శుకయోగి పరీక్షిత్తుతో.. రాజా! యాదవులందరూ ద్వారకలో ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో… హింసకు మారుపేరైన కంసుడు దేవకీదేవి కన్న ఆరుగురు బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. వారినందరినీ ఒకసారి చూడగోరి దేవికి, హలధారి మురారుల (రామకృష్ణుల) వద్దకు చేరి పరితాపంతో కన్నీరు కారుస్తూ.. ‘మహానుభావులారా! నా శోకాన్ని నివారించండి’ అని కోరింది. అవతార పురుషులు రామకృష్ణులు తనకు తనయులై తన కళ్లముందు మనుచుండగా, దేవకి, తమ ప్రారబ్ధం వలన పుట్టి గిట్టిన తన పట్టీ- బిడ్డలను మళ్లా చూడ కోరిందంటే మాయా మోహ మహిమ ఎంత ఊహాతీతమో గ్రహించాలి. వెంటనే వసుదేవ సుతులు తమ తల్లి వెతను- దుఃఖాన్ని తొలగించడానికి తమ మాయా ప్రభావంతో సుతల లోకానికి వెళ్లారు. బలి చక్రవర్తికి హలి, మురళీధరులు ఎంత కలిమి- ఐశ్వర్యం, బలిమి- విక్రమంతో దర్శనమిచ్చారో నిదర్శనం చూడండి..
మ॥ ‘కనియెన్ దానవుడింద్రసేనుడు దళత్కంజాక్షులన్ దక్షులన్
ఘనసారాంబుదవర్ణులన్ నిఖిల లోకైక ప్రభాపూర్ణులన్
దనరారన్ హల చక్రప్రాణులను భక్త త్రాణులన్ నిత్య శో
భన వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్’
‘సుతల లోకనివాసి, అతులనీయ (సాటిలేని) దాతయైన బలి చక్రవర్తి, వికసించిన కమలాల వంటి కన్నులుగల వారిని, స్వపక్షులను- భక్తులను రక్షించే దక్షత గలవారిని, లోకమంతా వ్యాపించిన ఆలోకం- తేజస్సుగల వారిని, ఘనసారం- కర్పూరం వంటి ఆకారం గల హలధరుడు బలరాముని, నీలమేఘ శ్యాముడైన శ్రీధరుని తిలకించాడు. క్షణక్షణం అంతకంతకూ నూతనత్వం సంతరించుకొనే నిత్య సౌందర్యవంతులు, విజ్ఞాన జ్యోతితో విరాజిల్లువారు, ఎన్నో ఘన విజయాలకు పెన్నిధులూ ఐన రామకృష్ణులకు ఎదురొచ్చి, స్వాగతం పలికి బలి, వారి మృదు చరణారవిందాలకు వందనం చేశాడు. పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకొన్నాడు’. సాహితీ ప్రియంభావుక చిత్తాలను ఉత్తేజపరచే, వినసొంపైన అనుప్రాస ధ్వనులతో ఇంపెసలారే (శోభించే)పై మత్తేభ వృత్తం పోతన గారి సొంతం!
సోదరులను ఇంకా అనేక విధాల ఆదరించి బలి, అచ్యుతుని అంఘ్రిపద్మాలను ఒత్తుతూ, ఆనంద బాష్పాలు స్రవిస్తుండగా, మేను పులకించగా, అంజలి గావించి, వనమాలి (కృష్ణ) రూపమున ఉన్న వామనుని సంస్కృత చతుర్థ్యంత నామాలతో ఇలా అద్భుతంగా వినుతించాడు..
ఉ॥ ధీయుతుడై ‘నమో భగవతే హరయే పరమాత్మనే ముకుం
దాయ సమస్త భక్త వరదాయ నమః పురుషోత్తమాయ కృ
ష్ణాయ మునీంద్ర వంద్య చరణాయ సురారి హరాయ సాంఖ్యయో
గాయ వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే’
‘షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన ఓ కృష్ణా! అజ్ఞానహరణా! పరమాత్మా! ముక్తి ప్రదాయకా! భక్త వరదా! పురుషోత్తమా! మునీంద్రులు వందించు అనింద్య- నిర్మల చరణారవిందా! నిశాచర (రాక్షస) వినాశకరా! సాంఖ్య (శుద్ధాత్మ తత్త విజ్ఞాన) యోగ స్వరూపా! నల్లని ఉంగరాల ముంగురులచే ఉల్లసిల్లు- శోభించు ముఖం కలవాడా! జగన్నిర్మాణ దక్షా! చక్రధరా! నీకు నమోవాకాలు!’ విశ్రుతమైన పై వృత్తం కూడా పోతన చిత్త జనితమే! బలి.. ఓ చిన్మయ రూపా! నీ పాద పద్మాలను ఎల్లవేళలా ధ్యానించడం వల్లనే వేదవేద్యుడవైన నిన్ను ఖేదరహితంగా- శ్రమలేకుండా చేరుకోగలరు కాని, శాస్ర్తాలను వల్లె వేయడం వల్ల మాత్రం కాదు.
మ.కో॥ ‘కంటి గంటి భవాబ్ధి దాటగ గంటి ముక్తి నిధానముం
గంటినీ కరుణావలోకము గంటి బాపము వీడ ము
క్కంటి తామర చూలియుం బొడగాన నట్టి మహాత్మ! నా
యింటికిం జనుదెంచి తీశ్వర! యే గృతార్థత బొందితిన్’
‘ఓ కంసారీ! నీ దయతోనే నేను సంసార సాగరాన్ని తరించగలిగాను. ముక్తినిధిని వరించ- సాధించ గలిగాను. అశరణ శరణ్యా! వరేణ్యా! నీ కారుణ్య దృష్టికి పాత్రుణ్నయ్యాను. నా ఆపసోపాలు (బాధలు), పాప తాపాలు రూపుమాసి పోయాయి. ఓ తామరకంటీ- పద్మాక్షా! ముక్కంటి (శివుడు), పరమేష్ఠి (బ్రహ్మ) వంటి బృందారకులు సైతం కనలేనట్టి నిన్ను, తాపస మందారా! ఈశ్వరా! నీవు స్వయంగా నా ఇంటికి విచ్చేయగా నేను కనుగొంటినిగా! మహాత్మా! నేను మంటిని- కడతేరితిని!’ ‘లలిత రసాల పల్లవఖాదియై చొక్కు’ ‘మత్తకోకిల’ ఆలపించిన ఈ మురిపాల మధుర గీతం కూడా పోతన స్వీయం (సొంతం), ఆత్మీయం.

బలి వెన్నునితో ఇంకా ఇలా విన్నవించాడు.. ‘దేవా! నేను నీ దాసుణ్ని. ఏమి చెయ్యమంటావో చెప్పు’. దామోదరుడు సంతసించి దానవేంద్రునితో ఇలా పలికాడు.. ‘దైత్యేంద్రా! పూర్వం ఆదియుగంలో మరీచి మహర్షికి భార్యయైన ‘వర్ష’కు ఆరుగురు పుత్రులు కలిగారు. ఒకనాడు చతురాననుడు బ్రహ్మ దేవుడు రిమ్మ తెగులు- అతి మోహంతో తన కన్నకూతురినే కామించి రతి క్రియకు సన్నద్ధుడవటం చూచి వారు అతనిని పరిహసించారు. విరించి ఆగ్రహించి వారిని అసురులుగా జన్మించండని శపించాడు. శాప కారణంగా వారు కనక (హిరణ్య) కశిపునికి కుమారులుగా పుట్టారు. తరువాత దేవతల హితం కోరి యోగమాయ వారిని దేవకీ దేవి గర్భగత అర్భకులుగా ఆవిర్భవింపజేసింది. దేవకి వారిని కనగానే నృశంసుడైన కంసుడు వారిని కడతేర్చాడు. ఇంత తడవు (కాలం) తర్వాత మా తల్లి గర్భశోకంతో తల్లడిల్లుతూ ఆ అర్భకులను- పిల్లలను చూడాలని కోరింది. అనఘా- నిష్పాపా! నీ వద్ద ఆనందంగా ఉన్న వీరే ఆమె పుత్త్రులు, నా అన్నలు. వీరిని తోడ్కొనిపోయి మా తల్లి సంతాపాన్ని, వీరి శాపాన్ని కూడా పోగొడతాము’- అని బలి అనుమతితో వారిని తెచ్చి దేవకికి చూపారు. మోహజనిత పుత్త్ర స్నేహంతో ఆమె కన్నుల్లో ఆనందాశ్రువులు తన్నుకురాగా, చన్నులు చేపగా క్రన్నన- వేగంగా ఆమె ఆ చిన్నారులను ఒడిలోకి తీసుకొని ప్రేమతో వారికి చన్నిచ్చింది. వారు కూడా వెన్నుని- వైష్ణవ మాయా మోహితులై స్తన్యం తాగారు. బాలకృష్ణుడు లీలగా తాగిన ఆ తల్లి పాల శేషం మహాప్రసాదంగా ప్రాప్తించడం చేతను, భగవత్ స్పర్శ వలననూ బ్రహ్మ శాపం తొలగి స్వస్వరూపాలతో వారు తమ స్థానాలు చేరుకున్నారు. శుకుడు- రాజా! చచ్చిన బాలురను మరల తెచ్చి చూపించుట చిత్రమని దేవకి అచ్చెరువొంది- ఆశ్చర్యపడి, ‘ఇదంతా అచ్చమైన హరిమాయా ప్రభావమే’ అని భావించింది.
వ్యాసనందనుడు మరల ఆనందంగా ఇలా అందుకొన్నాడు.. పరీక్షిన్మహారాజా! ఆద్యుడు, అనంతుడు, అభవుడు, వేద వేద్యుడు ఐన సర్వేశ్వరుడు శ్రీహరి ద్వారకలో సర్వ వర్ణాల వారికి సకల ధన కనక వస్తు వాహనాదులను సమకూరుస్తూ, సంపన్నులను గావించి సంరక్షిస్తూ, దుర్జనులను దునుమాడుతూ ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రజలను ప్రేమతో పరిపాలిస్తూ దైత్య మర్దనుడు మురారి ద్వారకలో శుభసంతోషాలతో తేజరిల్లాడు. సకల జనులు మెచ్చుకొనేలా హెచ్చిన శ్రద్ధాసక్తులతో సర్వజ్ఞుడు స్వయంగా, శాస్ర్తోక్తంగా పలు యజ్ఞాలు నిర్వహించాడు. కర్త, భోక్తలు- రెండూ తానే కావడమే ఇందలి మెండైన విశేషం.
శ్రీకృష్ణుడు అర్ణవ పరివృత- సాగరంతో చుట్టబడిన, సువర్ణ ద్వారకను సురేంద్ర వైభవంతో ఏలాడు. నందనందనుడు పదహారువేలవంద సుందరీమణులతో ఆనందంగా విహరించాడు. భామినులందరికీ అన్ని రూపాల్లో కనువిందుగా సౌదామనీ లతల- మెరుపు తీగలతో కూడిన, నీలమేఘ బృందంలా విరాజిల్లాడు. వారితో జలక్రీడాది పలు కేళీ వినోదాలలో తేలియాడాడు. అంతఃపురంలో వేణువీణాది మధురగానాలు వింటూ, నటీనటుల నాట్యాలు తిలకిస్తూ, కవిగాయక వంది మాగధుల కీర్తనలు ఆలకిస్తూ, ఆనంద రస ప్రవాహంలో ఓలలాడాడు ఆ ఆలకాపరి- గోపాలుడు. షోడశ సహస్ర కాంతలు తమ ఉల్లము- మనస్సులలో నల్లదేవర పాదపద్మాలు ధ్యానిస్తూ, ఆయనతో సరస సల్లాపాలు సాగిస్తూ, శ్రీకాంతుని దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ, పరవశిస్తూ ఇతరమైన ధ్యాస లేకుండా ఉండేవారు..
