ఒక భార్యాభర్తల జంట రాములవారి గుడికి వెళ్లారు. వారికి పట్టణంలో చిన్న హోటల్ ఉంది. గుడిలోని కోదండరాముడిని, సీత, లక్ష్మణులను, ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నారు. బయటికి వస్తూ ఉంటే, గుడి పూజారి ఇద్దరికీ దొన్నెల్లో వేడివేడి పులిహోర ప్రసాదంగా ఇచ్చారు. ఇద్దరూ గుడి పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని ప్రసాదం తినడం ప్రారంభించారు.
ఆ పులిహోర ఎంతో రుచిగానూ, మృదువుగానూ ఉంది. పులిహోర నిదానంగా తింటూ రుచి ఆస్వాదిస్తున్నాడు భర్త. పక్కనే ఉన్న భార్య ఆశ్చర్యంగా ‘అంత రుచిగా ఉందా?’ అని అడిగింది. ‘అవును, చాలా బాగుంది’ అని చెప్పి ‘ఇదే రుచి రావాలని మన వంట వాళ్లకు చెప్పాను. మేలు రకమైన బియ్యం, పసుపు పొడి, వేరుశనగ పప్పు, కరివేపాకు, నెయ్యి, చింతపండు లాంటి పదార్థాలన్నీ తెచ్చి పులిహోర చేయించాను.
అయితే గుడిలో ఇచ్చే పులిహోర రుచి దానికి రాలేదు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ప్రయత్నించాం. ఎన్నో రుచికరమైన వంటలు చేసే వంటగాళ్లు కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు’ అని నిర్లిప్తంగా చెప్పాడు. దానికి ఆమె చిన్నగా నవ్వి ‘వంటవాళ్లు ఉదరపోషణ కోసం ఆ వృత్తి చేస్తారు. గుడిలోని వారు భక్తి, శ్రద్ధలతో చేస్తారు. అంతేకాదు, వారు నిష్టగా ఉపవాసం ఉండి పూజ చేసి మనసు పెట్టి వంట ప్రారంభిస్తారు. వేసే పదార్థాలు అవే అయినా అందుకే తేడా వస్తుంది. వంట సమయంలో గుడిలో వినిపించే వేద మంత్రాలు, దైవ నామస్మరణ వల్ల కూడా పులిహోరకు శక్తి వస్తుంది. ఆ శక్తి వల్లనే అది అంత రుచిగా ఉంటుంది. మనకు సులభంగా అరిగిపోతుంది కూడా’ అని వివరించింది. ‘నిజమే, వంట చేసే ప్రదేశం, వంట చేసేవారి మానసిక స్థితి, భక్తి శ్రద్ధల వల్ల కూడా రుచి పెరుగుతుంది’ అని గ్రహించాడు భర్త. ఇద్దరూ రామనామ స్మరణ చేస్తూ అక్కడినుంచి కదిలారు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు93936 62821