సంప్రదాయ పరంపరలో, సంస్కృతి పరిరక్షణలో, వేదాగమశాస్త్ర పోషణలో అనాదిగా భారతీయత ఉత్కృష్టమై.. మానవాళికి దిశానిర్దేశం చేస్తున్నది. నియమానుసారంగా బతికే విధానం.. మనుషుల నిత్యకర్తవ్యం కావాలనీ, ధర్మ బద్ధంగా కర్తవ్య సాధన చేయడం మానసిక దృక్పథం కావాలనీ పదే పదే ప్రబోధిస్తుంది. భారతీయ కాలమానంలో ప్రతి సంవత్సరానికీ, ప్రతి యుగానికీ, ప్రతి మాసానికీ, ప్రతి రోజుకీ ప్రత్యేకత, పవిత్రత ఉంది. ఆ గొప్పతనం తెలుసుకొని అవకాశాను గుణంగా ఫలితాలను పొందే ప్రయత్నమే మానవ ధర్మం.
శ్రీమహావిష్ణువు స్థితికర్తగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. సంసార సాగరానికి ఆదిదేవుడూ ఆయనే. దానిని ఈడేర్చే తెరువూ ఆయనే! కాబట్టి శ్రీమన్నారాయణుని భక్తి సాధనతో సేవించి, ఇహపరాలలో జన్మ సార్థకతను పొందగలిగే దివ్య అవకాశం కల్పిస్తుంది ‘ధనుర్మాసం’. అన్ని మాసాలలో కెల్లా మహిమాన్వితమైన ఈ మాసం తెలుగు నెలల్లో ఎక్కడా కనిపించకపోయినా.. మానవుల కర్మఫల సాధనకు ఉపయుక్తంగా ఒప్పారుతున్నది. విష్ణుమూర్తి ఆరాధనకు అనువైన కాలంగా, మధురమైన భక్తికి వేదికగా అలరారే దివ్యమాసం ఇది. ఈ నెలలో విష్ణు కైంకర్యం చేస్తే వేయి సంవత్సరాల పాటు చేసిన శుభకర్మ ఫలం లభిస్తుందనీ, అదే మధురానందమనీ, అలౌకిక భావనాభరితమనీ బ్రహ్మాండ, స్కంధ, ఆదిత్య పురాణాలు చెబుతున్నాయి. క్షీర సముద్రంలో, శేష తల్పంలో, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును ఉషఃకిరణాలు ప్రసరించని బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొలిపి, ఆరాధించి తరించే అదృష్టం ధనుర్మాసం కల్పించింది. విష్ణుదేవుడే మాసరూపమైన వైభవం… ధనుర్మాసం.
ధనుర్మాసానికి పరిపూర్ణత కలిగించిన విదుషీమణి, భక్తశిఖామణి గోదాదేవి. ప్రణయ రూపానికీ, ప్రణవ రూపానికీ బంగారు సేతువుగా నిలిచిన తిరుప్పావై పాశురాల రూపకర్త్రి ఆమె. పన్నెండుమంది ఆళ్వారుల్లో ఏకైక మహిళ. భక్తి ప్రపంచ చరిత్రలో శ్రీరామచంద్రున్ని కౌశిక మహర్షి ‘కౌసల్యా సుప్రజా రామా.. ఉత్తిష్ఠ’ అంటూ మేల్కొలిపిన సుప్రభాతం, శ్రీరంగనాయకుడిగా భావించిన శ్రీహరిని మేల్కొలిపిన తిరుప్పావై పాశుర ప్రభాతం అజరామరమై నిలిచిపోతాయి. సకల చరాచర జీవకోటిని జాగృతపరిచే దేవదేవుడినే మేల్కొలిపే అవకాశాన్ని అందిపుచ్చుకున్న భక్త సంజనిత గోదాదేవి. నందవ్రతం అనే సంసారమండలంపై ప్రేమతో అక్కడే జన్మించిన శ్రీరంగనాయక స్వరూప కృష్ణుడు.. జనులను తరింపజేసేందుకే గోదాదేవి మేల్కొలుపును అందుకున్నాడు. కలియుగంలో ప్రేమ నిండిన సుహృదయంతో చేసే హరినామ సమరణం ఒక్కటే జన్మ సార్థకం చేయగలదనే భావనామయ సృజనకు తార్కాణం గోదాదేవి. శ్రీవిల్లిపుత్తూరులోని జగన్నాథునికి నిత్య కైంకర్యం చేసే పెరియాళ్వారుల పుత్రికా శిరోమణి ఆమె.
గోదాదేవి అయోనిజ. జనకునికి సీత లభించినట్లుగానే తులసికోటలో మొక్కల కోసమని భూమిని తవ్వుతుండగా పెరియాళ్వువారికి ఓ బాలిక కనిపించిందట. ఆమెను ‘కోదై- పూలదండ’ అని పిలుచుకునేవారట. పువ్వు పుట్టగానే పరిమిళించినట్లు తులసీదళంలా పవిత్రమైన భగవచ్చింతన కలిగి ఉండేది గోదాదేవి. ఆళ్వారు తనయ ఆండాలుగా పిలుపు అందుకుంటూ గోదాదేవి శ్రీరంగనాయకునికి మనసా వాచా కర్మణా స్వీయ సమర్పణ గావించుకుంది. కోదై అంటే మాల. మాలాకారుడైన తండ్రికి తనయ కాబట్టి ‘కోదై-గోదా’ అని పిలిచేవారు. తన భక్తి పారవశ్యంతో దేవదేవుణ్నే వరించి, తరించింది. ఆమె పాశురాలలో దివ్యప్రేమ ప్రతిఫలిస్తుంది.
