జీవి తన జాతిని అనుసరించి, ప్రకృతి ఇచ్చిన కొన్ని ప్రత్యేక శక్తులతో పుడుతుంది. అయితే ఆ శక్తులు దానిలో గుప్తంగా బీజరూపంలో ఉంటాయి. వయసు వెంట, చేసే ప్రయత్నాన్ని అంటి ఆ శక్తులు వ్యక్తమవుతాయి. కాలక్రమంలో ఆ శక్తులు వికసిస్తాయి. వాటిని ఉపయోగించుకున్న తీరును బట్టి ఫలిస్తాయి. వయసుతో వచ్చే సశక్తత సహజమైనది, జీవి నియంత్రణలో లేనిది. కానీ, జీవిచేసే ప్రయత్నం మాత్రం దాని జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులతో రూపుదిద్దుకుంటుంది. మనిషి విషయంలో దానినే మనం ‘సాధన’ అంటాం. సాధన సవ్యంగా, సమున్నతంగా సాగడానికి గురు మార్గదర్శనం అత్యంత ఆవశ్యకం. దీనికితోడు సంప్రదాయ ఆచరణ సాధనకు ప్రబలమైన తోడ్పాటును అందిస్తుంది. ఎప్పుడైనా, ఎవరికైనా ఈ సాధన ఫలించే దిశలో సాగాలంటే ‘మూడు’ విషయాలు ప్రధాన అవసరాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది సాధ్యవిజ్ఞత, రెండోది సమయ బద్ధత, మూడోది కృషి నిబద్ధత.
సాధ్యవిజ్ఞత.. అంటే మనం ఎన్నుకున్న గమ్యం, దానికి అనుసరించే మార్గం స్పష్టంగా తెలిసి ఉండటం. అంతేకాదు, ఆ మార్గంలో నడవటానికి, గమ్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం మనకు ఉన్న శక్తియుక్తులకు, ఉపకరణ సంపత్తికి సాధ్యమైనదా కాదా అన్నది సరిగ్గా తెలిసి ఉండటం. ఒకవేళ మనం చేరదలచిన గమ్యం దూరమైనదైతే, ప్రస్తుత శక్తియుక్తులు, ఉపకరణాలు అనుమతించే మేరకే గమ్య దిశలో వెళ్లగలిగిన దూరాన్ని నిర్ణయించుకోవాలి. తదనుగుణంగా ప్రణాళికలు రచించుకొని మన ప్రయత్నాన్ని సాగించాలి. ఆ స్థానాన్ని చేరిన తర్వాత అప్పటి సంసిద్ధతను బట్టి తర్వాతి దూరాన్ని నిర్ణయించుకోవాలి. ఆ విధంగా అంచెలంచెలుగా గమ్యాన్ని చేరగలిగిన తెలివే సాధ్యవిజ్ఞత.
సాధనలో సమయబద్ధత అన్నది చాలా ముఖ్యమైనది. ఒకటి, ఇది ప్రణాళికను అచంచలంగా అమలుచేయడంలో తోడ్పడుతుంది. రెండు, మన సమర్థతను క్రమంగా పెంచుతుంది. మూడు, మన ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను పెంచు తుంది. నాలుగు, మనల్ని గమ్యానికి తొందరగా చేరుస్తుంది. సమయబద్ధత లేకుంటే గమ్యం కష్టసాధ్యం అవుతుంది. లభించే ఫలం నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది.కృషి నిబద్ధత తర్వాతి ముఖ్యమైన అంశం. మన తాత్కాలిక ఇష్టాలను, ఆకర్షణలను పక్కనపెట్టి, అసంబద్ధ ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించి సమయబద్ధంగా నిర్ధారించుకున్న పనిని చేయడమే ‘కృషి నిబద్ధత’. దీనివల్ల పొందే ఫలితం నాణ్యత, పరిమాణం కూడా పెరుగుతుంది. మన విశ్వసనీయత, ఆత్మగౌరవం, ఆత్మ సంతృప్తి పెరుగుతాయి.
ఈ రకమైన సాధ్యవిజ్ఞత, సమయబద్ధత, కృషి నిబద్ధతల కలయిక వైఫల్యాలకు అవకాశాలను దూరం చేస్తుంది. మన సమర్థతను, స్థాయిని, సంపదను, గౌరవాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, ప్రయోజకత్వాన్ని పెంచుతుంది. అయితే, చేసే ఏ కర్మకైనా ‘అహం’ (నేను) అనే భావన కేంద్రకమైంది. అలాగే ఏ సాధన అయినా. ఎటువంటి సాధనైనా ఆధ్యాత్మికంగా పరిణతి చెంది, పరిమళించాలంటే కర్మకు కేంద్రమైన ‘నేను’ అనే భావన ఫలాపేక్షలో, ఫలానుభవంలో ‘మేము’గా విస్తరించకూడదు. అది ‘మేము వేరు’, ‘మీరు వేరు’ అనే భేద భావంతో అసురత్వం వైపు దారితీస్తుంది. ‘నేను’ అన్నది ‘మనం’గా విస్తరించాలి. ఆ అభేద భావన దివ్యత్వం వైపు దారితీస్తుంది. ఆ దివ్యమార్గంలో చేసే ప్రయాణం క్రమంగా ఈ విశ్వంతోనే ఆత్మీయతను పొందుతుంది. అది అనన్య ఈశ్వర భావంగా పరిణమిస్తుంది. ఆ అనన్య ఈశ్వర భావనమే బ్రహ్మానుభవంగా వికసిస్తుంది. దాని పరిమళమే జీవితాన్ని జీవన్ముక్తి దిశగా నడుపుతుంది.