ఆ రోజుల్లో రోమాన్ రాజ్య దురహంకారం, యూదా మత మౌఢ్యాంధకారం… ఈ రెండూ కలిసి అమాయకుల్ని బలి చేయసాగాయి. ఆ తరుణంలో ప్రభువు చల్లటి చూపులు ప్రజల్ని పలకరించాయి. ఆయన పావన కరాలు వారిని చెంతకు చేర్చుకున్నాయి. సముద్రమంత ఓదార్పునిచ్చాయి. కొండంత ధైర్యాన్నిచ్చాయి. వారికి ఆయా సమయాల్లో కావలసినంత సాయం చేశాయి. ఓ రోజు ప్రభువు జన సంచారం చేస్తుండగా ఒక అధికారి వచ్చి ఆయన కాళ్లపై పడ్డాడు.
‘అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే, ఆమె తప్పక బతుకుంది’ అని వేడుకోగా ప్రభువు అతని వెంట వెళ్లాడు. ఏసు ఆ అధికారి ఇంటికి వెళ్లేసరికి కొందరు పిల్లలు.. పిల్లన గ్రోవులు వాయిస్తూ ఉన్నారు. మరికొందరు ఓహో నినాదాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ తప్పించుకుంటూ ‘ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లేందుకు దారి ఇవ్వండి. ఆ చిన్నది నిద్రిస్తున్నదే కానీ, చనిపోలేదు కదా!’ అని వారితో అన్నాడు ప్రభువు. అక్కడున్న వారంతా ఏసును హేళనగా చూశారు. అపహసించారు. ప్రభువు ఆ జన సమూహన్ని అక్కడినుంచి పంపించేశాడు. లోపలికి వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ అమ్మాయి లేచి కూర్చున్నది.
అదే సమయంలో ఓ స్త్రీమూర్తి ‘పన్నెండేండ్లుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను. ప్రభువు వస్త్రం తాకితే నాకు జబ్బు నయమవుతుందా’ అని తనలో తాను అనుకుంది. ఆలస్యం చేయకుండా ప్రభువు వస్త్రం చెంగును తాకింది. ఏసు వెనక్కి తిరిగి, ఆమెను చూసి.. ‘కుమారీ ధైర్యంగా ఉండు. నీ విశ్వాసం చాలా గొప్పది. అదే నిన్ను బాగు పరిచేది’ అనడంతోనే ఆమె ఆరోగ్యం కుదుటపడటం మొదలైంది. ఈ సంఘటనలు రెండూ దావానలంలా దేశమంతటా వ్యాప్తి చెందాయి. ప్రభువు కారణ జన్ముడని ప్రజలు విశ్వసించడం మొదలైంది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024