వరుస వ్రతాలు.. పెద్ద పెద్ద పండుగలు.. నవరాత్రులు.. ఇలా కోలాహలంగా సాగిపోయే కాలం వచ్చేస్తున్నది. ప్రతి నెలలోనూ పండుగలతో నిండి ఉన్న దక్షిణాయనం ఆగమిస్తున్నది. ఈ ఆరు మాసాల సమయం.. ఎన్నెన్నో పర్వాలు పలకరిస్తాయి. వీటి ఆంతర్యం గ్రహిస్తే మన ఆరోగ్య సాధనే అసలు రహస్యంగా కనిపిస్తుంది.
కాలం పవిత్రమైనది. ప్రతి ఘడియా విలువైనదే! ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండటానికి, కాల జాలాన్ని అర్థం చేసుకోవడానికి మన రుషులు ఎంతో శోధించారు. కాలానుగుణంగా అయనాలుగా విభజించారు. ఉత్తరాయణం ముక్తికి సోపానమైతే.. ఆ మార్గానికి దారిచూపే విలక్షణాయనం దక్షిణాయనం. దక్షిణాయనంలో సౌరశక్తి మందగిస్తుంది. ఈ ఆరు మాసాల్లో వచ్చే వర్ష, శరత్, హేమంత రుతువులు మనిషి ఆరోగ్యానికి పరీక్ష పెడుతుంటాయి. వర్ష రుతువు వానలతో ముంచెత్తితే, శరత్ రుతువు దినకరుడి ప్రభను సన్నగిల్లేలా చేస్తుంది. హేమంతం చలితో దాడి చేస్తుంది. ఇలా ప్రకృతి సహకారం తగ్గిన వేళ.. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. అలా జరగకుండా ఉండాలనే దక్షిణాయనంలో వ్రతాలు, నోములు, పండుగలు, నవరాత్రులు అంటూ ఆధ్యాత్మిక ఔషధాన్ని నిర్దేశించారు మన పెద్దలు.
ఆషాఢ మాసం ఉత్తర, దక్షిణాయనాల సంధికాలంలో వస్తుంది. ఈ నెలలో హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గ్రామాల్లోనూ గ్రామదేవతలకు వేడుకలు చేసే ఆచారం కనిపిస్తుంది. తొలకరి జల్లుల వేళ వ్యాధులు ప్రబలుతాయి. వాటిని నివారించడానికి బోనాలు చక్కటి పరిష్కారం. తమను చల్లగా చూడమంటూ భక్తులు దేవతలను ప్రార్థిస్తారు. అదే సమయంలో బోనాల్లో విరివిగా ఉపయోగించే వేపమండలు బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి.
శ్రావణానికి శివమాసం అని పేరు. ఈ నెలలో భక్తులు శివనక్త వ్రతం ఆచరిస్తారు. నెలంతా ఏకభుక్తం (ఒకేపూట భోజనం) పాటిస్తారు. వర్షాలు విశేషంగా కురిసే శ్రావణంలో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది. ఈ క్రమంలో జీవక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏకభుక్తం నియమించారు. శ్రావణంలో మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తారు. ఈ వ్రతాల్లో భాగంగా ఇచ్చిపుచ్చుకునే వాయనాల్లో పచ్చిశనగలు ప్రధానంగా కనిపిస్తాయి. వర్షరుతువులో శరీరానికి మాంసకృత్తుల అవసరం అధికంగా ఉంటుంది. పచ్చిశనగల ద్వారా కావల్సినన్ని ప్రొటీన్లు లభిస్తాయి. వ్రత నియమాల్లో భాగంగా ఉపవాసం కూడా దేహ సాధనకు తోడ్పడుతుంది. శ్రావణంలో తారసిల్లే మరో పండుగ శ్రీకృష్ణాష్టమి. జన్మాష్టమి వేడుకలు ఉత్తారాదిన అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా స్వామికి నివేదించే పాల ఉత్పత్తుల వినియోగం వెనుక కూడా ఆరోగ్య లక్ష్యం కనిపిస్తుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే శ్రావణ పౌర్ణమి ఈ నెలలో మరో ప్రత్యేకం.
భాద్రపదంలో వచ్చే పెద్ద పండుగ వినాయక చవితి. తొమ్మిది రోజులపాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరిమళాలు ప్రసరిస్తాయి. సామూహిక శక్తిని చాటిచెప్పే ఉత్సవాలు ఇవి. వినాయకుడి ప్రతిమ చేసే మట్టి కోసం చెరువులు పూడిక తీస్తారు. తద్వారా కొత్త నీరు చెరువుల్లో చేరడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక స్వామి పూజలో వినియోగించే పత్రులు చెరువులో వేయడం వల్ల.. వరద జలాలు శుద్ధి అవుతాయి. ఈ పండుగ వెనుక పరమార్థం గ్రహించాల్సిన అవసరం ఈ కాలంలో ఎంతైనా ఉంది. ఇక భాద్రపద కృష్ణ పక్షం పితృదేవతలకు చెందినది. ఉత్తరాయణం దేవతలు కటాక్షిస్తే, దక్షిణాయనంలో పితృదేవతలు అనుగ్రహిస్తారట. పితరులు కన్నుమూసిన రోజును తలుచుకుంటూ.. ఆ పుణ్యతిథి నాడు తిల తర్పణాలు విడుస్తారు. శక్తి కొద్దీ దానధర్మాలు చేసి పితరులను తృప్తి పరుస్తారు.
బతుకమ్మ సంబురాలకు ఆలవాలం ఆశ్వయుజ మాసం. ఈ నెలలో దేవీ నవరాత్రులు నిర్వహించి.. శక్తి పూజ చేస్తారు. ప్రతి మహిళలోనూ మాతృమూర్తిని దర్శించాలన్న విజ్ఞతను కలిగిస్తాయి శరన్నవరాత్రులు. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయకూడదని చెబుతూ… విజయదశమి నాడు అపరాజితా దేవిని ఆరాధిస్తారు. ఇక ఆశ్వయుజ అమావాస్య దీపావళి చేసుకుంటాం. చీకట్లను తొలగించే పండుగ ఇది. లక్ష్మీదేవిని ఆరాధించి.. సమస్త సంపదలూ అనుగ్రహించాలని కోరుకునే పర్వం ఇది.
కార్తికం ఏతెంచిందంటే.. శివకేశవుల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శివయ్యకు అభిషేకాలు, దామోదరుడికి కల్యాణాలు జరుగుతాయి. ఈ నెలలో నిర్వహించే వన భోజనాలు ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతలోని సమష్టి తత్వాన్ని, సామరస్య భావాన్ని తెలియజేస్తాయి.
‘మాసాల్లో.. నేను మార్గశిరాన్ని’ అని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చాటిచెప్పిన నెల ఇది. మార్గశిరంలో విష్ణు ఆరాధన కొనసాగుతుంది. భగవద్గీత ప్రకటితమైన నెల ఇది. పరమేశ్వరుడికి ప్రణవం ఉపదేశించిన కార్తికేయుడు జన్మించిన నెల కూడా ఇదే! స్వామి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య షష్ఠినాడు పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహించాలని పెద్దలు సూచించారు. నిరుపేదలకు చలిబాధను నివారించడమే వ్రతంలోని ఆంతర్యం.
ఇలా ప్రతినెలా విశేషాలతో సాగిపోయే దక్షిణాయనం ఆధ్యాత్మిక సాధనకు, ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం.