శరన్నవరాత్రుల్లో అమ్మవారు నేడు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. లలిత అంటే లావణ్యం అని, త్రిపుర సుందరి అంటే ఆనందం కలిగించేది అని అర్థం. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు. ఈ త్రిపురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగించి, అమ్మ తన సౌందర్యాన్ని నింపి త్రిపురసుందరీ దేవిగా విలసిల్లుతుంది. లలితాదేవి నెలవంకను కిరీటంగా ధరించి, పైరెండు చేతుల్లో పాశం, అంకుశం, కింది రెండు చేతుల్లో చరక బిందు, అలాగే ఐదు పూల బాణాలు ధరించి ఉంటుంది.
లోక కల్యాణం కోసం దేవతల కోరిక మేరకు, చిదగ్ని కుండం నుంచి లలితాదేవి ఉద్భవించింది. ఆమె ఆవిర్భవించడానికి ముందు ఒక దివ్య తేజస్సు దర్శనమిచ్చింది. ఆ తర్వాత కరచరణాది అవయవాలతో లలితాదేవి సాక్షాత్కరించగానే వేయి సూర్యుల ప్రకాశం ఆ ప్రాంతమంతా ఆవరించిందట. అమ్మవారి స్వరూప, స్వభావాలు అనన్య సామాన్యం. ఆమె సౌందర్యం లోకోత్తరమైనది. వశిని, కాళిని, జయిని, మోదిని, అరుణ, విమల, సర్వేశ్వరి, కామేశ్వరి అనే పేర్లు కలిగిన వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి సన్నిధానంలో ఉండి ఆమెను అర్చిస్తూ ఉంటారు.
‘ల కార రూపా లలితా! లక్ష్మీవాణీ నిసేవితా!’- అంటే లక్ష్మీ, సరస్వతులు సేవించే లలితాదేవిని ఈ నవరాత్రుల్లో వివిధ ఉపచారాలతో అర్చిస్తారు. వివిధ స్తోత్రాలతో, సహస్ర నామాలతో స్తుతిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నివేదిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తుల హృదయాల్లోని అజ్ఞాన తిమిరాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతుంది.
– వేదార్థం మధుసూదనశర్మ