సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః॥
(సౌందర్యలహరి -17)
అమ్మా! నీవు ‘శశిమణి శిలాభంగ రుచిభిః’- ముక్కలైన చంద్రకాంత శిలల వలె తెల్లని దేహకాంతి కలిగిన తల్లివి. చంద్రకాంత శిలలు వెన్నెలకాంతికి చెమ్మగిల్లుతాయి. అలాగే నిర్మలమైన తెలుపురంగులో ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు ప్రతీక. అమ్మ దేహకాంతి చంద్రకాంత శిలల ప్రకాశంలా ఉండటమే కాక, ఎక్కడా వంకబెట్టడానికి వీల్లేకుండా ఉందంటారు ఆది శంకరులు. అమ్మా! నీవు సాధకులకు వాగ్వైభవాన్ని కలిగించే వశిన్యాది వాగ్దేవతలతో స్తుతులు అందుకుంటున్నావు. పన్నెండు మంది యోగినులు, నలుగురు ఆకర్షణ దేవతలు, వాల్మీకి వ్యాస కాళిదాసాది మహాకవులూ నిరంతరం ధ్యానిస్తున్నారు. అలాంటి మార్గంలో నిన్ను ధ్యానించేవారు నీకు ఆమోదయోగ్యమైన కవిత్వాన్ని చెప్పగలుగుతారు. సవిత్రీ అంటున్నారు ఆదిశంకరులు. సవిత్రీ అంటే ప్రసవించేది, ఆవిడే తల్లి. స్రవణము అనే ధాతువు నుంచి వచ్చినది ప్రసవం. దేనిని ప్రసవింపజేస్తుందంటే చక్కని కవిత్వాన్ని.
ఆ జగజ్జనని సాధకుని స్థాయినిబట్టి వివిధమైన, ప్రత్యేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఒకే రూపం, ఒకే మార్గం అందరికీ అనుమోదం కాకపోవచ్చు. సాధకుని మనస్సు ఏ రూపానికి ఆకర్షితమవుతుందో ఆ రూపంలో అమ్మ దర్శనమవుతుంది. శ్రీచక్రార్చన ఉదాత్తమైన ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. ‘సర్వవర్ణోపశోభితా, మాతృకావర్ణ రూపిణి’ అని అమ్మను ప్రస్తుతించాయి లలితా సహస్ర నామాలు. అక్షరాలన్నిటికీ మాతృక అమ్మే. అన్నిట్లో ప్రకాశించేది ఆమె తేజస్సే. అందుకే అమ్మను సర్వవర్ణాత్మిక అంటారు.
భాషకు ఉన్న యాభై అక్షరాలను మొత్తం ఎనిమిది వర్గులుగా చెప్తారు. వాటికి అధినేతలైన వశిని మొదలైన ఎనిమిది మంది వాగ్దేవతలు అమ్మవారి అధీనంలో ఉండి నిరంతరం ఆమెను సేవిస్తుంటారు. ఈ దేవతలతో కూడి ఎవరైతే అమ్మవారిని చక్కగా ధ్యానిస్తారో (సంచింతనం) వారికి వాగ్దేవీ ముఖమనే కమలానికి ఆమోదయోగ్యమయ్యే విధంగా మృదుమధురంగా కవిత్వం చెప్పగలిగే పటుత్వం వస్తుంది. సరస్వతీదేవి.. సాధకుడిని చిరునవ్వులతో, దయాదృష్టితో అనుగ్రహిస్తుంది. తద్వారా సాధకుడు అలౌకికమైన అనుభూతిని పొందుతాడు. సరస్వతి అంటే సకల విద్యలకు, సర్వవాక్కులకు, అనంతమైన జ్ఞానానికి అధిదేవి అయిన చిద్రూపిణి. ఆ తల్లే లలితాదేవి. జ్ఞానం వల్ల హృదయంలో దివ్యమైన తేజస్సు ఆవిష్కృతమవుతుంది. శ్రేష్ఠమైన ఆ వెలుగులో అమ్మవారు అవతరిస్తుంది. ఆ వెలుగే పరంజ్యోతి.
‘వచోభిః మహతాం భంగిరుచిభిః’ అనగా… అమ్మను ధ్యానించడం ద్వారా సాధకుడు వాల్మీకి, వ్యాస, కాళిదాసు తదితర కవికుల తిలకుల కన్నా వైభవమైన వాక్కులను పొందుతాడు. అంటే అంతకన్నా గొప్ప కవిత్వం చెప్పగలుగుతాడు. అంతటి వైభవోపేతమైన కవిత్వం లభించడం వల్ల ఆ సాధకుడు ‘సః కావ్యానాం కర్తా భవతి’ చక్కని కావ్యాలను రాసి సాహితీ లోకంలో ధృవతారలా వెలుగొందుతాడు. అక్షర రూపంలో అమ్మను సేవించడం వల్ల సాధకుడు పరమోత్తమం అయిన, ఉదారవతి అయిన అమ్మ సన్నిధానంలో, ఆమె ఎల్లప్పుడూ పరమ సంతోషాన్ని అనుగ్రహిస్తుండటంతో అక్షయమైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతాడు. వర్ణ సమామ్నాయంలో ‘అ’ నుంచి ‘క్ష’ వరకు ఉండేవి అక్షరాలుగా చెప్తారు. అక్షరం అంటే క్షరం కానిది లేదా నాశనం లేనిది. అమ్మను ఆరాధించడం వల్ల కలిగే ఆనందం కూడా అక్షయమైనది.
-పాలకుర్తి ,రామ్మూర్తి