పుట్టుక.. ఒకసారి. చావు.. ఒకసారి. చనిపోయేలోగా మళ్లీ పుట్టడమే దైవత్వం! అన్ని ప్రాణులూ శరీరధారిగా జన్మిస్తాయి!! మనిషికి మాత్రమే ఆత్మమూలంగా మరోసారి జన్మించే అవకాశం ఉంది. క్రీస్తు సూచించిన దైవమార్గం ఇది. ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా.. ఓ తీర్మానం చేసుకుందాం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మరోమారు జన్మించడానికి సిద్ధమవుదాం.
బైబిల్లో నీకొదేము, క్రీస్తు సంభాషణ అద్భుతమైన సందేశాన్నిస్తుంది. నీకొదేము యూదుల అధికారి, ప్రఖ్యాతి పొందిన పరిసయ్యుడు. ఆయనలో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. వాటన్నిటికీ పరిష్కారం కోసం ఏసు ప్రభువును కలుస్తాడు. క్రీస్తుతో ‘ప్రభువా! నీవు దేవుని దగ్గరి నుంచి వచ్చిన బోధకుడవని తెలుసు. దేవుడు తోడు ఉంటేనే ఇలాంటి సూచక క్రియలు చేయగలరు’ అని తన మనసులోని ప్రశ్నలన్నిటినీ ఏకరువు పెట్టాడు. అప్పుడు నీకొదేముకు క్రీస్తు ఒక సత్యాన్ని చెబుతాడు. అదే కొత్తజన్మ.
‘ఒకడు క్రొత్తగా (పైనుంచి) జన్మిస్తేగానీ, అతను దేవుడి రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను’ అని ప్రబోధించాడు క్రీస్తు. అప్పుడు నీకొదేము ‘అదెలా సాధ్యం ప్రభూ! మనిషి రెండోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మించగలడా?’ అన్నాడు. అందుకు క్రీస్తు ‘నీటిమూలముగా, ఆత్మమూలముగా జన్మిస్తే గానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు’ అని నిశ్చయంగా చెబుతాడు. ‘నీటి మూలముగా జన్మించేది శరీరం, ఆత్మ మూలముగా జన్మించేది ఆత్మ’ అని వివరిస్తాడు (యోహా ను 3:1-21). అది మరణం నుంచి జీవంలోకి వెళ్లడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక నావ.
‘క్రొత్తగా జన్మించడం’ అనే పదబంధానికి ‘పైనుంచి జన్మించడం’ అని అర్థం. ఒక వ్యక్తి హృదయంలో ఆధ్యాత్మిక మార్పు అది. ఆధ్యాత్మికంగా కొత్తగా జన్మించినవారు దేవుడి దృష్టిలో నూతన సృష్టి. కొత్తగా జన్మించడం అంటే మన పాపాలను ఒప్పుకోవడం, చేసిన తప్పులను మరోసారి చేయకపోవడం. దేవుడు సూచించిన మార్గంలో నడుచుకోవడం. అలాంటి విశ్వాసిపై దేవుడి కృప వర్షిస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడితో మమేకం కావాలంటే మరోసారి జన్మించాల్సిందే!
మనిషి మొదటి పుట్టుక దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి సరిపోదు. అందుకు దేవుడి ఆత్మమూలంగా జన్మించడం అవసరం. కొందరు నీటి బాప్టిజం నూతన జన్మకు తప్పనిసరి అనుకుంటారు. కానీ, ‘వ్యక్తి పూర్తి నమ్మకంతో ఏసు ప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది’ (యోహాను 1:12-13). నూతన జన్మ తర్వాత బాప్టిజం తీసుకోవాలి గానీ, బాప్టిజం వల్ల నూతన జన్మ కలగదు. తనను నమ్మిన విశ్వాసికి క్రీస్తు ఆపన్నహస్తం అందిస్తాడు. ‘నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను’ అని దేవుడి వాక్కు. పాప విముక్తి లేనిదే దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు.. సాధ్యం కాదు. కాబట్టి ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడిలా మరోసారి ఆత్మద్వారా జన్మించేందుకు సిద్ధపడండి. క్రీస్తు కృప కోసం ప్రార్థన చేయండి.
పాపాలను అంగీకరిస్తే..
నూతన హృదయం ధరించు లోకం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎక్కడ చూసినా కోపం, ద్వేషం, ధనాపేక్ష, అబద్ధాలు అన్యాయం, మోసం, దురాశ, లంచాలు ఇలాంటివి రాజ్యమేలుతున్నాయి. చాలామంది క్రీస్తును రక్షకుడిగా అంగీకరించినా.. తమ పాపపు జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు.
బైబిల్లో కొలస్సీ సంఘం కూడా క్రీస్తును విశ్వసించినప్పటికీ వారి మనసు మాత్రం రూపాంతరం చెందలేదు. అందుకే పౌలు వారిని హెచ్చరిస్తూ ‘పూర్వం మీరు అనుసరించిన వాటిని విసర్జించి నూతన హృదయాన్ని ధరించండి’ అని ఉద్బోధించారు. ‘మన పాపాలను మనం ఒప్పుకోకుంటే.. నమ్మదగినవాడు, నీతిమంతుడు అయిన ప్రభువు మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులను చేస్తాడు’ అంటున్నది పరిశుద్ధ గ్రంథం.
…? రెవ.డాక్టర్. కత్తి విక్టర్ పాల్