క్రీస్తు ప్రభువును దైవ పుత్రునిగా విశ్వసిస్తుంది క్రైస్తవ సమాజం. ఆయన బోధనలు , ఆయన చేసి చూపిన కార్యాలు ఇవన్నీ ఆ సమాజానికి ఆచరణీయాలు. నిత్యం ఆరాధనీయాలు. క్రీస్తులా నడవడానికి తమ తమ జీవితాల్లో ఆయన్ను క్షణక్షణమూ జపిస్తారు. ఆయనలా జీవించాలనీ శ్రమిస్తారు. అందుకే వారు క్రీస్తును అనుసరించే క్రైస్తవులయ్యారు. తమ జీవితాల్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకొని క్రీస్తులా పవిత్ర జీవనం గడిపి త్యాగాలు చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. క్రీస్తును సమాజానికి చూపే కృషిలో ప్రాణదానం చేసిన వారు, క్రీస్తులా ఆయన మహిమార్థం అద్భుతాలూ చేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని క్రైస్తవ సమాజం ‘సెయింట్’ అని పిలుస్తుంది. భారతీయ పరిభాషలో చెప్పాలంటే సెయింట్ అంటే మహర్షి అన్నమాట! ఈ సెయింట్ పేరు ప్రస్థావనకు వచ్చింది పదో శతాబ్దంలోనే!
అదీ 15వ పోప్ జాన్ పాల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అయితే అంతకు పూర్వం కూడా ఈ సెయింట్లు లేరని చెప్పడం హాస్యాస్పదమే! కానీ పోప్ ప్రకటనతో పదివేలకు పైబడి ఈ సెయింట్స్ ఉన్నారని తెలుస్తుంది. క్రైస్తవ సమాజం వీరికి పునీతులనే పేరు పెట్టుకుంది. వారి సత్ క్రియలన్ని నిత్యం స్మరిస్తూ ఉంటుంది. ఈ కోవలో మొదటి వరుసలోని వారు ప్రభువు పన్నెండుమంది శిష్యులు. వారిలో పోప్ అగ్రగణ్యుడు. సాక్షాత్తూ ప్రభువు ద్వారా నియమితుడైన తొలి పోప్గా ఆయన శిష్యుడు సెయింట్ పేతురు కనిపిస్తారు. క్రీస్తు వారసులుగా వస్తున్న పోప్ మహాశయులు క్రైస్తవ జాతికి నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూ, ప్రభువు కృప వారిపై సదా కురిసేలా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. సామాజిక సేవలో క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తూ ఉంటారు.