ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేసి, ఆ మృణ్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది. మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి.
మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం పృథ్వీ తత్త్వం కలిగి ఉంటుంది. పృథ్వి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.
చిన్న విగ్రహం ఎందుకు?
వినాయక మంటపంలో గణపతి పెద్ద విగ్రహంతోపాటు చిన్న విగ్రహం కూడా పెడతారు ఎందుకు?
వక్ర తుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వ కార్యేషు సర్వదా॥
అని రోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ, వంకర తిరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవమా.. మేం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలూ రాకుండా చూడమని వేడుకుంటూ వినాయకుణ్ని స్తుతించే శ్లోకం ఇది. గణాధిపతిని కేవలం వినాయక చవితి నాడే కాకుండా ప్రతి రోజూ షోడశ ఉపచారాలతో విధిగా పూజిస్తుంటారు. నిత్యపూజల్లో, శుభకార్యాల్లో మొదటి పూజ పార్వతీ తనయుడికే చెల్లుతుంది. ఇక వినాయక చవితి సందర్భంగా వీధివీధినా మంటపాలు నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు.
వినాయకుడి భారీ విగ్రహాలను ఏర్పాటుచేస్తారు. భక్తులంతా ఆ వేడుకల్లో పాలుపంచుకుంటారు. పూజలో భాగంగా వినాయక ఉత్సవమూర్తిని విధిగా షోడశ ఉపచారాలతో అర్చించి అలంకరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మంటపంలో ఉన్న భారీ విగ్రహాన్ని పూజించడానికి సౌకర్యంగా ఉండదు. కాబట్టి, ప్రత్యామ్నాయంగా నిత్యపూజ నిర్వహించడానికి వీలుగా ఒక ఉపమూర్తిని (గణపతి చిన్న విగ్రహాన్ని) కూడా మంటపంలో పెట్టి, ఆవాహనం చేసి పూజించే సంప్రదాయం ఏర్పడింది. ఇది లోకాచారమే కానీ, చిన్న విగ్రహం తప్పనిసరిగా కొలువుదీర్చాలనీ, దానికే పూజలు నిర్వహించాలనే దానికి శాస్త్ర ప్రమాణం లేదు. వినాయకుడి పూజలో భాగంగా పసుపు గణపతిని చేసి పూజించాలని శాస్త్రం చెబుతున్నది.