Maha Shivratri | హిందువులకు ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ప్రతినెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి వస్తుండగా.. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, వేయి స్తంభాల గుడి, కొమురవెల్లి మల్లన్న ఆలయం ఇలా ప్రముఖ ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణలతో పాటు విశేష పూజలు, అభిషేకాలు చేస్తారు. శివరాత్రి సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ ఆలయాల గురించి ఓ సారి తెలుసుకుందాం..!
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం..
ఈ ప్రముఖ శైవక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉన్నది. పరమేశ్వరుడు ఇక్కడ రాజరాజేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. హైదరాబాద్‌కు దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంద్రుడి బ్రహ్మహత్య పాపాన్ని నివారించిన క్షేత్రంగా పురాణాల్లో ఉన్నది. ఆలయంలో శివరాత్రి వేడుకలు మూడురోజుల పాటు జరుగుతాయి. వేడుకలకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఇక్కడే శివనామస్మరణలు చేస్తూ జాగరణ చేస్తారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం..
మల్లికార్జున స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉన్నది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. దాదాపు 500 సంవత్సరాల కిందట ఇక్కడ మహేశ్వరుడు మల్లన్నగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ సంక్రాంతికి జరిగే పట్నాల వేడుకలను చూసేందుకు రెండు కండ్లు సరిపోవు. సంక్రాంతికి ముందు మల్లికార్జున స్వామి కల్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జాతర ఉంటుంది.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తుంటారు.
రామప్ప.. రామలింగేశ్వరస్వామి
రామలింగేశ్వరస్వామి ఆలయంలో ములుగు జిల్లా పాలంపేటలో ఉన్నది. వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. ఇక్కడ శివుడు రామలింగేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. స్వామివారిని రుద్రేశ్వరుడిగాను పూజలందుకుంటాడు. అద్భుతమైన శిల్పకళా సంపదకు రామప్ప ఆలయం నిలయం. ఈ ఆలయ నిర్మాణం వరంగల్‌లోని ప్రసిద్ధ ఘనపూర్ దేవాలయాలన్ని పోలి ఉంటుంది. ఒక్కసారైనా ఆలయాన్ని ప్రతీ ఒక్కరూ దర్శించాల్సిందే. రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది.
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం..
ఈ క్షేత్రం జయశంకర్భూపాలపల్లిలో ఉన్నది. తెలంగాణవ్యాప్తంగా ఆలయం అందరికీ తెలిసిందే. ఈ క్షేత్రంలోనే యముడికి పరమశివుడు దర్శనమిచ్చాడు. అందుకే ఇక్కడ శివుడు కాళేశ్వరుడిగా, ముక్తేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ రెండు శివలింగాలు కనిపిస్తాయి. మొదట కాళేశ్వరుడిని దర్శించుకున్నాకే.. ముక్తేశ్వరుడిని దర్శిచుకుంటారు. లింగాలకు రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటిలో నీళ్లు పోస్తే ఒక ధార వెళ్లి గోదావరి నదిలో.. మరొకధార ప్రాణహిత సంగమంలో కలుస్తాయని భక్తుల విశ్వాసం.
వేయిస్తంభాల గుడి.. హన్మకొండ
వేయిస్తంభాల ఆలయం హన్మకొండలో ఉన్నది. యావత్దేశంలోనే ప్రసిద్ధి. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. ఈ ఆలయం త్రికూటాత్మకంగా ఉంటుంది. ఇందులో శివుడు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు కొలువై ఉన్నారు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు లింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం నల్లరాతితో మలచబడి.. కల్యాణ మండపం, ప్రధాన ఆలయాలకు మధ్య ఠీవీగా దర్శనమిస్తుంది.
కీసరలో రామలింగేశ్వరుడిగా..
రామలింగేశ్వర స్వామి హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో కీసరలో ఉంటుంది. ఇక్కడ రాముడు పూజ చేసేందుకు ఓ లింగాన్ని వారణాసి నుంచి తీసుకురావాలని హనుమంతుడికి చెబుతాడు. అక్కడికి వెళ్లిన ఆంజనేయుడు అక్కడ 101 లింగాలను చూస్తాడు. ఏది తీసుకురావాలో తెలియక అన్నింటిని తీసుకువస్తాడు. అప్పటికే ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగాన్ని ప్రసాదించినట్లుగా స్థలపురాణం. తాను తెచ్చిన లింగాలకు పూజించలేదనే అలకతో వాయుపుత్రుడు లింగాలనే విసిరేస్తాడని.. అందుకే కీసరలో ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయని చెబుతుంటారు.
ఛాయా సోమేశ్వర ఆలయం..
ఈ ఆలయం నల్లగొండ జిల్లా కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పానగల్లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉన్నది. శాస్త్రవేత్తలకు సైతం ఈ ఆలయం సవాల్విసురుతున్నది. ఈ ఆలయంలోని శివలింగంపై నిత్యం నీడ ఉండడం ప్రత్యేకత. గర్భాలయంలో ఉన్న శివలింగం వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే.. సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ పడడం ఇక్కడ విశేషం. ఆ సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం ఉంటుంది. నవరత్నాల్లో ఒకటైన పచ్చరాయితో ఈ లింగాన్ని మలిచారు. కాకతీయ సామంతరాజుల కాలంలో ఈ ఆలయాలను తీర్చిదిద్దారు.
ఐనవోలు మల్లన్న క్షేత్రం..
ఐనవోలు మల్లికార్జున క్షేత్రం వరంగల్జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రాన్ని ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీస్తుశకం 1076లో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతున్నది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు.. లింగరూపంలో కాకుండా భీకరంగా విగ్రహరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ వార్షిక ఉత్సవాలు ప్రతియేటా శివరాత్రి సందర్భంగా జరుగుతాయి. పాంచాహ్నిక దీక్షతో.. ఐదురోజుల పాటు అయిదు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. రోజుకో వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహర్తిన్నారు. ప్రతీ మాసశివరాత్రిరోజున మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, శాంతికల్యాణం, రుద్రహోమం నిర్వహిస్తారు.
జడల రామలింగేశ్వరస్వామి..
ఈ ఆలయం నార్కట్మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెర్వుగట్టులో ఉన్నది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి పశ్చిమాన కొండపై జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. శివలింగంపై జడల మాదిరిగా రేఖలు కనిపిస్తాయి. దాంతో ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం వలన, కొండ దిగువున పార్వతీదేవి కొలువైవున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తుంటారు. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్టించాడనీ, ఆయన ప్రతిష్టించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థలపురాణం. ఏటా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.