నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ముదయం యాతి జగతీ
తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్య తనయే
త్వదున్మేషాజ్జాతం జగదిద మశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః!
(సౌందర్యలహరి-55)
పర్వత రాజపుత్రికవైన ఓ పార్వతీ మాతా! నీవు కనులు మూయడం వల్ల సకల జగత్తు కూడా లయమవుతున్నది. అలాగే, నీవు కనులు తెరవడం వల్ల జగత్తు ఉత్పన్నమవుతున్నది. నీవు కనులు తెరవడం వల్ల ప్రసూతమైన ఈ జగత్తుకు ప్రళయం రాకుండా కాపాడేందుకే నీవు అనిమేషురాలవు అయ్యావు, అంటే కనులు మూయని దానవయ్యావు అంటూ, దేవతలకు సహజమైన అనిమేషత్వ లక్షణాన్ని అమ్మవారికి ఆపాదిస్తూ ఉత్ప్రేక్షగా చెప్పారు, ఆదిశంకరులు.
లలితా సహస్ర నామాలలో ‘ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః’ అనే నామం ఉన్నది. అంటే కనులు తెరిచి, మూస్తూ జగాలను ఉత్పత్తి, లయాలను కావించే తల్లి లలితా పరమేశ్వరి. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తులోని భృగువల్లిలో, వరుణుడి కుమారుడైన భృగువు తండ్రిని సమీపించి ‘భగవాన్ బ్రహ్మాన్ని గురించి తెలపండి’ అని ప్రార్థించగా, వరుణుడు ‘యతోవా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ప్రయం త్యభిసంవిశంతీతి’ అంటాడు. దేని నుంచి ప్రాణులు పుడుతున్నాయో, పుట్టిన ప్రాణులు దేనివల్ల జీవిస్తున్నాయో, తిరిగి మరణరూపంలో దేనిలో లయమవుతున్నాయో అదే బ్రహ్మం’ అంటూ వివరించాడు. తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సాక్షాత్కరించుకోవాలని చెప్తాడు. అన్నిటికి మూలమైన బ్రహ్మమే ఆది శక్తి. ఆ ఆది శక్తి నుంచే ప్రాణులు వెలుగుచూస్తున్నాయి. తిరిగి ఆ శక్తిలోనే లయమవుతున్నాయి. ఆ పుట్టుకను, లయాన్ని అమ్మవారు కనులు తెరవడం, మూయడంగా ఆదిశంకరులు సూత్రీకరించారు. భృగువు అడిగాడు. వరుణుడు చెప్పాడు. తనకు తెలిసింది కదా.. సరిపోదా అంటే సరిపోదు. ఏదైనా తెలుసుకోవడం కాదు. దాన్ని అనుభూతిగా మలచుకోవాలి. తెలుసుకోవడం జ్ఞానం. తెలిసినదాన్ని పరీక్షించి నిరూపించుకోవడం విజ్ఞత, దాన్ని ఆచరణలో పెట్టడం వివేచన. అందుకే తపస్సు ద్వారా భృగువు అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందాన్ని బ్రహ్మముగా తెలుసుకున్నాడు.
అమ్మ రెప్పపాటు ఒక బ్రహ్మకల్పంగా చెప్తారు. సంకల్ప మాత్రంతో సృష్టి, స్థితి, లయాలను కావించే మహాశక్తే ఆ లలితాపరమేశ్వరి. సృష్టికి ముందు, సృష్టి తర్వాత, సృష్టి ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాణుల్లో శక్తి రూపంలో నిలిచి సమర్థంగా జగన్నిర్మాణ సంచాలన కార్యాన్ని స్థిరమైన పద్ధతిలో నిర్వహించే జగజ్జనని లలితాపరమేశ్వరి!
లలితాదేవినే ‘పంచబ్రహ్మ స్వరూపిణి’ అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ రూపం అని స్తుతించారు! అవసరానికి అనుగుణంగా ఆయా రూపాల్లో దర్శనమిస్తుందామె. ఆ తల్లే చిన్మయి. అంటే చిదానంద స్వరూపమైన లలితాదేవి. ఆమెయే పరమానంద. పరమానందం నుంచి ఆనందాన్ని ప్రసరించే చిద్రూపిణి లలితామాత. ఆమే విశ్వరూప. విశ్వరూపమైన పరమశక్తి. సమస్త విజ్ఞానం తన స్వరూపమైన తల్లి. మూల ప్రకృతి రూపంతో శివశక్తుల కలయికతో సృష్టి చేసే సృష్టి కర్త్రి లలితా. అలాగే సంహార లక్షణాలున్న రుద్రుని రూపంలో సృష్టిని లయం చేసే తల్లి. అమ్మవారి నేత్రాలలో ఎన్నో ఆగమ రహస్యాలను ఆదిశంకరులు తెలియజేశారు. ఆగమం అంటే సంప్రదాయంగా మనకు పూర్వికులు అందించిన జ్ఞానం. ఆగమాలలో ఎన్నో విషయాలుంటాయి. ముఖ్యమైనది జ్ఞానకాండ. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం లక్షణాలుగా కలిగిన లలితాపరమేశ్వరి కన్నులు కరుణార్ద్ర భాసితాలు. ఆ దయాపూర్ణ చూపులు లహరులుగా లోకంలో ప్రవహిస్తున్నాయి. ఆ అమ్మచూపులు మనందరిపై ప్రసరించి కాపాడుగాక.
-పాలకుర్తి రామమూర్తి