మ॥ ‘హరి నామాంకితమైన గీత మొకమాటాలించి మూఢాత్ములున్
విరతింబొందగ జాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచున్
పరిరంభించుచు, నంటుచున్, నగుచు సంభాషించుచున్నుండు సుం
దరు లానందనిమగ్న లౌటకిట జోద్యంబేమి? భూవల్లభా!’
మునీంద్రుడు శుకుడు.. ‘నరేంద్రా! మూఢాత్ములైనా ఒకపరి కరివరదుడు శ్రీహరి వరనామ కీర్తనం వింటే విరతి- ముక్తి పొందుతారే! అట్టితరి, ఆ మహనీయుని, మార (మన్మథ) జనకుని, మురళీ మనోహరుని ఓర కంటితో చూస్తూ, అతణ్ని కౌగిలిస్తూ, నిమురుచూ- అంటుచూ, దరహాసాలతో, పరస్పర సల్లాపాలతో వినోదిస్తూ ఉండే ఆ సుందరులు ఆనంద పరవశలు కావడంలో ఆశ్చర్యం ఏముంది?’ అని పలికి వైయాసకి శుకుడు ఇంకా ఇలా అన్నాడు…
ఉ॥ ‘వారక కృష్ణుడిప్పగిది వైదిక వృత్తి గృహస్థ ధర్మ మే
పారగ బూని ధర్మమును నర్థము గామమునందు జూపుచుం
గోరిక మీద సజ్జనులకుం గతి దానయనంగ నొప్పి సం
సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోక విడంబనార్థమై’
పరీక్షిన్మహారాజా! నిజానికి సంసారవైరి ఐన కంసారి రుక్మిణీ జాని కృష్ణుడు వైదిక మార్గానుసారియై గృహస్థ ధర్మాన్ని స్వీకరించి, వారక- ఏమారక ధర్మార్థ కామాలను సాధిస్తూ, సత్పురుషులకు దన్నుగా, కన్నుగా- అండగా, ఆసరాగా నిలిచాడు. లోకంలో తన్ను అనుసరించడానికి మురారి కోరికోరి తానూ ఒక సంసారిలా అభినయించాడు. అమోఘగతి- సర్వశక్తిమంతుడు, సత్య సంకల్పుడు ఐన మాయాపతి మాధవునికి, సతులలో ఒక్కొక్కరికి పదిమంది పుత్త్రులు కలిగారు. రుక్మిణ్యాది అంతఃపుర కాంతలకు ప్రద్యుమ్నుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధుడు, మిత్రవిందుడు ఇత్యాదులు పుట్టి ప్రసిద్ధులయ్యారు. త్రివక్ర (కుబ్జ) అను అతివ-స్త్రీకి అజ్జాక్షుని వలన కలిగిన ‘ఉపశ్లోకుడు’ పరమ కృష్ణభక్తుడై నారదునికి శిష్యరికం చేశాడు. స్త్రీ శూద్రులకు, దాస జనానికి ‘వైకుంఠవాస’- ముక్తి మార్గాన్ని బోధించే సాత్వత తంత్రమనే వైష్ణవ స్మృతి గ్రంథాన్ని రచించాడు.
