్రేగే ప్రమాదం ఉంది. ఎవరినీ లక్ష్యపెట్టకపోవడం, ఎవరి మాటా వినిపించుకోక పోవడం వంటి లక్షణాలు కలుగుతాయి. డబ్బు యావలో లోభత్వం ఏర్పడుతుంది. అయినవారిని కూడా దూరం పెట్టడం మొదలుపెడతారు. దగ్గరివారితో కూడా మనసులో మాట పంచుకోలేని స్థితికి చేరుకుంటారు. అంతేగాక, తమను తాము గొప్పవాడిగా భ్రమపడతారు. లేని పెత్తనం కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ దుర్లక్షణాల న్నీ ధనం మూలంగా మనిషికి తెలియకుండానే వచ్చేస్తాయి. ఇదంతా రజోగుణ ప్రకోపంతో ఏర్పడేవే! ‘రజసస్తు ఫలం దుఃఖం’… రజోగుణం దుఃఖంలో ముంచివేస్తుందని పెద్దల మాట.
పరిజనం అంటే చుట్టాలు, స్నేహితులు. ‘ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వస్తారు’ అని సుమతీ శతక కారుడి మాట. ఎందుకు వస్తారంటే, ధనవంతుడితో స్నేహంగా మసలితే సంఘంలో గౌరవంతోపాటు డబ్బుతో కూడిన తమ ప్రయోజనాలు కొద్దోగొప్పో నెరవేరకపోతాయా! అనే ఆశతో వస్తారు. ధనం మీద ఆశతో మనసులో ఎలాంటి భావన ఉన్నా… పైకి మాత్రం ఎంతో ఆప్తులుగా నటిస్తారు. ఆ ధనవంతుడిని ‘నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి! నీలాంటి మేధావి లేడు’ అని తెగ పొగడుతారు. అక్కడితో ఆగరు. కొత్త వ్యాపారం చేయమని, మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నానా రకాల సలహాలూ ఇస్తుంటారు. వాళ్ల మాటలు నమ్మి, కొత్త ప్రయత్నం చేసి విఫలుడ య్యాడా కూడబెట్టుకున్న సొమ్మంతా సర్వ నాశనం అవుతుంది. ఆస్తులన్నీ పోయి బికారి అయిన రోజున అదే బంధువులు ఆ వ్యక్తి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. తమ ప్రయోజనాలు నెరవేరేంత వరకే ఆప్తులు. బంధువుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అతిగా ఊహించుకొని, వారిని దగ్గరికి రానివ్వకుండా అన్నీ ఉన్నా ఏకాకిగా మిగిలిపోయే రకం ఇంకొందరు. ఇవి పరిజనం వల్ల కలిగే బాధలు.
ఇక యవ్వనంలో లైంగిక వాంఛ పెచ్చుపెరిగి అంతకుమించిన సుఖం లేదని భావిస్తాడు మనిషి. అది భ్రమ అని గ్రహించడు. ఆ సుఖం కోసం తెగ ఆరాట పడుతూ.. అనుచిత కృత్యాలకు పాల్పడతాడు. పర్యవసానం ఏమవుతుందో ఆలోచించడు. విచ్చలవిడితనం వల్ల చిక్కుల్లో ఇరుక్కుపోతాడు. తీవ్రమైన ఎదురుదెబ్బలు తిన్నప్పుడు అదృష్టవంతుడైతే పశ్చాత్తాపం చెంది మార్గం మార్చుకుంటాడు. ఎన్ని దెబ్బలు తగిలినా మారని వ్యక్తి ఎందుకూ కొరగాకుండా పోతాడు.
మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించడం. అదే భ్రమ. అందులో మునిగితే వివేకాన్ని కోల్పోతాడు. ధన, జన, యవ్వనాలు మాయామయాలు అని చెప్పి అవివేకాన్ని తొలగించడానికి ‘వివేక చూడామణి’ని అందించాడు ఆదిశంకరులు. ‘చూడామణి’ అంటే సిగలో పెట్టుకునే ఆభరణం. దానిని నెత్తిన పెట్టుకోవాలి. అంటే బుర్రలో (వివేకాన్ని) పెట్టుకోవాలి. అప్పుడే మాయదారులు విడిచి శాశ్వత ఆనందం కలిగించే తోవలో ప్రయాణం మొదలవుతుంది.
-డాక్టర్ వెలుదండ సత్యనారాయణ , 94411 62863