ధనుర్మాసానికి పరిపూర్ణత కలిగించిందే గోదాదేవి రచిత తిరుప్పావై. మనోరథం నెరవేరడానికి జగమంతా విష్ణుమయంగా భావించి ఆరాధించేదే ధనుర్మాస వ్రతం. ఈ మాసమంతా సుప్రభాతంలా వినిపించే తిరుప్పావై ఆరాధన అమోఘం. ధనుర్మాస వ్రతం అంటే తొలిమంచు కరిగిన వేళ ప్రభాత రాగంలా భగవంతునికి చేసే మేల్కొలుపు కైంకర్యం. తిరుప్పావై ధనుర్మాస వ్రతంగా, శ్రీవ్రతంగా, మార్గశిరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి దీనిని మార్గశీర్ష వ్రతమని కూడా పిలుస్తుంటారు. ‘తిరు’ అంటే గొప్పదైనదనీ, ‘పావై’ అంటే వ్రతమని అర్థం. గోదాదేవి పాడిన 30 పాశురాలు తిరుప్పావైగా పేరుగాంచాయి. ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన పాశుర ప్రభాతం- అనుభవైకవేద్యం, అలౌకికం, అవ్యాజమానం. ఆనందాలకూ- అలంకారాలకూ అనువైన భక్తి ఎక్కడ ఉంటే.. భగవంతుడు అక్కడ ఉంటాడనే నమ్మకానికి ఆలంబనగా నిలిచిందే తిరుప్పావై.

గోదాదేవి ప్రణీత తిరుప్పావై ప్రబోధం భక్తి తత్వాన్నీ, భగవంతుని నిజత్వాన్నీ తెలుపుతూ ‘నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు, గౌరవించుకున్నట్లు, ఆరాధించుకున్నట్లు గానే సకల చరాచర జీవకోటినీ ఆదరించు.. సమస్త జీవరాశిలో జీవాత్మలా ఉండే పరమాత్మని గుర్తించు.. తరించు’ అంటూ నిర్దేశించింది. ఉషఃకాల ఉదయం… జన జీవితాలను జాగృతం చేస్తుంది. ‘కర్తవ్యం దైవమాహ్నికం’ అంటూ ఉద్బోధ చేస్తుంది తిరుప్పావై. ఆ దివ్య ప్రభాతం భగవంతుని ప్రసాదంగా లభించిన జీవితాన్ని సార్థకం చేసుకునే సువర్ణావకాశంగా దీవించింది తిరుప్పావై. ప్రపంచమంతా దుఃఖమయమనే నిరాశను ఛేదించే సంతోష సంజీవని ఇది. జీవిత విధానంలోనూ, వ్యక్తిత్వ నిర్మాణంలోనూ ఆనందం పొందుపరిచి ఉందనే శాశ్వత సత్య సందేశం తిరుప్పావై.
అందరూ మంచివారై ఉండాలి, మంచివారంతా బాగుండాలనేది విశ్వజనీన సూత్రం. ప్రకృతిపరంగా సాగే జీవితాలు విశ్వచైతన్య ప్రదీపాలై దినదినం వృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రకృతిని రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది. ప్రాణికోటి సురక్షితంగా ఉంటూ, ఆయురారోగ్యాలతో జీవించాలనే సార్వజనీన ప్రార్థన చేస్తుంది తిరుప్పావై. భగవంతుడు సర్వ వ్యాపకుడు. అనేక రూపాలలో, వేవేల నామాలతో భక్త సులభుడై అలరారుతాడు. అలాంటి దేవుణ్ని మనసా వాచా కర్మణా కొలిచి తరించాలనీ, మునుల తపఃఫలం, సృష్టి మూలం-గమనం… భగవన్నామ స్మరణమేనని తెలియపరుస్తుంది తిరుప్పావై.
జీవితంలో స్తబ్ధత నెలకొన్నప్పుడు గత వైభవాన్నీ, గడిచిన మంచి రోజులనూ, భగవంతుని దయ వల్ల గట్టెక్కిన సందర్భాలనూ తలచుకొని అన్నింటిలోనూ దేవుడున్నాడనే ఆత్మ పొందాలనే ప్రోత్సాహం ఇచ్చేదే తిరుప్పావై. సకల చరాచర ప్రపంచాన్ని మేల్కొలిపే భగవంతుడు ఆర్తితో పిలిచే భక్తుల పలుకు కోసం ఎదురుచూస్తాడు. ప్రేమగా పిలిస్తే ఉలిక్కిపడి మేల్కొని తక్షణ రక్షణనిస్తాడు. సదా తోడుంటాడు. భగవంతుడిని నోరారా ‘పలుకే బంగారమాయెనా’ అని ప్రశ్నించే భావగాంభీర్యం కేవలం భక్త హృదయానికి చెందిన సాధికారత అని నిరూపిస్తుంది తిరుప్పావై.
భగవంతుడికి భక్తులంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. ఆశ్రిత వ్యామోహం గలవాడనే నిందను లోకంలో ఆనందంగా అనుభవిస్తాడు. అంతర్యామిగా ఉన్న తనని తెలుసుకోవాలని తాపత్రయపడే విభుడే దేవుడంటూ.. పాశురాలలో దేవుణ్ని స్తుతించింది గోదాదేవి. జీవాత్మ-పరమాత్మల సంబంధం అనిర్వచనీయం. గోదా ప్రణీత పాశుర ప్రభాతంతో మేల్కొని శ్రీమహావిష్ణువు ధనుర్మాసమంతా భక్తుల హృదయ సామ్రాజ్యాలను ఏలుకొనే ప్రభాభాసుడు. సర్వత్రా, సర్వదా ఆనందాన్ని ప్రసాదించే పుండరీకాక్షునికి భక్తిరసభావ నీరాజనం తిరుప్పావై అనడంలో సందేహం లేదు.