ఈ విధంగా అచ్యుత భగవానుని తనయులు అసంఖ్యాకులై, బహుసంతాన వంతులై, ఆయురారోగ్యాలతో, అతి బలవంతులై, మతిమంతులై వినుతికెక్కారు. వారందరినీ లెక్కించడానికి పదివేల సంవత్సరాలైనా చాలవు. ఉత్తరా నందనా! వారికి చదువు చెప్పే గురువులే మూడుకోట్ల ఎనభై వేల వంద మంది. ఆచార్యులే అంతమందైతే అంతేవాసుల- శిష్యుల సంఖ్య, శ్రీకృష్ణుని సంతతి ఇంత అని లెక్కించి చెప్పడం ఎవరికి సాధ్యం? నరవరా! సుర అసుర సమరమున మరణించిన అమర విరోధులు- రాక్షసులందరూ ద్వాపరయుగంలో భూవరులు- రాజులుగా పుట్టి ప్రజలను పరిపరి విధాల బాధలకు గురి చేశారు. వారిని సంహరించడానికి శౌరి నిర్జరు- దేవతలను యదుకులంలో జన్మించేలా చేశాడు. అందువలన, యాదవులు ఈ ధర- భూమి మీద నూటొక్క కులాలుగా పరగారు- ప్రసిద్ధమయ్యారు. వారిని లెక్కించడం తాతవేల్పు- ధాత (బ్రహ్మ)కు కూడా చేతకాదు.
అట్టి పవిత్ర వంశంలో వాసుదేవునికి వైదర్భి- రుక్మిణి వలన ప్రద్యుమ్నుడు- మన్మథుడు పుట్టాడు. అతని సతి రుక్మి కూతురు శుభాంగి. ఆ దంపతులకు అనిరుద్ధుడు జనియించాడు. అతనికి రుక్మి మనుమరాలగు రుక్మలోచన యందు వజ్రనాభుడు ఉదయించాడు. మౌసల- రోకలి సమరంలో యాదవులంతా అమరులవగా ‘వజ్రుడు’ మాత్రం శేషించి వంశకరుడయ్యాడు. తరువాత మథురా మండలానికి అధిపతి అయ్యాడు. ఇలా యదు, వృష్ణి, భోజ, అంధక వంశాలు పరమాత్మ అవతారం వలన పరమ పవిత్రాలు, భవలతా లవిత్రాలు- సంసార బంధాలను ఖండించే కొడవళ్లూ, ఆనందరస పరవళ్లూ అయ్యాయి.
మ॥ ‘మతి నెవ్వాని యమంగళఘ్నమగు నామం బర్థి జింతించినన్
నుతిగావించిన విన్న మానవులు ధన్యుల్; భూరి సంసార దు
ష్కృతులం ద్రోతురు కాలచక్ర మహిమాస్ర్తుండట్టి యా కృష్ణు డీ
క్షితి భారం బుడుగంగ జేయుటిది యే చిత్రంబు భూ వల్లభా!
శుకుడు- భూపతీ (రాజా)! సకల అశుభ సంతతి- పరంపరను తొలగించే అతి మంగళప్రదమైన శ్రీకృష్ణ నామాన్ని సద్గతి కోరి మతిలో సతతమూ స్మరించువారు, సన్నుతి- చక్కగా స్తుతి గావించు వారు, శ్రుతు- చెవులప్పగించి వినువారు ధన్యాత్ములు. వారు దుర్భరమైన భవ- సంసార పాప తాపాల నుండి ఆపాతతః- తత్ క్షణమే ముక్తులౌతారు. కాలాన్నే అలా చక్రాయుధంగా ధరించిన త్రివిక్రముడు ఇలా (భూ) భారాన్ని అలవోక- విలాసంగా తొలగించడంలో విడ్డూరమేముంది? ఇలా గోపబాలల పాలిటి రతిపతి- మన్మథుడైన మాధవుడు కృష్ణుడు లీలా మానుష విగ్రహుడై తన రాజధాని యైన ద్వారకలో మితిలేని దివ్య వైభవాలతో విరాజిల్లు అతిలోక సుఖాలు అనుభవిస్తూ ఉండె.