అన్ని బంధాల నుంచి విడుదల కావడమే.. మోక్షం. ఆ మోక్ష లోకంలోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. అలాంటి వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఎన్నెన్ని కానుకలు ఇచ్చినా, మరెన్నెన్ని ప్రార్థనలు చేసినా దక్కని మోక్షం నిరాడంబరత, వినయ గుణం, అణకువ, దాన గుణం అనే టిక్కెట్లు ఉంటే చాలు, చాలా తేలిగ్గా ప్రాప్తిస్తుందని ప్రభువు సూచించాడు. భౌతిక సంపన్నులు కాస్త తగ్గి తలదించక పోతే, మోక్షం దొరకడం దుర్లభమని ప్రభువు తెలిపాడు. ‘ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కన్నా.. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను’ (మత్తయి సువార్త 19:24) అని ప్రభువు వాక్యం. సూదిబెజ్జం చిన్నది, స్థూలాకారంతో ఉండేది ఒంటె.
చిన్న సూది బెజ్జంలోకి ఇంత పెద్ద ఒంటె అయినా ప్రవేశించడం ఎంతో సులభం కానీ, పరలోకంలోకి ధనవంతుడు ప్రవేశించడం చాలా కష్టమని ప్రభువు పేర్కొన్నాడు. అయితే ధనికులెవరికీ స్వర్గ ప్రవేశం దక్కదా? అనే సందేహం రావొచ్చు. సంపన్నులను కూడా ప్రభువు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే.. ఆ ధనికులు తమ సంపదనంతా బీదసాదలకు దానం చేసి, వారి బతుకుల్లో వెలుగులు నింపాలి. అంతేకాదు ప్రభువు వాక్యం ప్రకారం నడుచుకుంటే.. తప్పకుండా పరలోకంలో వాళ్లు స్థానం పొందగలరని ప్రభువు మాట. ధనవంతుడిగా ఉండటం నేరమేమీ కాదు. కాని, అది అవసరానుగుణంగా, మితంగా ఉండాలని ప్రభువు సూచించాడు. తనకున్న సంపద తోటివారి బాగు కోసం సద్వినియోగం చేయాలి. ఇరుగు పొరుగును ప్రేమించాలి. తాను ధనికుడనన్న అహం వీడి కిందికి చూస్తే… అందుకోలేని అనంత వైభవం దానంతట అదే వరిస్తుంది. పరలోక ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది.